టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించి రెండు వారాలు దాటుతోంది. ఆయన్ను చూసేందుకు ఆయనతో మాట్లాడేందుకు జగన్ ప్రభుత్వ ఆగడాలను వివరంచేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనతో రోజు ఉదయం వెయ్యి మంది వరకు సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం సూపర్ సకెస్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పాలిటిక్స్ చర్చనీయాంశమవుతున్నాయి.
గుంటూరు జిల్లాకు ముఖద్వారంగా ఉండే మంగళగిరి రాజకీయ చిత్రం 2024లో ఎలా ఉంటుందనేది ఇప్పటినుంచే ఆసక్తి రేపుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మంగళగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌గా నారా లోకేష్ కొనసాగుతుండడంతో ఏపీ రాజకీయాల్లో ఆ నియోజకవర్గం కీలకంగా మారింది. మంగళగిరిలో వైసీపీ వరుసగా రెండుసార్లు విజయం సాగించింది. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం మంగళగిరి వైసీపీ పరిస్థితి మూడు గ్రూపులు, ఆరు వివాదాలు అన్నట్లుగా ఉంది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిది ఓ వర్గం, తాడేపల్లి మండలానికి చెందిన సీనియర్ వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిది మరో వర్గం కాగా మంగళగిరి నియోజకవర్గంలో మంచిపట్టున్న సామాజికవర్గమైన పద్మశాలీలది మూడో వర్గమని ప్రచారం జరుగుతోంది. ఆ మూడు వర్గాల ఆధిపత్య పోరు మంగళగిరి వైసీపీని పట్టి పీడిస్తోంది. దొంతిరెడ్డి వేమారెడ్డి తాడేపల్లి మండలాన్ని ఓ రకంగా శాసిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మంగళగిరి పట్టణంలో పద్మశాలి సామాజికవర్గం ఎక్కువగా ఉంది. దాంతో మంగళగిరి సీటు తమదే అనే భావనలో ఆ సామాజిక వర్గం నేతలు ఉన్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన నేత కాదు. ఆయన పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని నుండి వలస వచ్చి మంగళగిరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మంగళగిరిలో ఆయనకు చెప్పుకోదగ్గ అనుచరులు కూడా లేరంటే ఆశ్చర్యపోక తప్పదు. అధికారం కోసం అవసరం కోసం వచ్చిన చోటామోటా నాయకులు తప్ప సీనియర్ నేతలుగా చెప్పుకునే ఏ ఒక్కరూ రామకృష్ణారెడ్డికి అనుచరులుగా లేరు. దాంతో ఆయనకు నియోజకవర్గంపై పెద్దగా పట్టు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మంగళగిరి స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో బీసీలకు కేటాయిస్తారని చేనేత సామాజిక వర్గానికి చెందిన నేతలుఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే మంగళగిరి నియోజకవర్గంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనధికారికంగా పెత్తనం చేస్తుంటారనే టాక్ గట్టిగా నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో సజ్జల నేరుగా రంగంలోకి దిగి సెటిల్ చేస్తారనే ప్రచారం ఉంది. దాంతో సజ్జలను ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యే ఆర్కే తప్ప మిగిలిన నేతలందరూ ఎవరికివారు పావులు కదుపుతున్నారు. అయినా టీడీపీ నుంచి నారా లోకేశ్ బరిలోకి దిగడం ఖాయం కావడంతో ఆయన్ను ఢీకొట్టగలిగే బలమైన నేత కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా ఆర్కే సామాజికవర్గానికి చెందిన మరో వ్యక్తినే తెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రెడ్డి వర్సెస్ కమ్మ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.