బీఆర్ఎస్‌ లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి?

By KTV Telugu On 7 February, 2023
image

ఏపీలో ఎన్నికలకు ముందు అధికార వైసీపీలో తిరుగుబాటు రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. అసమ్మతి నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీపై ధిక్కార స్వరం పెంచుతున్నారు. అటు టీడీపీలోనూ కొన్ని చోట్ల అసంతృప్తి రాజ్యమేలుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను టీడీపీలోకి వెళ్తానని బల్లగుద్ది చెబుతున్నారు. ఆయనకు టికెట్ ఖరారైనందునే తమపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ కూడా ఆరోపిస్తోంది. కానీ ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తోంది. ఆయన టీడీపీ కాకుండా బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతోపాటు తనను టార్గెట్ చేసిన పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని వరుస ప్రెస్ మీట్లతో కోటంరెడ్డి విరుచుకుపడుతున్నారు. దాంతో అధికార-ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాస్తా సైడ్ ట్రాక్ అయి జగన్ సర్కార్ వర్సెస్ కోటంరెడ్డి అన్నట్టుగా మాటల యుద్ధం నడుస్తోంది. కోటంరెడ్డికి టీడీపీ నేతలు కూడా అండగా నిలుస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆయన గులాబీ పార్టీలో చేరనున్నారనే ప్రచారం వేడి పెంచుతోంది.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరు వైసీపీలో తలనొప్పిగా మారింది. జగన్ సర్కార్ కోటంరెడ్డిపై వేటు వేయలేదు. అటు శ్రీధర్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయలేదు. ప్రభుత్వం కోటంరెడ్డికి ఇద్దరు గన్‌మెన్లను తొలగిస్తే రిటన్ గిఫ్ట్‌గా ఉన్న ఇద్దరినీ కూడా ఎమ్మెల్యే ప్రభుత్వానికి అప్పగించేశారు. ఈ తతంగమంతా నడుస్తోన్న సమయంలో తెరపైకి బోరుగడ్డ అనిల్ కుమార్ ఎపిసోడ్ వచ్చింది. అనిల్ కోటంరెడ్డిని హెచ్చరించడం ప్రతిగా గుంటూరులో ఆయన ఆఫీసును దుండగులు తగలబెట్టడం లాంటి పరిణామాలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోటంరెడ్డి కేసీఆర్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు రావడం సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ ప్రయారిటీ టీడీపీ అని కుదరని పక్షంలో బీఆర్ఎస్‌ తరపున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వారు బీఆర్ఎస్‌లో చేరాలని కోటంరెడ్డికి ఆహ్వానం పంపినట్టు సమాచారం. దీనికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న కోటంరెడ్డి పార్టీలో 35మంది ఎమ్మెల్యేలది అదే పరిస్థితని ఇటీవల చెప్పుకొచ్చారు. వారంతా అసంతృప్తితో ఉన్నారంటూ చెప్పడం చూస్తుంటే అందరూ బీఆర్ఎస్‌లో చేరుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభాల ఎర కేసు విషయంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే ఆనం, కోటంరెడ్డి రూపంలో ప్రభుత్వంలో చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పదుల సంఖ్యలో ఏపీకి చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే గంటాతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కూడా బీఆర్ఎస్ మంతనాలు జరుపుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తోంటే రాష్ట్రంలో ఏదో జరుగుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.