KTV Telugu :-
ఆంధ్ర ప్రదేశ్ లో సినీరంగానికీ రాజకీయ రంగానికీ మధ్య చిన్న వార్ నడుస్తోంది. పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలకూ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా బ్రోపై కొద్ది రోజులుగా వివాదం రేగుతూ ఉంది. ఇపుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బ్రో సినిమాపై మంత్రులు, పాలక పక్ష నేతలు ఆరోపణలు చేయడాన్ని పరోక్షంగా తప్పు బట్టారు చిరంజీవి.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్-జనసేనల మధ్య కొద్ది వారాలుగా తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు దోహద పడుతున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే పాలక పక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూడా రోడ్డుమీద బట్టలు ఊడదీసి కొడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా విడుదల అయ్యింది. అందులో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబును కించపరిచేలా ఆయన్ను అనుకరిస్తూ ఓ డ్యాన్స్ సీన్ పెట్టారు
బ్రో సినిమాపై ఆరోపణలు చేస్తూనే పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ సినిమా తీస్తున్నట్లు అంబటి రాంబాబు సంకేతాలు అందించారు. దానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచన చేస్తున్నామన్నారు. దాంతో జనసేన నేతలు కూడా దీటుగా స్పందించారు. తాము కూడా అంబటి రాంబాబు పై ఓ సినిమా తీస్తున్నామని దానికి కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని వారు కూడా వ్యాఖ్యానించారు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైనా వెబ్ సిరీసులు ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. చివరకు బ్రో పెద్ద డిజాస్టర్ అంటూ అంబటి రాంబాబు ఆరోపించారు.
బ్రో సినిమాకు పెట్టుబడులు తెచ్చిన వారు నిబంధనలను పాటించారా లేదా? పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఆయన చెల్లించిన పన్ను ఎంత? అన్నది కూడా బయటకు రావాలంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చివరకు దీనిపై ఈడీకి ఫిర్యాదు చేయడానికే అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన ఢిల్లీ వెళ్లినపుడు దీనిపై మీడియాతో ఎక్కువగా మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రావల్సిన నిధుల గురించి చర్చించడానికే వచ్చామన్నారు అంబటి రాంబాబు.
మొత్తానికి బ్రో సినిమాపై అటూ ఇటూ వార్ చల్లారింది అనుకుంటోన్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు ప్రదర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఉండేవాళ్లు ప్రత్యేక హోదా గురించో.. రోడ్లు అభివృద్ది పథకాల గురించో ప్రయత్నాలు చేయాలి కానీ పిచ్చుక పై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడ్డం ఏంటని? చిరంజీవి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తమ్ముడికి మద్దతుగా అన్నయ్య చిరంజీవి గళం విప్పడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పవన్ అభిమానులతో పాటు జనసైనికులు ఎగిరి గంతేస్తున్నారు.
చిరంజీవి వ్యాఖ్యలపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చిరంజీవి తన తమ్ముడికి ఏది ధర్మమో చెబితే బాగుంటుందని అంబటి రాంబాబు అన్నారు. తాను కూడా చిరంజీవి అభిమానినే అన్న అంబటి .. పవన్ కళ్యాణ్ సినిమాలతో తనను అవమానించేలా సీన్ పెట్టి గిల్లడం వల్లనే తాము కూడా దానికి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో ఒకరు దాడి చేస్తే ప్రత్యర్ధులు ఎదురు దాడి చేయకుండా ఎలా ఉంటారని మరో సీనియర్ నేత పేర్ని నాని ప్రశ్నించారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…