మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంచి మూడ్ లోకి వచ్చినట్లున్నారు. ఇటీవలి కాలంలో ఆయన హ్యాపీగా కనిపిస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పని చేసే జగన్ లాంటి నాయకుడి కిందే పనిచేయాలని వసంత చెప్పుకుంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించి అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభించిందని అందుకే ఆయన హ్యాపీగా ఉన్నారని మైలవరంలో ఒక టాక్ నడుస్తోంది. నిజానికి మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ల మధ్య రాజకీయాలు గత కొంతకాలంగా ఆసక్తిగా మారాయి. అనుచరులు చేస్తున్న ఆగడాలకు తోడు వారు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారాయి. జోగి రమేష్ పై అలిగిన వసంత తన నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. తన ఇలాకాలో జోగి రమేష్ బహిరంగంగానే జోక్యం చేసుకుంటున్నారని వసంత పలు పర్యాయాలు ఆరోపించారు.
రాజకీయాల్లో ఎవరూ కాటన్ సీడ్స్ కాదని చెబుతారు. వసంత కృష్ణప్రసాద్ కూడా అంతే. జోగి రమేష్ పైనే కాకుండా వసంత కృష్ణప్రసాద్ పైన కూడా అవినీతి అరోపణలున్నాయి. వసంత అనుచరులు గ్రావెల్ మట్టి ఇసుక, ఫ్లైయాష్ లాంటివి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను డంప్ చేసి అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకున్నట్లు అధిష్టానానకి ఫిర్యాదు అందింది. వసంత కృష్ణప్రసాద్ సమీప బందువు అయిన కోటేశ్వరరావు ఈ అక్రమ రవాణాకు ప్రధాన సూత్రదారి అని మొత్తం వ్యవహారాలు అన్నీ అతని కను సైగల్లోనే జరగడం వేరే ఎవరికీ కూడా అవకాశం ఇవ్వకపోవడమే వివాదాలకు కేంద్రబిందువు అని వార్తలు వచ్చాయి. మంత్రి జోగి రమేష్ అనుచరులే వసంత కృష్ణప్రసాద్ అక్రమాలను బయట పెట్టడంతో పాటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
గత కొంతకాలంగా వీటిపిఎస్ నుంచి వచ్చే ఫ్లైయాష్ వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. వీటిపిఎస్ నుంచి వచ్చే బూడిదను తిరువూరు జగనన్న కాలనీలకు తరలించేందుకు మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే వసంతకు సంబంధం లేకుండా వర్క్ ఆర్డర్ ను అప్పగించడం పై వివాదం నెలకొంది. ఈ వివాదం చిలికిచిలికి గాలి వానై వారిద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. మరోవైపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనలోని అసంతృప్తిని ఆవేదనను దాచుకోలేక పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా పదే పదే వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ప్రతి విషయంలో మంత్రి జోగి రమేష్ ప్రమేయం పెరిగిపోవడం వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి జోగి రమేష్ పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో వసంత అసంతృప్తిని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనికితోడు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి జోగి రమేష్ అనుచరులు కవ్వించే విధంగా బ్యానర్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని కూడా వసంత వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఇబ్రహీంపట్నం ఫ్లైయాష్ పాండ్ వద్ద జోగి రమేష్ అనుచరుడు నల్లమోతు మధు ఎమ్మెల్యేను బూతులు తిట్టడం కూడా వివాదాస్పదమైంది. విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.
ఈ పరిస్థితుల్లో వసంత సీఎం జగన్ ను కలిశారు. సీఎం ఏం చెప్పారో తెలీదు. వసంత మాత్రం సైలెంట్ గా సంతోషంగా కనిపిస్తున్నారు. జగన్ అనుచరుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని స్నేహితుల వద్ద వసంత కృష్ణప్రసాద్ చెప్పుకుంటున్నారట.పైగా తాను వైసీపీలో జీవితకాల సభ్యుడినని వివరిస్తున్నారు. మరో పక్క వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చేసిన రాయబారం కూడా ఫలించిందన్నది కొందరి వాదన. వసంతను బూతులు తిట్టిన నల్లమోతు మధుకు అధిష్టానం ప్రతినిధులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దారికి రాకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అదీ అసలు సంగతి.