జోగి రమేష్‌తో పడకుంటే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం తాను చూసుకోవచ్చు. కానీ ఆ వంకతో మైలవరం ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు ఆయన మనసులోని మరో ఆలోచనని చాటుతున్నాయి. నేతల మధ్య విభేదాలు ఆధిపత్యపోరు అధికారపార్టీకే పరిమితం కాదు. ఆ మాటకొస్తే ప్రతిపక్షపార్టీల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో స్వపక్షంలోనే విపక్షం తరహా రాజకీయాలున్నాయి. ఇదేదో అసాధారణమైనట్లు ఎక్కడా లేనిది తనొక్కడికే జరుగుతున్నట్లు వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న గోల చూస్తుంటే జంపింగ్‌కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుంది.
కొన్నాళ్లక్రితం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. మరి మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన కొడాలినానిది ఏ కులమో! అన్యాపదేశంగానో అనుకోకుండానో మాట్లాడటానికి వసంత నాగేశ్వరరావు అమాయకుడేం కాదు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు. మాజీ హోంమంత్రి. తన కొడుకుకు ప్రాధాన్యం ఇవ్వకుండా మైలవరం రాజకీయాల్లో వేలుపెట్టే జోగి రమేష్‌ని నెత్తిన పెట్టుకోవడం వసంతకు నచ్చలేదు. అందుకే ఆయన నోటెంట ఆ మాటలు వచ్చాయి.
తండ్రి మాటలతో తనకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు వసంత కృష్ణప్రసాద్. అయినా పార్టీ అధినాయకత్వం ఆయన్ని ఎలాంటి సంజాయిషీ అడగలేదు. కానీ కృష్ణప్రసాద్ పార్టీని నష్టపరిచేలా పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ పెద్దలకు అనుమానాలొస్తున్నాయి. గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో ముగ్గురు మహిళల మృతికి కారణమైన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ మంచివాడని కృష్ణప్రసాద్ వెనకేసుకొచ్చారు. తొక్కిసలాట ఘటనను హైలైట్ చేస్తూ టీడీపీని టార్గెట్ చేసుకున్న వైసీపీని సొంత ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి. ఇప్పుడేమో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని వసంత పశ్చాత్తాప పడుతున్నారు. పదిమంది రౌడీల్ని వెనకేసుకుని తిరగడం చేతకాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానంటూ నిట్టూర్పులు విడిచారు. పార్టీ ఎమ్మెల్యే అసందర్భ కామెంట్స్‌తో ఆయన ఆలోచనపై వైసీపీ అధిష్ఠానం ఆరాతీస్తోంది.
ఓ పక్క కొడుకు సన్నాయి నొక్కులు నొక్కుతుంటే వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీ అయ్యారు. దీంతో కృష్ణప్రసాద్ కోసం తెరవెనుక లాబీయింగ్ జరుగుతోందన్న అనుమానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ మైలవరంనుంచి పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకుని తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. దీంతో కృష్ణప్రసాద్ వైసీపీలో ఇమడలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను పక్కనపెడతారన్న అనుమానంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. పార్టీలోనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలతో కృష్ణప్రసాద్ సాధించేదేమీ ఉండదు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటే రాజకీయంగా తెరమరుగు కావడం తప్ప ఆయనకు ఉజ్వల భవిష్యత్తు అయితే ఉండదు.