బిజెపి రెండు నాల్కల ధోరణి

By KTV Telugu On 9 May, 2024
image

KTV TELUGU :-

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికే కాదు..బిజెపి అగ్రనేతలకు కూడా రెండు నాలికలున్నాయి. బాబు లానే వారికీ రెండు కళ్ల సిద్ధాంతం ఉంది. అచ్చం బాబు రూటులోనే బిజెపి నేతలూ యూటర్నులు తీసుకోవడంలో ప్లేట్లు ఫిరాయించడంలో వారికి  వారే సాటి. వారు వేసినన్ని పిల్లి మొగ్గలు ఎవరూ వేసి ఉండరు. వారు చూపినన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు ఎవరూ చేసి ఉండరు. ప్రత్యేక హోదా నుండి పోలవరం దాకా..రైల్వే జోన్ నుండి మెట్రో రైలు దాకా పూటకోమాట..రోజుకో నిర్ణయం. ఏ ఎండకాగొడుగు పడుతూ విలువలు లేని రాజకీయాలతో దిగజారిపోతోంది కమలం పార్టీ.

తమది సైద్ధాంతిక పార్టీ అని చెప్పుకుంటారు కమలనాథులు. ఆ సైద్ధాంతిక పునాదులు కదిలిపోతున్నట్లున్నాయి. సిద్దాంతాలు..విలువలు..నైతికతలతో పనిలేదనే స్థాయికి బిజెపి అగ్రనేతలు  చేరిపోయారా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. యూ టర్నులకు,రెండు నాల్కల ధోరణికి  దేశ రాజకీయాల్లోనే ఛాంపియన్ గా చెప్పుకుంటారు చంద్రబాబుని. ఇపుడు చంద్రబాబు కూడా అసూయతో భయపడేలా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు.2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును మించిన అవినీతి పరుడు ఎవరూ ఉండరన్నారు మోదీ..అమిత్ షాలు. ఇపుడు ఆ ఇద్దరు నేతలు అదే చంద్రబాబు నాయుడితో జట్టుకట్టి ఎన్నికల బరిలో దిగారు.

గత ఎన్నికల ప్రచారంలో  పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు మోదీ.

ఈ ఎన్నికల ప్రచారంలో అదే చంద్రబాబును కీర్తిస్తూ బాబు-బిజెపిలతో పోలవరం వస్తుందంటున్నారు అమిత్ షా, మోదీలు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ హామీలతోనే 2014 ఎన్నికల్లో బాబు,మోదీలు ప్రచారం చేశారు. ఇద్దరూ అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించారు.

కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేతుల్లో పెట్టారు. అలా పెట్టినందుకు ఏపీకి ప్యాకేజీ ఇచ్చి ప్రత్యేక హోద పక్కన పెట్టారు.

ఇదేం అన్యాయం అని ఏపీ ప్రజలు అడిగితే.. చంద్రబాబే ప్యాకేజీ చాలు హోదా వద్దు అన్నారని అన్నారు.

అసలు పోలవరం ప్రాజెక్టును తనకి ఇవ్వాలని అడగడానికి చంద్రబాబు ఎవరు?  తాము కట్టాల్సిన ప్రాజెక్టును బాబు చేతుల్లో పెట్టడానికి బిజెపి ఎవరు? ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనడానికి చంద్రబాబు ఎవరు? బాబు ఒప్పుకున్నాడు కాబట్టి హోదా బదులు ప్యాకేజీ ఇస్తామనడానికి మోదీ ఎవరు? అటు చంద్రబాబు నాయుడి టిడిపి..ఇటు నరేంద్ర మోదీ  బిజెపిలు కలసి ఏపీ ప్రజలను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపిస్తోంది.అయితే గత అయిదేళ్లలో వైసీపీ ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? అని  టిడిపి నిలదీస్తోంది.

నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు నాయుడి టిడిపి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉంది. నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉంది. ఇద్దరూ కలిసి అధికారాన్ని పంచుకున్నారే తప్ప  బాధ్యతలు గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలు అటకెక్కించేశారు. గత ఎన్నికల ముందు ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుని విడిపోయారు. ఒకరి అవినీతిని మరొకరు ఎండగట్టుకున్నారు. మోదీ ప్రభుత్వపు రఫేల్ కుంభకోణంపై చంద్రబాబు మండి పడ్డారు. చంద్రబాబు  కుంభకోణాలపై మోదీ చిరాకు పడ్డారు. ఇద్దరూ కలిసి ఏపీని నిలువునా ముంచేశారు. అయిదేళ్ల క్రితం ఇద్దరూ ఎందుకు విడిపోయారో  కారణాలు చెప్పలేదు. ఇపుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పలేదు.

కానీ తమ కలయిక వల్ల ఏపీ మెరిసిపోతుందని ఇద్దరూ చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఎన్డీయేకి రాజీనామా చేశానన్నారు 2018లో చంద్రబాబు. మరిప్పుడు ఎందుకు కలిశారు? ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ భరోసా ఇచ్చారా? ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు వేదికనెక్కి ప్రజలకు ఆ విషయం చెబుతారా? రైల్వే జోను కూడా ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇస్తారా? ఏదీ చెప్పకుండా మేం కలిసిపోయాం అంటే జనం ఓకే అనేస్తారా? అంటున్నారు పరిశీలకులు.

వాళ్లు ఒకరినొకరు తిట్టుకుంటే  ఏమీ బాగాలేదనుకోవాలి. వాళ్లు చెట్టాపట్టాలేసుకుంటే అంతా అద్భుతంగా ఉందని నమ్మేయాలి. జనం వీళ్లకి గొర్రెల్లా కనపడుతున్నారా? అని రాజకీయ ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి