మణిపూర్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?

By KTV Telugu On 8 February, 2024
image

KTV TELLUGU :-

ఆంధ్ర ప్రదేశ్ లో కొద్ది రోజులుగా మణిపూర్ పేరు ఎక్కువగా వినిస్తోంది. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరిగినా.. చర్చ్ లు దగ్ఢం చేసినా ఏపీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని ఖండించలేదంటూ ఏపీ కాంగ్రెస్  కొత్త చీఫ్ షర్మిల పదే పదే  ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.  ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న క్రైస్తవ ఓటు బ్యాంకుకు గండికొట్టాలన్న ఉద్దేశంతోనే  కాంగ్రెస్ హై కమాండ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుళ్లు షర్మిల చేత  మణిపూర్ ఇష్యూని తెరపైకి తెప్పించారని వారు అనుమానిస్తున్నారు. అయితే  ఇది అంత వర్కవుట్ అయ్యే వ్యూహం అయితే కాదంటున్నారు   పరిశీలకులు.  దీన్ని అధిగమించడానికి  అవసరమైన   వాదనలు వైసీపీకి ఉన్నాయన్నది వారి మాట.

ఏపీ కాంగ్రెస్ చీఫ్  షర్మిల  తన సొంత పార్టీ వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దానికోసం ఢిల్లీ వెళ్లిన షర్మిల సోనియా రాహుల్ గాంధీల సమక్షంలోనే కాంగ్రెస్ లో తాను ఎందుకు చేరాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ.. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.  మైనారిటీలకు రక్షణ కల్పించేది సెక్యులర్ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు ఆమె. అందుకే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పుకొచ్చారు.  ఓకే అంత వరకు బానే ఉంది. ఆ తర్వాత ఆమె  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత   కొన్ని చోట్ల మాట్లాడుతూ  మైనారిటీ క్రైస్తవులపై ఏపీ ప్రభుత్వానికి ప్రేమ లేదన్నారు.

మణిపూర్ లో  క్రైస్తవులపై దారుణమైన దాడులు జరుగుతోంటే ఏపీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలేదు అని విమర్శించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలదీయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా క్రైస్తవ ఓట్లలో కొన్నింటిని అయినా చీల్చాలన్నది ఆమెను ప్రయోగించిన కాంగ్రెస్  వ్యూహం అయి ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ  షర్మిలకు కానీ ఒరిగేదేమీ ఉండదంటున్నారు రాజకీయ పండితులు. చిత్రం ఏంటంటే  మణిపూర్ లో ఘర్షణలు మతాల మధ్య చోటు చేసుకున్నవి కావు. అక్కడ ఉండే రెండు జాతుల మధ్య భూమికి సంబంధించిన హక్కుల కోసం అక్కడ గొడవలు జరిగాయి. దశాబ్ధాలుగా అక్కడి గిరిజనులైన కుకీలు,   మైదాన ప్రాంత ప్రజలైన మెయితీల మధ్య  హక్కుల కోసం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

వాటిని  మతాల మధ్య చిచ్చుగా కొంతమంది రాజకీయ నేతలు   మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్ లో కొండ ప్రాంతాల్లో మెయితీలు భూములు కొనడానికి లేదు.  అక్కడి భూములన్నీ  మన రాష్ట్రంలో వనాఫ్ సెవెంటీ చట్టం అమల్లో ఉన్న ఏజన్సీ ప్రాంతాల మాదిరిగా గిరిజనుల మధ్యనే లావాదేవీలు జరగాలి. భూములపై వారికి మాత్రమే హక్కులు ఉంటాయి.  అయితే మణిపూర్ లోయ ప్రాంతంలో ఉండే మెయితీలు తమని ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు. అలా చేరిస్తే  అపుడు వనాఫ్ సెవెంటీ చట్టం నుండి తమకు ఇబ్బందులు ఉండవన్నది వారి వ్యూహం. తమని ఎస్టీల్లో చేరిస్తే కొండ ప్రాంతాల్లో భూములు సొంతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఇది అక్కడి  గిరిజన కుకీలకు మైదాన ప్రాంత మెయితీలకు మధ్య ఉన్న తగాదా.

ఈ వివాదాన్నే మతాల మధ్య చిచ్చుగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏపీ కాంగ్రెస్ చూస్తోంది.  ఇక్కడే షర్మిల పప్పులో కాలేశారని చెప్పాలి. మణిపూర్ లో హింసాయుత దాడులు జరిగి 9 నెలలైపోయింది. ఇపుడక్కడ గొడవలు లేవు. పైగా అక్కడ చర్చ్ లతో పాటు హిందువుల ప్రార్ధనా మందిరాలు కూడా దగ్ధం అయ్యాయి. పోనీ అవి మతాల మధ్య దాడులే అని షర్మిల అంటోన్నది నిజమే అని వాదన కోసం కొద్ది సేపు నమ్మినా.. ఆ దాడులు జరిగే సమయంలో షర్మిల ఏం చేస్తున్నారు? వై.ఎస్.ఆర్.తెలంగాణా పార్టీ నాయకురాలిగా తెలంగాణాలో రాజకీయాలు చేస్తున్నారు. అపుడు మణిపూర్ గురించి ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. కొద్ది వారల క్రితం ఆమె కాంగ్రెస్ లో చేరే వరకు మణిపూర్ ప్రస్తావనే ఆమె ఎక్కడా తీసుకురాలేదు. మరి ఇప్పుడే  ఏపీలో ఎన్నికల ముందే ఆమెకు మణిపూర్ ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? అని నిలదీస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

అదీ కాకుండా మణిపూర్ లో హింసాయుత దాడులు జరిగినపుడు   వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో వాటిని ఖండించారు.  మైనారిటీలపై దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా..ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుంది?  మణిపూర్ క్రైస్తవులపై అమాంతం ప్రేమ ఒలకబోస్తోన్న షర్మిల మతాలను  తెరపైకి తీసుకు రావడం ద్వారా   మతోన్మాద శక్తులను రెచ్చగొట్టే పాపానికి  ఒడిగడుతున్నారని   మేథావులు అంటున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు వారు.  ఇటువంటి మతోన్మాద వ్యాఖ్యల పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విజ్ఞతతో వ్యవహరించాలని  వారు సూచిస్తున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి