ఆ ఒక్కటీ అడక్కు..?

By KTV Telugu On 29 June, 2024
image

KTV TELUGU :-

ఎక్కడైనా బావా అను..కానీ వంగతోట కాడ మాత్రం అలాంటి మాట అనకు అన్నది చాలా రోజుల నాటి సామెత.  ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి సామెతలు  పనిచేయడం లేదు.ఏమైనా అడుగు కానీ మీకు నిజంగా కావాల్సింది  మాత్రం మా దగ్గర లేదు, ఉన్నా ఇవ్వమూ అని  కేంద్రం అంటోంది..ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ఆశిస్తోందేమిటి. కేంద్రం ఎగవేస్తోందేమిటనేది మళ్లీ చర్చనీయాంశమవుతోంది. చాలా అంశాలున్నప్పటికీ ఆ ఒక్క అంశం మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. అదే స్పెషల్  స్టేటస్….

నాలుగు మంచి మాటలు, ఒక కప్పు కాఫీకి ఎప్పుడైనా రెడీ అని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు.లోక్ సభ స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన 16 మంది తెలుగుదేశం ఎంపీలను చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మీరాక  నాకెంతో సంతోషం సుమండీ అని ఆయన పాటలు కూడా పాడేసినంత పని చేశారు. ఎన్డీయే సభ్యులమైన మనమందరం ఒకటేనని.. తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవొచ్చని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా.. లేదంటే విడివిడిగా వచ్చినా పర్వాలేదన్నారు. మోదీ చాలా సరదాగా మాట్లాడారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులతో రావచ్చొని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తనతో ఓపెన్‌గా చెప్పాలన్నారు. దేశ, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పార్లమెంటు చర్చల్లో పాల్గొనాలని హితవు పలికారు. ఎంపీలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలసి ఉండాలని ఆకాంక్షించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని తెలుసుకుని అభినందించారు.అయితే ప్రధాని మోదీ వద్ద  కీలకాంశాలు  ప్రస్తావించే అవకాశం మాత్రం రాలేదని టీడీపీ ఎంపీలు లోలోన ఆవేదన చెందుతున్నారు…

విభజన జరిగి పదేళ్లయ్యింది. ప్రత్యేక హోదాకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోచుకోలేదు. పైగా స్పెషల్ స్టేటస్ అన్నది గడిచిన అధ్యాయమని బీజేపీ నేతలే కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు.  పోలవరం పూర్తి చేసేదెలాగో అర్థం కాక ఏపీ పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ఇక  విభజన హామీల అమలు విషయంలోనూ కేంద్ర సహకారం అందడం లేదు. ఈ అంశాలేమీ ప్రధానితో భేటీలో చర్చకు వచ్చినట్లుగా  కనిపించడం లేదు…

రాజధాని కూడా లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశే అవుతుందని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేక హోదా ఉంటేనే పన్ను రాయితీలు,  వెసులుబాట్లు ఉంటాయి. ఆ సంగతి తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రానికి ఎలాంటి సాయం అందించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు కనీసం పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని సూచించిన బీజేపీ వాళ్లే ఆ తర్వాత మౌనం వహించారు. పైగా కొందరు  బీజేపీ నేతలు తెలియక  మాట్లాడామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ లోపు  జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంతో ఏపీ  పరిస్థితి మరింతగా దిగజారింది. ఏపీ ప్రజలకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇప్పుడు చాలా అవసరం. కేంద్రం మాత్రమం ఆ విషయంలో ఏమీ మాట్లాడటం లేదు.  సంకీర్ణ ధర్మంలో టీడీపీ కూడా బహిరంగంగా అడగలేక మొహమాట పడుతోంది.పోలవరం పరిస్థితి కూడా అంతే. ఒక సోమవారం పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితిని అంచనా వేసి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు. అప్పటికల్లా పోలవరం పూర్తికావాలన్నా కేంద్రం నుంచి  నిధులు విడుదల కావాలి. అయితే ఎప్పుడో నిధుల విడుదల పూర్తయ్యిందని కేంద్రం చెబుతోంది. అమరావతి నిర్మాణానికి కూడా ఇబ్బడిముబ్బడిగా నిధులు విడుదల చేయాలి.  అప్పుడెప్పుడో మోదీ ఇచ్చిన నీళ్లు, మట్టి ఎందుకు  పనికి వస్తాయి.ఇలాంటి సంగతులన్నింటినీ ప్రస్తావించకుండా టీడీపీ ఎంపీలతో నాలుగు మంచి మాటలు మాట్లాడేసి పంపించేశారు.

టీడీపీ తక్షణ కర్తవ్యం ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏపీలో ఏ అంటే అమరావతి అని, పీ అంటే పోలవరం అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. ఏదోక రోజున సంకీర్ణ ప్రభుత్వ హానీమూన్ ముగిసిన తర్వాత కేంద్రంపై వత్తిడికి ప్రయత్నించాలి. సామదానభేదదండోపాయాలతో నిధుల విడుదలకు ప్రయత్నించాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి