బొత్స Vs గంటా ! చీపురుపల్లిలో బిగ్ ఫైట్ MISSION 2024-TDP-YSRCP-CBN-JAGAN

By KTV Telugu On 24 February, 2024
image

KTV TELUGU:-

చీపురుపల్లిలో  బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలన్న టీడీపీ ఆలోచన ఒక్క సారిగా వైరల్  గా మారింది. గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఒక సారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరు. ఈ సారి కూడా ఆయన సీటు మారడం ఖాయం. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడంలేదు.  సరైన నియోజకవర్గం కోసం చూస్తున్నారు. గతంలో పోటీ చేసిన గెలిచిన భీమిలిపై ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఆయనకు ఓ కొత్త టాస్క్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు.. చీపురుపల్లిలో ఆయనను నిలబెట్టాలని సర్వేలు చేయించారు. సర్వేల్లో మంచి ఫలితాలు రావడంతో ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించుకోవాలని గంటాకు సూచించినట్లుగా తెలుస్తోంది.  దీంతో చీపురుపల్లిలో హై వోల్టేజ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మంత్రి బొత్స సత్యనారాయణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయనగరం జిల్లాలో సీనియర్‌ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీ జిల్లాలో నడిపిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. చీపురుపల్లిలో గడిచిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు విజయం సాధించిన బొత్స.. ఐదోసారి ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు బొత్స సిద్ధమవుతున్నారు. ఆర్థిక, అంగ బలం పుష్కలంగా ఉన్న బొత్స సత్యనారాయణను ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న యువ నాయకుడు కిమిడి నాగార్జున వల్ల సాధ్యం కాదని ఆ పార్టీ భావిస్తోంది.  నాగార్జునను విజయనగరం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలని, చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది. తొలుత మీసాల గీత పేరును పరిశీలించింది. బొత్సపై ఆమె బరిలో దిగుతున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, మళ్లీ ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు మౌనం దాల్చాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా పోడిపోలేదు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయని గంటా.. ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వస్తున్నారు. 1999 నుంచి అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న గంటా శ్రీనివాసరావు రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ అధినాయకత్వం గంటాను చీపురుపల్లి నుంచి బరిలో దించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. గంటా తొలిసారిగా 1999లో ఎన్నికల బరిలో నిలిచారు. అనకాపల్లి ఎంపీగా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన గంటా, 2004లో చోడవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా మరోసారి విజయం సాధించారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గంటా శ్రీనివాసరావు పూర్తిగా మౌనం దాల్చారు. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. ఒకానొక దశలో అధికార వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగింది. గంటా రాకను మాజీ మంత్రి ముత్తంశెట్టి తీవ్రంగా వ్యతిరేకించడంతో వైసీపీ ఆయన రాకకు రెడ్‌ సిగ్నల్‌ వేసింది. ఆ తరువాత టీడీపీలో ఉండిపోయిన గంటా స్టీల్‌ప్లాంట్‌ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. రాజీనామాను ఆమోదించకుండా వైసీపీ అడ్డుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో గంటా మళ్లీ రాజకీయంగా యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన తరువాత మీడియా ముందుకు రావడం, నేతలతో సమావేశాల్లో పాల్గొనడం ద్వారా మళ్లీ టీడీపీలో యాక్టివ్‌ ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ఎమ్మెల్యేగా ఉన్న మళ్లీ భీమిలి వెళతారని ప్రచారం జరిగింది. అదే సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కూడా పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా చీపురుపల్లిలో బొత్సపై బరిలో దించేందుకు అధినాయకత్వం సిద్ధమైందని, ఈ మేరకు గంటా సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు చెప్పలేమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఏది ఏమైనా బొత్సపై చీపురుపల్లిలో గంటా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

నిజానికి గంటా శ్రీనివాసరావుకు ఇది ఓ రకంగా పరీక్ష లాంటిదే.  పార్టీ నేతలంతా వైసీపీ ధాటికి కేసులు పాలై.. ఆర్థికంగా నష్టపోయినా పోరాడారని కానీ.. పార్టీ మెరుగుపడిన తరవాతనే మళ్లీ యాక్టివ్ అయ్యారనే విమర్శలు వస్తునన సమయంలో  అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన బొత్స లాంటి వాళ్లతో పోటీ ప డటానికి సిద్ధమైతే.. పాతవన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. కిమిడి నాగార్జున కూడా.. గంటాతో కలిసి పని చేస్తే.. బొత్సను 2014లోలా ఓడించే అవకాశాలు ఉంటాయి. అది గంటాకు కూడా సవాల్ గానే ఉంటుంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి