ఛీ..ఛీ..ఇంత బతుకూ బతికి ఇంటి ఎనకాల చస్తానా అంటున్నారు అమాత్యుడు. మరి శవాలమీద పేలాలు ఏరుకునే ప్రయత్నం ఎవరు చేసినట్లు? కుటుంబసభ్యుడిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న నిరుపేదల పరిహారంలో ముడుపులు ఎవరు ఆశించినట్లు? సత్తెనపల్లినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబు మరోసారి ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. గంటా అరగంటా ఆడియోలతో పరువు పోగొట్టుకున్న అంబటిమీద ఇప్పుడో కుటుంబం నిందలేస్తోంది. రాజకీయాల్లో బురద చల్లటం మామూలే. కానీ ఆరోపణలు చేస్తోంది పూటగడవని పేదలు. కుటుంబాన్ని పోషించేవాడు ప్రమాదవశాత్తూ చనిపోయినా సానుభూతికి నోచుకోని నిర్భాగ్యులు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురక గంగమ్మ, పర్లయ్య దంపతుల ఆరోపణలు అంబటిరాంబాబుని ఇరకాటంలో పడేశాయి. కొండలరావు అనే వ్యక్తి పిలిస్తే హోటల్లో పనికి వెళ్లిన ఈ దంపతుల కొడుకు అక్కడ డ్రైనేజీలో ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం వచ్చిందని మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త నుంచి కబురందింది. ఓ స్థానిక నాయకుడిని వెంటతీసుకుని ఆయన్ని కలిసిన గంగమ్మ, పర్లయ్యలను పరిహారంలో సగం సొమ్ము అడిగారు. అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉందన్నా వినిపించుకోలేదు. న్యాయంకోసం మంత్రి అంబటిని ఆశ్రయించినా అడిగింది ఇవ్వాల్సిందేనని గదమాయించి పంపించారని బాధితులు భోరుమంటున్నారు.
రాజకీయనాయకులు సగం సొమ్ము అడిగారు. వాళ్ల మాట వినకపోతే ఏ పథకాలూ రావని పోలీసు అధికారి బెదిరించారు. దీంతో గంగమ్మ, పర్లయ్య ఓ దశలో పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. ఈ దంపతులకు ఎదురైన అనుభవాన్ని జనసేన బజార్నపెట్టింది. దీంతో బాధితులకు బెదిరింపులు మొదలయ్యాయి. కొడుకుని కోల్పోయిన నిరుపేద కుటుంబం పరిహారంలో కూడా సొమ్ము ఆశించారంటే ఏమనాలి? జనసేన రంగంలోకి దిగటంతో తానెవరినీ ఒక్క పైసా అడగలేదంటున్నారు అంబటి. నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. తానే సీఎం సహాయనిధి వచ్చేలా చేశానంటున్నారు. శాంక్షన్ చేయించాక వారి చేతికి చెక్కు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు అంబటి ఏం చెబుతారో! ఓ పక్క ప్రభుత్వం గడపగడపకీ సంక్షేమం చేరాలని ఆకాంక్షిస్తుంటే ఇలాంటి కక్కుర్తి పనులతో పరువుపోతోంది.