Modi- Jagan – Sharmila – మోదీ చెప్పిన నిజం ? – ఆమె జగన్ వదిలిన బాణమేనా..

By KTV Telugu On 19 March, 2024
image

KTV TELUGU :-

జగనన్న వదిలిన బాణం..ఇది ఆంధ్రప్రదేశ్  పాలిటిక్స్ ఒకప్పుడు చాలా ఫేమస్  కొటేషన్. జగన్ జైలులో ఉంటే ఆయన తరపున పాదయాత్ర చేసిన షర్మిలను  ప్రశంసిస్తూ వైఎస్ కుటుంబ అభిమానులు వదిలిన ఒక కొటేషన్. కట్ చేసి  చూస్తే… జగన్ పైనే తిరగబడి  తొలుత తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్న షర్మిలా  రెడ్డి ఇప్పుడు కూడా జగనన్న వదిలిన బాణమేనా ఆయన ఆదేశాల మేరకే కాంగ్రెస్ లో చేరారా అన్న అనుమానాలు కొన్ని వర్గాల్లో కలుగుతున్న మాట వాస్తవం. దాన్ని ఎంత కొట్టి  పారేసినా… ఇప్పుడు స్వయంగా  ప్రధాని మోదీ నోటి వెంట రావడంతో అది చర్చనీయాంశమైంది…

ఎన్డీయేలో  టీడీపీ  తిరిగి చేరిన తర్వాత తొలి  ఉమ్మడి బహిరంగ సభ చిలకలూరిపేటలో  జరిగింది. ప్రధాని మోదీ ఆ సభకు వచ్చి మూడు పార్టీల కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. జగన్  ప్రభుత్వం తప్పిదాలతో రాష్ట్రం అథోగతి పాలైందని చెప్పేందుకు ప్రయత్నించినా, అంత ఫోర్స్ గా విమర్శలు  చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే  వైసీపీ, కాంగ్రెస్ వేరే వేరు  వ్యవస్థలు  కాదని రెండు ఒకటేనని ఆయన ఆరోపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ చెరో  పార్టీలో ఉంటూ లోపాయకారిగా పని చేసుకుంటున్నారని మోదీ అన్నారు. ఆయన నర్మగర్భంగా సీఎం జగన్ , జగనన్న సోదరి షర్మిలపై ఆరోపణలు సంధించారు. అది కూడా చంద్రబాబు నాయుడు జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన కాసేపట్లికే మోదీ  ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ  జగన్ పై టీడీపీ తరచూ ఆరోపణలు సంధిస్తుంటుంది. వైఎస్ వివేకా హత్య వెనుక జగన్ ఉన్నారని నర్మగర్భంగా టీడీపీ ఆరోపిస్తుంటుంది. చిలకలూరిపేట సభలో కూడా జగన్ అధికారదాహానికి బాబాయి వివేకా బలయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఇద్దరు  చెల్లెళ్లు రోడెక్కి జగన్ కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే… ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.  షర్మిలకు జగన్ అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించిన సభలోనే అన్నా చెల్లెలు ఒక్కటేనని  మోదీ వ్యాఖ్యానించడం  ఇప్పుడు పెద్ద ట్విస్ట్. సమకాలీన ఏపీ రాజకీయాలపై ఎన్డీయేలో ఉన్న  వైరుధ్యాలకు ఇదీ నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రజాగళం సభలో మోదీ సందేశం స్పష్టంగానే ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు రెండు పార్టీలను నడుపుతున్నారని ఆయన చెప్పడం ద్వారా అన్నాచెల్లెలు అనుబంధాన్ని ధృవీకరించారు. అందుకు  కారణాలు కూడా ప్రధానే స్వయంగా వివరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాకపోతే అనువాద చక్రవర్తిణి పురంధేశ్వరి సక్రమంగా  ట్రాన్స్ లేట్ చేయలేకపోవడం అక్కడకు  వచ్చిన జనానికి అర్థం కాలేదంతే….

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే పవన్ కల్యాణ్ మూడు పార్టీల పొత్తు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు  ప్రధాని మోదీ మరో  విధంగా అదే సంగతిని ప్రస్తావించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చాలన్న తపనతోనే సోదరుడు ఒక పార్టీని, సోదరి మరో పార్టీని నడిపిస్తున్నారని మోదీ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టడమే వారి ఉద్దేశమని,ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ట్రాప్ లో పడకుండా ఎన్డీయేకు ఓటెయ్యాలని ఆయన కోరారు. వాస్తవం చెప్పాలంటే మోదీ ఒక మాట  అన్నారంటే దానికి ఏదో మతలబు ఉంటుంది. కీలకాంశాలపై మాట్లాడేప్పుడు ప్రధాని స్థాయి నేత పూర్తి అవగాహనతో, సమగ్ర సమాచారంతోనూ మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ , షర్మిల అంటే పడని రాష్ట్ర బీజేపీ నేతలు ఏదో  చెప్పినంత మాత్రాన పబ్లిక్ మీటింగ్ లో మోదీ మాట్లాడేస్తారనుకుంటే పొరపాటే. ఆయనకంటూ ఇండిపెండెంట్ గా సమాచారం ఉంటేనే మాట్లాడతారు. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకుని  వాటి ఆధారంగా ఆయన మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని  మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ  బ్యాచ్ ప్రత్యేకంగా షర్మిలను ఎందుకు వెనుకేసుకు  వస్తుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. చెల్లెళ్లకు అన్యాయం చేశారని కోడై ఎందుకు కూస్తోంది. మరి నిజంగా చెల్లెళ్లకు అన్యాయం చేస్తే.. మోదీకి ఆ సంగతి అర్థంకాలేదా అన్నది కూడా ఒక ప్రశ్న అవుతుంది. మోదీ చెప్పిన  దాని ప్రకారం  ఆలోచిస్తే చంద్రబాబు ట్రాప్ లో జగన్  పడ్డారా.. లేక జగన్ ట్రాప్ లో టీడీపీ బ్యాచ్ పడిందా అన్నది సుదీర్ఘంగా ఆలోచించాల్సి వస్తోంది….

చిలకలూరిపేట సభలో మరో కోణం కూడా ఉంది. ప్రధాని మోదీ మాట్లాడేప్పుడే రెండు మూడు సార్లు మైకులు పనిచేయలేదు. జనం తీవ్ర  అసహనానికి లోను కావాల్సి వచ్చింది. కోపం వచ్చినా మోదీ చాలా సంయమనం వహించినట్లు ఆయన బాడీ లాంగ్వేజీని బట్టే తెలుస్తోంది. మోదీ సభకే సక్రమంగా మైకులు అరేంజ్ చేయలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని వైసీపీ  వాళ్లు జోకులు వేస్తున్నారు. పార్టీ బండారం  ఒక సభతోనే బయట పడిందని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఇదీ ఉమ్మడి సభ అంటూ మాట దాటవేస్తున్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి