ఈ సారి గూడెంలో గుడారం ఎవరిది ?

By KTV Telugu On 29 January, 2024
image

KTV TELUGU :-

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తాడేపల్లి గూడెం నియోజకవర్గానిది ఓ ప్రత్యేకత.  కూల్ అండ్ సైలెంట్ ఓటింగ్ తో కనిపించే నియోజకవర్గం తాడేపల్లిగూడెం. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే పాలిటిక్స్ అంత హాట్ హాట్ గా లేకపోయినా.. పోటా పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఆయనకు టిక్కెట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. టీడీపీ, జనసేన కూటమిలోనూ స్పష్టత లేదు. జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ కన్నా జనసేనకు ఇస్తేనే కూటమి విజయం సాధిస్తుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1999 తర్వాత టీడీపీ గెలవలేదు. కానీ టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు గెలిచారు. ఈ సారి కూడా టీడీపీ మద్దతుతో ఇతర పార్టీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తాడేపల్లి గూడెం గురించి పెద్దగా  ప్రచారం జరగని ఎన్నో అంశాలు ఉన్నాయి.   ఏపీలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఇదే తాడేపల్లిగూడెంలో ఉంది. మరోవైపు అక్షరాభ్యాసాలకు బాసర తరువాత తాడేపల్లిగూడెంలోని జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రసిద్ధి పొందినదిగా చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు వారు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా 2 కిలోమీటర్ల పొడవున్న రన్ వే నిర్మించారు. బెల్లం, పప్పు దినుసుల వ్యాపారానికి కూడా తాడేపల్లి గూడెం ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మరో ఎన్నికల పోరాటానికి సిద్ధమైంది. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఖరారు కాలేదు.

గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పోటీ చేసి 42 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి మధుసూధన రావు పోటీ చేసి 32 శాతం ఓట్లు రాబట్టారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ 22 శాతం ఓట్లు సాధించారు. బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ టిక్కెట్ ను ఆశించి.. రాకపోయే సరికి జనసేనలో చేరిపోయారు. నిజానికి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే… ఆ పార్టీల విజయం సునాయాసమై ఉండేది. ఓట్లు చీలడంతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఈజీ అయింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొట్టు సత్యనారాయణ కు మంత్రి పదవి వచ్చినా.. డిప్యూటీ అయినా ఆయన పని టీడీపీ, జనసేనలను ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను తిట్టడమే పని.  తాడేపల్లిగూడెంలో రోడ్లు సరిగా లేక జనం ఇబ్బందులు పడుతున్నారు.  తాగునీటి స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు పట్టించుకోలేదు.  గ్రౌండ్ లో యాక్టివ్ గా లేకపోవడంతో కొట్టు సత్యనారాయణకు మైనస్‌గా మారింది.  టీడీపీ జనసేన పొత్తుతో  పోటీ ఏకపక్షంగా మారిందన్న ప్రచారం ఇప్పటికే ఉద్ధృతంగా జరుగుతోంది.

తాడేపల్లిగూడెంలో కాపు సామాజికవర్గం ప్రజలు బలంగా ఉన్నారు.  వీరు ఎక్కువగా  జనసేన, టీడీపీ వైపే మొగ్గుతున్నారు.  గౌడ సామాజికవర్గంలో కూడా కూటమికే మొగ్గు కనిపిస్తోంది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడేపల్లిగూడెంలో కూటమికి పూర్తి స్థాయిలో ఆధిపత్యం లభించే అవకాశం ఉంది. జనసేన పార్టీకే కేటాయిస్తే  అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.  జనంలో ఉన్న మంచి ఇమేజ్, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, జనసేన, టీడీపీ పొత్తులు ఇవన్నీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపును సునాయాసం చేస్తున్నట్లు జనం అభిప్రాయంగా కనిపిస్తోంది.

ఈ సారి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన పొత్తు గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీ సారి కాపు సామాజికర్గం ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పోల్ అయ్యేవి. ఈ సారి అవన్నీ కూటమిలో భాగంగా పోలరైజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌పై కాపు నేతల్ని రెచ్చగొట్టడం  పూర్తి స్థాయిలో వైసీపీకి మైనస్ అయ్యే చాన్సులు ఉన్నాయి. ఈ సారి కూటమి అధికారంలోకి వస్తే..  పవన్ సీఎం అయినా అవకపోయినా.. డిమాండ్ చేసి మరీ కాపులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకోవచ్చన్న ఆలోచన ఎక్కువగా కాపు వర్గంలో ఉంది. ఇది కూటమికి మేలు చేయబోతోందని అంచనా వేస్తున్నారు. గూడెంలో ఈ సారి జనసేన గుడారం పాతడం ఖాయమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి