అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి స్వరాలు, తిరుగుబాటు రాజకీయాలతో అధికార వైసీపీ కుతకుతలాడిపోతోంది. నెల్లూరు వైసీపీలో మొదలైన ముసలం రాష్ట్రమంతా అంటుకుంటోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆనం, కోటంరెడ్డిల కారణంగా వైసీపీ అధిష్టానం కిందా మీద పడుతోంది. ఇక ఇది చాలదన్నట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లైన్ లోకి వచ్చారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు ఇబ్బంది పెడుతున్నాడంటోన్న మేకపాటి పద్ధతి మార్చుకోకపోతే దేనికైనా సిద్ధమంటున్నారు. ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుండగానే ముఖ్యమంత్రికి మరో తలనొప్పి మొదలైంది. గన్నవరంలో మరో పంచాయితీ షురూ అయ్యింది. నియోజకవర్గ నేతలు దుట్టా రామచందారావు, యార్లగడ్డ వెంకట్రావులు కొడాలి నాని, వంశీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్హతతో పాటుగా ఆస్తులకు సంబంధించి కొడాలి నాని, వంశీపై యార్లగడ్డ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వంశీ సీరియస్‌గా స్పందించడంతో గన్నవరంలో రాజకీయం గరగరంగా నడుస్తోంది.
గన్నవరంలో వంశీ వర్సెస్ దుట్టా, యార్లగడ్డ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరైన సమయం నుంచి యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ ఆగ్రహంతో ఉన్నారు. వంశీ పార్టీలోకి రావటాన్ని వారిద్దరూ వ్యతిరేకిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారి నియోజకవర్గ నేతలు రచ్చకెక్కుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ ఇవ్వాలని ఆ ఇద్దరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి కూడా పెంచుతున్నారు. అయితే కొడాలి స్నేహితుడైన వంశీ వైపు హైకమాండ్ మొగ్గుచూపుతోంది. వంశీకి టికెట్ ఇస్తే సపోర్ట్ చేసేది లేదని ఆ ఇద్దరు నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలోనే వంశీతో పాటుగా ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి ఈ ఇద్దరు నేతలు ప్రయివేటు సంభాషణల్లో చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి. ఈ ఇద్దరి వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్ అయ్యారు. పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతామంటూ వ్యతిరేకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఆ ఇద్దరు నేతల వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటోందన్న వంశీ, పర్సనల్‌గా తమను దూషించినందుకు తాము చేయాల్సింది చేస్తామంటూ చెప్పుకొచ్చారు. నియోకవర్గంలో ఏం జరుగుతుందో చూడమని చెప్పిన వంశీ క్లైమాక్స్ ముందే చెబితే సినిమా ఎవరూ చూడరని వారి స్టైల్లోనే వార్నింగ్ ఇచ్చారు. తాను గన్నవరం కోసం ఏం చేసానో అక్కడి ప్రజలకు తెలుసునన్న వంశీ వలస పక్షలుకు ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఈ పంచాయితీ అధిష్టానానికి తలకు మించిన భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. కృష్ణాజిల్లాలోనే మరో నియోజకవర్గం మైలవరంలో ఇప్పటికే వసంత సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్కరుగా అధిష్టానంపై ధిక్కారస్వరం పెంచుతున్నారు. దాంతో ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు అధికార వైసీపీని ఇరకాటంలో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.