లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు మరో 50 రోజుల్లోకి వచ్చేశాయి. నేతల మాటలు లక్ష్మణ రేఖను దాటుతున్నాయి. తెలుగుజనానికి కాస్త వెటకారం తోడైతే కానీ అసలు విషయం అర్థం కాదని నేతలకు కూడా తెలుసు. అందుకే మడతపెట్టే కథ తెరమీదకు వచ్చింది. ఇటీవలి కాలంలో దానికి కాస్త అశ్లీలత కలిసినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.మడతపెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నారు….
తిట్ల పురాణం తెలుగు రాజకీయాల్లో సాధారణ విషయం. ఎన్ని తిట్లు తిట్టినా ఇంకా రెండు మిగిలే ఉన్నాయన్న ఫీలింగ్ నేతల్లో ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పైగా దుష్ట చతుష్టయం, సన్నాసి లాంటి తిట్లు ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన పదజాలంగా మారిపోయాయి. స్టేజీ ఎక్కారంటే ప్రత్యర్థులను నాలుగు తిట్లు తిట్టకుండా అటూ వైసీపీ గానీ, ఇటు టీడీపీ నేతలు కాని ప్రసంగాన్ని ఆపే ప్రసక్తే లేదు. అనేక తిట్లకు మంచి పబ్లిసిటీ కూడా వస్తోంది. ఈ క్రమంలో మడిచీ అనే మాటకు సినిమా వాళ్లు నానార్థాలు జోడించి కూడా చాలా రోజులైంది. జగన్ రెడ్డి అన్న ఒక్క మాటకు ఇప్పుడు టీడీపీ వాళ్లంతా మడిచి పెట్టి సమాధానం చెబుతున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కార్యకర్తలను ఉత్తేజ పరిచే క్రమంలో జగన్ రెడ్డి ఒక మాట అన్నారు. చొక్కా మడతపెట్టి పనిచేయాలని వైసీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కూడా మడిచీ అనే మాట మాత్రం బాగా వైరల్ అయ్యింది. అంతే మరో సభలో చంద్రబాబు దాన్ని ప్రస్తావించారు. మీరు చొక్కా మడతపెడితే…టీడీపీ-జనసేన కార్యకర్తలు కుర్చీ మడతపెడతారని చంద్రబాబు సమాధానమిచ్చారు. ఇక ముఖ్యమంత్రి కుర్చీనే ప్రజలు మడతపెట్టి ఇంటికి పంపించే రోజులు రెండు నెలల్లో ఉన్నాయని నారా లోకేశ్ కూడా అటాక్ చేశారు. విజయనగరం జిల్లా శంఖారావం సభలో ఆయన కుర్చీ మడతపెట్టి మరీ చూపించారు. మడతపెట్టడం అనే మాటకు ద్వంద్వార్థాలు కూడా ఉన్నాయి. లాగి కొడతారన్న అర్థం కూడా అందులో వెదుక్కోవాల్సి ఉంటుంది.
బాక్సింగ్ లో నడుముకు పై భాగానే కొట్టాల్సి ఉంది. దానికి కింద కొడితే బీలో ది బెల్టు అన్న నియమాన్ని పాటిస్తూ..కొట్టిన వ్యక్తిని అనర్హుడిగా ప్రకటిస్తారు. రాజకీయాల్లో అలాంటిదేమీ లేదు.. ఎక్కడైనా కొట్టొచ్చు ఎవరు…ఎవరినైనా తిట్లతో కొట్టొచ్చు. ఏ మాట అయినా మాజీ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరిని నిండు సభలో అవమానపరిచినా…. వెనకేసుకురావడానికి పది మంది రెడీగా ఉంటారు…
అసెంబ్లీ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. నిండు సభలో.. ఆ సభలో లేని నారా భువనేశ్వరి పట్ల కొందరు వైసీపీ నేతలు అసభ్య పదజాలాన్ని వాడారు, హావభావాలను ప్రదర్శించారు. వల్లభనేని వంశీ మినహా మిగతావాళ్లెవ్వరూ కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. చంద్రబాబు లాంటి సంయమనం ఉన్న నాయకుడే భోరున ఏడ్చారంటే… వైసీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాజకీయాల్లో అదోక కోణం. అలాగని అప్పటి నుంచి నేతలు వారిని వారు సంస్కరించుకున్నారా అంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తోంది. నేతల భాష జారుడు బండమీద దిగజారడమే గానీ మెరుగు పడటం కనిపించడం లేదు. పైగా ఎవరు ఎక్కువ తిట్లు తిడితే వాళ్లు చాలా పాపులర్ అవుతున్నారు..గొప్పొళ్లు అవుతున్నారు..సీఎం జగన్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా వ్యతిరేక మీడియా సంస్థలను, ప్రత్యర్థి పార్టీలను కలిపి నాలుగైదు తిట్లయినా తిడతారు. దుష్ట చతుష్టయం అంటూ మొదలు పెడతారు…
ఎన్నికల నాటికి ఏపీ నేతల భాష మరింతగా చెడిపోయే ప్రమాదం ఉందన్న భయం ప్రతీ ఒక్కరిలో ఉంది. భావప్రకటనకు, సందేశం ఇవ్వడానికి వేరు దారి లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుర్చీ మడతపెట్టి అధికార పార్టీ నేతను ఇంటికి పంపిద్దామనుకుంటే తప్పులేదు. అందులో పది వెకిలి అర్థాలు వెదుకుతున్నారే..అదే పెద్ద సమస్య. మరి రాజకీయ జనం ఎప్పుడు బాగుపడతారో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…