ధర్మాన ప్రసాదరావు మాట్లాడితే ప్రవచనం చెప్పినట్లు ఉంటుందంటారు. ఆయన ఒక ప్రీచర్ లా డైలాగులు వదులుతారని అంటారు. ఆయన మాట్లాడితే వినేందుకే జనం వస్తారంటారు. సోదరుడు కృష్ణదాస్ లాగ బూతుపురాణం కాకుండా ఆయన చాలా మెత్తగా మాట్లడాతారంటారు. ఆయన మాటల్లో తర్కం ఉందని కూడా చెబుతారు. అయినా ఎందుకో ధర్మాన గొంతులో ఇప్పుడు ఒక భయం ఒక అనిశ్చితి అంతకు మించి రాజకీయ భవిష్యత్తుపై ఒక అనుమానం కనిపిస్తున్నాయి. వైసీపీలో ధర్మానకు తొలుత మంత్రి పదవి రాలేదు. సోదరుడు కృష్ణదాస్ ను పార్టీ ఆదరించింది. అయినా ప్రసాదరావు ఓపిగ్గా ఎదురుచూశారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కృష్ణదాస్ ను తీసేసి ప్రసాదరావుకు మంత్రి పదవి ఇచ్చారు మినిష్టర్ అయినా తొలునాళ్లలో ప్రసాదరావు చాలా ఆవేశంగా కనిపించారు. ప్రత్యర్థులపై ఎగిరెగిరి పడేవారు. తర్వాతి కాలంలో వైసీపీకి ఎదురుదెబ్బలు మొదలైన తర్వాత ధర్మాన నిదానించారు. ఇప్పుడు కూడా ఆవేశపడి మాట్లాడాలన్న కోరిక ఆయనలోంచి బయటకు వస్తున్నా ధర్మాన మాత్రం దాన్ని అణిచివేసి నిర్వేదాన్ని ప్రదర్శిస్తున్నారు.
జగన్ ను పెద్ద హీరోగా చూపించాలన్నది ధర్మాన ప్రయత్నం. కాకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు అంత సీన్ లేదు. వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆ వ్యతిరేకత గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీల్లో బయటపడింది. దానితో ధర్మాన కుటుంబం ఆశలు ఆవిరవుతున్నాయి. జగన్ గెలుపు తమ విజయం రెండూ అనుమానమే అనిపిస్తోంది. దానితో జనాన్ని కసితీరా తిట్టాలనిపిస్తోంది. అయినా ఏదో ఆశ మనసు మార్చుకుని తమకే ఓటు వేస్తారన్న నమ్మకం. అదే ఇప్పుడు ధర్మాన చేత ఎంతో జాగ్రత్తగా మాట్లాడిస్తోంది. అర్థం చేసుకోండి మహాప్రభో అని ధర్మాన ప్రసాదరావు ఓటర్లను వేడుకుంటున్నారు. తాము మాట్లాడుతున్నప్పుడు మహిళలు లేచి వెళ్లిపోవడంలో తప్పేమీ లేదని ఆయన అంటున్నారు. ఇంట్లో పనులు ఉన్న వాళ్లు కొందరు గబ గబా వెళ్లిపోతే దాన్ని వైసీపీకి పెరుగుతున్న వ్యతిరేకతగా భావించాల్సిన పనిలేదని ఆయన అంటున్నారు. ప్రవచనకర్త ధర్మాన ఇప్పుడు ఏది మంచో ఏది మంచిది కాదో జనానికి విడమర్చి చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. గేట్లు బిగించి మరీ తాము ఆపినా జనం గోడ దూకి వెళ్లిపోతున్నారని మీడియాలో రావడం కరెక్టు కాదని ఆయన వాదిస్తున్నారు.
ధర్మాన ప్రస్తుతం జనానికి సంస్కారం నేర్పుతున్నారు. పథకాల ప్రయోజనాలు పొందుతూ జగన్ ను తిట్టడం సంస్కారహీనత అవుతుందని ఆయన హితబోధ చేస్తున్నారు. జగన్ ఇంట్లో డబ్బులు తెచ్చి పథకాలకు ఇస్తున్నారా అని కొందరు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని ధర్మాన సూచిస్తున్నారు. పథకాలు ఇచ్చే మనసు జగన్ కు ఉండబట్టే జనానికి డబ్బులు అందుతున్నాయని ధర్మాన విశ్లేషిస్తున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వైసీపీ ప్రభుత్వం కొత్త ఒరవడిని సృష్టించిందని అలాంటి ప్రభుత్వాన్ని ఉంచుకుంటారో వదులుకుంటారో జనమే తేల్చుకోవాలన్నారు. ధర్మాన జనంలో మరో భయాన్ని కూడా సృష్టించారు. వచ్చే ఏడాది మే వరకు ఫథకాలు అందడం ఖాయమని ఆ తర్వాత వాటి కొనసాగింపు కావాలో వద్దో జనం తేల్చుకోవాలన్నారు.
ధర్మానకు ఓటమి భయం పట్టుకుందని ఆయన మాటలను బట్టే తెలుస్తోంది. తాను పోటీ చేయడం గెలవడం ముఖ్యం కాదని ఆయన చెప్పుకుంటున్నారు. గెలిస్తే జనం కోసం అహర్నిశలు పనిచేస్తానని గెలవకపోతే శ్రీకాకుళం జిల్లాలో అందరితో స్నేహితుడిలా ఉంటానని ధర్మాన ప్రకటించారు. రెండు మూడు సార్లు వరుసగా ధర్మాన ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో వైసీపీ వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. సునాయాసంగా గెలుస్తామని చెప్పుకోవాల్సిన ఒక సీనియర్ నేత ఇలా మాట్లాడకూడదని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 175కు 175 సీట్లు వస్తాయని చెప్పాల్సిన తరుణంలో ధర్మాన రూటు మార్చుతున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. జగనే స్వయంగా వైనాట్ 175 అంటుంటే ధర్మాన లాంటి వాళ్లు నిరాశావాదాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కొత్త నీరు ప్రవహించే టైమ్ వచ్చేసింది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తనను వచ్చే ఎన్నికల్లో జగన్ పక్కన పెట్టేస్తారన్న అనుమానం ధర్మాన ప్రసాదరావుకు కలుగుతోంది. జగన్ నిర్ణయించుకుంటే ఇక అందులో మార్పు ఉండదని ధర్మాన ఆందోళన చెందుతున్నారు. దానితో ఆయన మాటల్లో కొంత నిరాశ కనిపిస్తోందని చెబుతున్నారు. మరి ధర్మాన బాధను అధిష్టానం అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.