ఈయనకు సోమవారం, ఆయనకు శుక్రవారం

By KTV Telugu On 18 June, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పరిపాలనలో మళ్లీ వారాల  లెక్క మొదలైంది. ఏ వారం ఎవరు  ఎక్కడుంటారో లెక్క తేలబోతోంది. ఇప్పుటికే సోమవారం పోలవారం అంటున్న సీఎం చంద్రబాబు… ఒక్క రోజు కూడా తీరిక లేకుండా ప్రజల్లో ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాలని నిర్ణయించుకున్నారు. జగన్ మాత్రం  ఏ హోదా లేని నాయకుడిగా తయారై.. కోర్టులు చుట్టూ తిరిగేందుకు రెడీ అవుతున్నారు… మాజీ సీఎంకు కష్టకాలమేనన్న ఫీలింగు రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది….

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర పునరావృతమవుతుందని అంటున్నారు. 2014 నుంచి  2019 వరకు రాష్ట్రంలో ఏ పరిస్తితి ఉందో ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతోందని చెబుతున్నారు. అప్పట్లో సోమవారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులుగా ఉండేవి. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని భావించిన చంద్రబాబు ప్రతీ సోమవారం క్షేత్ర స్థాయికి వెళ్లేవారు. అప్పట్లో సోమవారం పోలవారం అని కూడా అనే వారు. ప్రతీ సోమవారం పోలవారానికి వెళ్లి పనులను చంద్రబాబు పరిశీలించేవారు. వచ్చే వారం పాటు చేయాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసే వారు.  దాదాపు  నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు పోలవరంపై  ఫుల్ ఫోకస్ పెడితే 73 నుంచి 75 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను మాత్రం పూర్తి  చేసేందుకు జగన్ ప్రభుత్వం నిదాన వైఖరిని పాటించింది. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ ను మార్చేసింది. మేఘా ఇంజనీరింగ్ ను రంగంలోకి దించింది. నిధులు విడుదల చేయకపోవడంతో మేఘా సంస్థ ముందుకు సాగలేకపోయింది. ప్రభుత్వం  మారి చంద్రబాబు అధికారానికి రాగానే మేఘా సంస్థను పక్కన పెడతారన్న చర్చ మొదలైంది.  ఒకటి రెండు వారాలు చంద్రబాబు పరిశీలన చేసిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చంద్రబాబు ప్రతీ వారం పోలవరం వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరో పక్క జగన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు కేసుల విషయంలో ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా శుక్రవారం విరామం తీసుకుని హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు వెళ్లేవారు. 2019లో సీఎం అయిన తర్వాత మాత్రం కోర్టుకు హాజరు కాకుండా  మినహాయింపు పొందారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. కేవలం 11 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పొందలేకపోయారు. దానితో అనివార్యంగా ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన అనివార్యత ఆయనపై ఉంటుంది..

జగన్ రెడ్డి కేవలం శుక్రవారమే కాదు… ప్రతీ రోజు కోర్టుకు వెళ్లే పరిస్థితి  వస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చంద్రబాబు జంటిల్మెనే కానీ తాము ఆయన అంత మంచివాళ్లం కాదని టీడీపీ వర్గాలు అంటున్నారు. వైసీపీ హాయంలో జరిగిన ప్రతీ అవినీతి మీద కేసు పెట్టాల్సిందేనని టీడీపీ నేతలు వాదిస్తున్నారు….

జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు. కోర్టుల్లో కేసులు కూడా వేగం  పుంజుకునే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడాయన కోర్టుకు  హాజరు కావాల్సిన అనివార్యత ఏర్పడటంతో ట్రయల్ వేగం పుంజుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ మద్దతు కూడా ఆయన లేకపోవడంతో సీబీఐ దూకుడు పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ వారిపై వరుస కేసులు పెట్టి పలువురు నేతలను జైలులో వేశారు. వాళ్లంతా ఇప్పుడు రగిలిపోతున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అంటున్నారు. కక్షసాధింపు లాంటి చర్యలకు దిగాల్సిన అవసరం లేదని ప్రజల కోసం పని చేయాలని  చంద్రబాబు పిలుపునిస్తున్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. జగన్  రెడ్డి కక్షసాధింపు వల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేస్తూ.. ఆయన బలిదానానికైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని   చెబుతున్నారు. జగన్ పాలనలో జరిగి ప్రతీ అక్రమంపై  కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జగన్ పార్టీతో అంటకాగి, ప్రజలకు అన్యాయం చేసిన అధికారులను కూడా వదిలి పెట్టకూడదని టీడీపీ శ్రేణులు డిసైడయ్యాయి. ఇప్పటికే కొందరు అధికారులకు సెగ తగలడం మొదలైంది…

మునుపటి సీబీఐ కేసులు మాత్రమే కాకుండా తాజా కేసులు పడితే జగన్ శుక్రవారం  ఒక్క రోజే కాకుండా దాదాపు రోజూ కోర్టుకు  హాజరు  కావాల్సిన అనివార్యత ఏర్పడవచ్చు. తక్షణమే  అరెస్టు చేయకపోయినా.. రోజు వారీ కోర్టుకు హాజరు కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు శుక్రవారం కోర్టు వారమని కాకుండా… రోజూ న్యాయస్థానం ముందు నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి