టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కలిసి వేసిన ప్లాన్ ఏంటి. జనాన్ని ఆకట్టుకునే క్రమంలో కొత్త పోకడకు తెరతీశారా. మరొకరికి అవకాశం ఇవ్వకుండా వారే మొత్తం మీడియా స్పేస్ ను ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నారా. పైగా ప్రజలను ఆకట్టుకునే నినాదాలతో వాళ్లు టీడీపీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారా…
ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలంటారు. జనాదరణ ఉన్నప్పుడే రాజకీయ నాయకులు క్యాష్ చేసుకోవాలంటారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా అదే తగిన అదునుగా భావిస్తారు.పైగా తెలుగుదేశం పార్టీ అనేక అంశాల్లో ముందు పీకుడు, వెనుక పీకుడుగా ఉందన్న ప్రచారం బాగా పెరిగింది. దాని నుంచి కూడా డైవర్షన్ కోసం చంద్రబాబు, లోకేష్ ఒక ప్లాన్ వేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది అమలవుతుంది..
చంద్రబాబు కొన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న వాదన బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఎదుర్కోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా ప్రతిపాదిత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై కూడా స్పష్టత రాకపోవడానికి చంద్రబాబు భయమే కారణమని కొన్ని వర్గాల వాదన వినిపిస్తోంది. బీజేపీ కావాలనే పవన్ కల్యాణ్ ను ప్రోత్సహిస్తున్నప్పటికీ, తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినేనని జనసేనాధిపతి ప్రకటించినప్పటికీ చంద్రబాబు ఆయన పరివారం మౌనంగా ఉంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ కావాలనే తనను దిగ్గొట్టే ప్రయత్నంలో ఉందని కూడా చంద్రబాబుకు అర్థమైంది. టీడీపీ బలం తగ్గిందని ప్రచారం చేసేందుకు కూడా వైసీపీ ప్లాన్ వేసింది. దానితో అలాగే వదిలేస్తే పూర్తిగా దెబ్బతింటామని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. అంతే తన మదిలో మెదిలిన భారీ ప్రణాళికను అమలు చేస్తున్నారు.
చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు నడుస్తున్నారు. ఇకపై నిత్యం జనంలోకి వెళ్లడం మొదటిది. ఇప్పటికే నారా లోకేష్ తన యువగళం పాదయాత్రతో రోజూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. తాను వెళ్లిన ప్రతీ చోట వైసీపీ ఎమ్మెల్యేలపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. వారి అవినీతిని ఎండగడుతున్నారు. ఎంతెంత తిన్నారో చెబుతున్నారు.అదే టైమ్ లో చంద్రబాబు ప్రాజెక్టు బాట పట్టారు. గత నాలుగేళ్లలో ప్రాజెక్టులు ఎలా అథోగతి పాలయ్యాయో వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో ఎంత మేర పురోగతి సాధించామో.. ఇప్పుడు ఎంత ఆగిపోయిందో ఆయన వివరిస్తున్నారు. చంద్రబాబు పులివెందుల టూర్ అన్నింటికీ హైలైట్. ఆయన ఇచ్చిన నినాదం వైనాట్ పులివెందుల కొన్ని గంటల వ్యవధిలోనే జనంలోకి వెళ్లిపోయి సూపర్ హిట్ అయ్యింది. ఇకపై ఎన్నికలు పూర్తయ్యే వరకు చంద్రబాబు ఏదో విధంగా జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు బాట పూర్తయిన తర్వాత మరో ప్రోగ్రాంతో ఆయన జనంలోకి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ మినహా ఇతర నేతలకు మీడియా, సోషల్ మీడియాలో అటెన్షన్ దొరక్కుండా చూడటం చంద్రబాబు రెండో వ్యూహం . అందుకే లోకేష్ తిరుగుతున్నప్పుడే తను తిరగాల్సిన అవసరం లేదని తెలిసినప్పటికీ యువనేతకు పోగా మిగిలిన మీడియా స్పేస్ వేరేవారికి అందకుండా చూసేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎక్కడ చూసినా తమ వార్తలే వస్తే… ఇక బీజేపీ కోరుకున్న జనసేనానికి ప్రచారం వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయన్నది చంద్రబాబు ఆలోచనా విధానమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
నిజానికి లోకేష్ బాగా ఇంప్రూవ్ చేశారు. యువగళం సగ భాగం పూర్తయ్యే నాటికి ఆ యువనేత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యారు. జనాన్ని బాగానే ఆకట్టుకోగలుగుతున్నారు. లోకేష్ వస్తున్నారంటే గంటల తరబడి వెయిట్ చేసి గజమాలతో సత్కరించే అభిమానులు రెడీ ఐపోతున్నారు. వైసీపీ నేతలపై ఆయన ఆరోపణాస్త్రాలు సంధిస్తుంటే కేరింతలు కొడుతున్నారు. టీడీపీ గెలుపు ఖాయమన్న నినాదాలు వినిపిస్తున్నాయి. లోకేష్ ఒక పక్క దూసుకొస్తుంటే, మరో పక్క తాను నరుక్కు రావాలని చంద్రబాబు భావించడం వల్లే ఆయన కూడా మళ్లీ మళ్లీ జనంలోకి వస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కోస్తాలో ఉంటే చంద్రబాబు రాయలసీమలో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు కోస్తాలోకి ఎంటరై టీడీపీ కార్యకర్తల జోష్ పెంచుతారు. ఇప్పటికే చంద్రబాబు నోట పంచ్ డైలాగుల పర్వం మొదలైంది. త్వరలో వైసీపీపై సరికొత్త పంచులు పడటం ఖాయం. జనం ఎంజాయ్ చేయడమూ అంతే ఖాయం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..