ఎన్డీయే కన్వీనర్ గా ఆయన…!

By KTV Telugu On 30 May, 2024
image

KTV TELUGU :-

జూన్ 4 తర్వాత ఏం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. ఇలాంటి ప్రశ్నలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ కు ముందు బీజేపీలో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. కమలానికి సొంతంగా బొటాబొటీ మెజార్టీ వచ్చినా, అంతకన్నా కాస్త తగ్గినా సీన్ సితార కావడం ఖాయమనిపిస్తోంది. ఆ పరిస్థితుల్లో ఎన్డీయేలో  కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నట్లుగా  కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారు….

ఐదు దశల ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి సాధారణ మెజార్జీ 272 వచ్చే అవకాశం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. మోదీ ప్రచారంలోనూ దీని తాలూకు అసహనం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం 400 ప్లస్ అంటూ కథనాలు  వండి వార్చిన బీజేపీ ఇప్పుడా మాట అనేందుకు కాస్త జంకుతోంది. మిత్రపక్షాలతో కలిపి కూడా 350 సీట్లు దాటకపోవచ్చన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. బీజేపీకి సొంత మెజార్టీ వచ్చి, మిత్రపక్షాలను కలుపుకుపోవడం వేరు..అసలు మెజార్టీ లేకుండా ఇతరుల మీద ఆధారపడటం వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు మెజార్టీ లేనప్పుడు కీలకాంశాలపై ఇతరుల సాయం తీసుకోవాల్సి వస్తుందని గుర్తించిన బీజేపీ… ఇప్పుడు అందుకోసం ఒక మెకానిజంను ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ఇప్పటికే మోదీ, అమిత్ షా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

గత అనుభవాలను కూడా బీజేపీ పెద్దలు సమీక్షిస్తున్నారు. అప్పుడెలా జరిగింది. ఇప్పుడెలా చేయాలి  లాంటి అంశాలపై ఒక స్పష్టత తెచ్చుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేను నడిపించేందుకు ఒక నేత ఉండాలని భావిస్తున్నారు.  ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి…

బీజేపీ అతి పెద్ద  పార్టీగా ఉన్నప్పటికీ.. వేరే పార్టీ నేతకు ఎన్డీయే కన్వీనర్ పదవి ఇచ్చి నడిపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీఎస్ నేత కుమారస్వామి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేర్లు వినిపిస్తున్నారు. అయితే తాజా  సర్వేల ప్రకారం బిహార్లో నితీశ్ పరిస్థితి, కర్ణాటకలో జేడీఎస్ తీరు ఏమంత బాగోలేదు. ఏపీలో చంద్రబాబు మాత్రం మళ్లీ రైజింగ్ స్టార్ అవుతున్నారు. అందుకే మోదీ, షా మళ్లీ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా భావిస్తున్నారు. యునైటైడ్ ఫ్రంట్, వాజ్ పేయీ హయాంలో ఎన్డీఏను చంద్రబాబు శాసించారు. కేంద్రంలో చక్రం తిప్పారు. ప్రధానమంత్రులుగా ఎవరు ఉండాలో డిసైడ్ చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పాత్రనే చంద్రబాబు పోషించాలని మోదీ-షా కోరుకుంటున్నారు. ఎందుకంటే.. బీజేపీని మరీ ముఖ్యంగా మోదీ-షాలను నమ్మి తటస్థ పార్టీలు ఏవీ కూడా మద్దతు ఇవ్వవు. ఉదాహరణకు ఒడిసా అధికార పార్టీ బీజేడీనే తీసుకుంటే మోదీని నవీన్ పట్నాయక్ పెద్దగా విశ్వసించరు. చిన్నవో పెద్దవో ఇలాంటి పార్టీలు దేశంలో కొన్ని ఉన్నాయి. వాటికి అటుఇటుగా 20 సీట్లు వస్తే కేంద్రంలో కీలకం అవుతాయి. మరి వీటిని మెప్పించి మద్దతు పొందాలంటే చంద్రబాబు లాంటి కీలక వ్యక్తి అవసరమని మోదీ-షా భావిస్తున్నారట. అందుకే చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవి అప్పగించే యోచనలో ఉన్నారని సమాచారం.

చంద్రబాబుకు కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న కోరిక ఉంది. ఏదో ఒక రోజున తనయుడు  నారా లోకేశ్ కు ప్రభుత్వంతో  పాటు పార్టీ పగ్గాలు అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మోదీ, షా వైపు నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే ఎన్డీయే కన్వీనర్ పదవిని చేపట్టేందుకు ఆయన వెనుకాడే అవకాశం ఉండదని టీడీపీ వర్గాలు అంటున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి