ఏపీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం.. ఖండించిన మంత్రులు

By KTV Telugu On 1 February, 2023
image

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీతో పాటు ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా టీడీపీ తమ ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆరోపించింది. ఎన్నికలకు ముందు జగన్ తన రాజకీయ వ్యవహారాలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగానే నడిపారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో పాటు సొంత పార్టీ నుంచి కూడా ఈ ఆరోపణలు రావడం విశేషం. చంద్రబాబుతో పాటు ఆ పార్టీలోని కీలకనేతల కదలికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిఘా పెట్టిందనేది ప్రధాన ఆరోపణ. దీనికితోడు అధికార పార్టీ ఎమ్మల్యేలు ఇద్దరు తాజాగా ఇవే ఆరోపణలుచేయడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయంటూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఉన్న రెండు ఫోన్లను తన పీఏ ఫోన్‌ని రెండేళ్ల నుంచి ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు ఆనం రాంనారాయణరెడ్డి. ఇక కోటంరెడ్డి ఏకంగా తన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని బయట పెడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయని వ్యాఖ్యానించారు. స్టేట్‌ గవర్నమెంట్ షేక్‌ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ విచారణ జరుపుతోందని కూడా మాట్లాడారు. వైసీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి జగన్ మంత్రి పదవి ఇవ్వలేదనే ఆక్రోశంతో ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దాంతో వెంకటగిరి ఇన్ ఛార్జ్ గా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని జగన్ నియమించారు. ఆనం సెక్యురిటీ తగ్గించడంతో పాటు సహాయనిరాకరణ కూడా పెరిగింది. దీంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు రామనారాయణ రెడ్డి. ఇప్పుడు అదే దారిలో కోటంరెడ్డి వెళ్తున్నారు. మంత్రి పదవి రాకపోవడం నియోజకవర్గంలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్న కోటంరెడ్డి తన కోటరీతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయనే ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మంత్రులు ఖండిస్తున్నారు. అలాంటి అవసరం ప్రభుత్వానికి లేదని పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్లే శ్రీధర్ రెడ్డి తమ్ముడికి అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనుందని తెలుస్తోంది. అయితే ఒకవేళ తన తమ్ముడు వైసీపీ నుంచి పోటీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోటంరెడ్డి చెబుతున్నారు. మొత్తంగా ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధినాయకత్వం పరేషాన్ అవుతోంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తీవ్రతరం చేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్న ఇంటెలిజెన్స్ ఛీఫ్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.