టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు- జనసేన నాయకుడు పవన్ కల్యాణ్- ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి లు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆ రెండు పార్టీల్లోనే గుస గుసలు వినపడుతున్నాయి. బిజెపి తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం నుంచి ఎంతో ఊహించారు. కానీ ఆయన ఊహించిన విధంగా మోదీ ప్రసంగించకపోవడంతో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా డీలా పడిపోయారు. టిడిపి శ్రేణులు సైతం బిజెపి వల్ల తమకి ఎలాంటి లాభం లేదంటూ సోషల్ మీడియాలో వైరాగ్యపు పోస్టింగులు పెడుతున్నాయి.అయితే చంద్రబాబు, పవన్ లెక్కలు వారికి ఉంటే..నరేంద్ర మోదీకి తనకుండాల్సిన లెక్కలు తనకున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే తమ లక్ష్యమంటున్నారు చంద్రబాబు నాయుడు . ఒంటరిగా ఎన్నికల బరిలో దిగే పరిస్థితి లేదని భావించిన చంద్రబాబు నాయుడు జనసేన-బిజెపిలతో పొత్తులు పెట్టుకున్నారు. మొత్తానికి మూడు పార్టీలు కలిసి జట్టు కట్టి కూటమి ఏర్పాటు చేశాయి. తమతో పొత్తుకు చాలా కాలంగా ఆసక్తి చూపని బిజెపి పెద్దలు ఎట్టకేలకు పొత్తుకు సై అనడంతో చంద్రబాబు లో సంతోషం ఉరకలు వేసింది. ఈ నేపథ్యంలోనే కూటమి తరపున మొదటి సభను చిలకలూరి పేటలో ప్రజాగళం పేరిట నిర్వహించారు. సభకు అనుకున్నంతగా జనాన్ని సమీకరించలేకపోయారని స్థానిక నేతలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు.
జనం లేకపోవడం ఒక విధంగా నిరాశ కలిగిస్తే.. బిజెపి నాయకుడుప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాటల దాడి చేయించాలనుకున్నారు చంద్రబాబు. అటు పవన్ కల్యాణ్ కూడా జగన్ మోహన్ రెడ్డిన మోదీ తన ప్రసంగంలో ఎండగట్టేస్తారని అనుకున్నారు. మోదీ దాడులు చేస్తూ ఉంటే తాము చప్పట్లు కొట్టాలని చంద్రబాబు పవన్ అనుకున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ను నైరాశ్యంలోకి నెట్టేస్తుందని వారు ఆశపడ్డారు. అయితే వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లే నరేంద్ర మోదీ ప్రసంగం సాగింది.
నరేంద్ర మోదీ ప్రసంగానికి ముందు మాట్లాడిన పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కూడా జగన్ మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. బాబాయ్ ని హత్య చేయించింది జగనే అన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి..ఒక్క పరిశ్రమ కూడా తేకుండా రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఇద్దరూ ఒకే విధమైన విమర్శలు చేశారు. ఇసుక, మద్యం కుంభకోణాలతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీని గంజాయి హబ్ గా మార్చారన్నారు. తాము చేసిన విమర్శల్లోంచి కొన్నింటిని అయినా నరేంద్ర మోదీ అంది పుచ్చుకుంటారని ఇద్దరూ ఆశించారు. అయితే వారు అనుకున్నది జరగలేదు.
పవన్, చంద్రబాబుల తర్వాత మాట్లాడిన నరేంద్ర మోదీ తన మొత్తం ప్రసంగంలో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించనే లేదు. వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. టిడిపి-జనసేనలతో పాటు ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి పదే పదే చేసే విమర్శలనూ నరేంద్ర మోదీ పట్టించుకోలేదు. దేశం మెరవాలన్నా..ఏపీ బాగుండాలన్నా ఎన్డీయేకి 400 ఎంపీ స్థానాలు ఇవ్వండి అని మాత్రమే అన్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల గురించి మోదీ మాట్లాడలేదు. కాకపోతే ప్రసంగం చివర్లో మాత్రం ఏపీ కోసం పవన్, చంద్రబాబులు చాలా కాలంగా ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపి కూటమికి పట్టం కట్టాలన్నారు.
ప్రత్యర్ధి పార్టీని ఓడించాలని కోరడం ఎన్నికల ప్రచారంలో రొటీన్. అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అయినా మరో పార్టీ అయినా విపక్ష కూటమి నేతగా మోదీ అలానే మాట్లాడాలి. కానీ పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీపైనా.. తెలంగాణాలో కేసీయార పైనా తమిళనాడులో డిఎంకే నేత స్టాలిన్ పైనా కర్నాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిపైనా విరుచుకు పడే నరేంద్ర మోదీ ఏపీలో మాత్రం జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. ఇదే టిడిపి అనుకూల బ్యాచ్ కు మంటగానూ నిరాశగానూ ఉంది. చంద్రబాబు, పవన్ లు కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు మౌనంగా ఉండిపోయారు. వారి మొహాల్లో ఎక్కడా కళాకాంతులు లేవు.
మోదీని అడ్డు పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని బాబు అనుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ నౌ వంటి ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ సర్వే తేల్చడంతో హ్యాట్రిక్ ప్రధాని అవ్వాలనుకుంటోన్న నరేంద్ర మోదీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని శత్రుపక్షం చేసుకోవాలని అనుకోవడం లేదుని అంటున్నారు. అందుకే ఆయన అటు టిడిపితో పొత్తు పెట్టుకున్నా..ఇటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై పెద్దగా దాడులు చేయకుండా వ్యూహం ప్రకారం నడుచుకున్నారని అంటున్నారు. ఈ వ్యూహం చంద్రబాబుకు కూడా అర్దం అయ్యే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…