కవిత రూట్లోనే మాగుంట.. ఈడీ ఎంక్వయిరీకి డుమ్మా

By KTV Telugu On 19 March, 2023
image

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరుకావాల్సిన కేసీఆర్‌ కూతురు కవిత మొన్న మొహం చాటేశారు. తను వెళ్లాల్సిన టైంకి లాయర్‌ని పంపించారు. మ్యాటర్‌ కోర్టులో ఉంది కాబట్టి 24దాకా ఎదురుచూడాలని చెప్పారు. అబ్బే మాకంత ఓపికలేదంటూ 20నే విచారణకు పిలిచింది ఈడీ. సుప్రీంకూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోవటంతో కవిత తప్పనిసరిగా హాజరుకావాల్సిందే. కాదూకూడదని మొండికేస్తే ఈడీ ఈసారి తనకున్న పవర్స్‌ అన్నీ వాడేసేలా ఉంది.
కవిత పద్దతి నచ్చిందో నాలుగురోజులు సాగదీస్తేనే మంచిదనుకున్నారోగానీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా అదే బాటలో పయనించారు. 18న ఈడీ ముందు హాజరుకావాల్సిన మాగుంట విచారణకు గైర్హాజరయ్యారు. చెన్నైలో ఉండటంతో విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఈడీకి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కొడుకు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్ట్ కావటంతో తన విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటారని ఎంపీ భయపడుతున్నట్లుంది.

ఇతర నిందితులు ఈడీ కస్టడీలోనే ఉండటంతో మాగుంట, కవితలను కూడా వారితోకలిపి విచారించే అవకాశాలున్నాయి. అందుకే ఏదో కారణం చెప్పి మాగుంట విచారణకు మొహం చాటేశారు. మొన్న కవిత ఇప్పుడు మాగుంట విచారణకు డుమ్మా కొట్టటంతో దీన్ని ఈడీ సీరియస్‌గా తీసుకుంది. 20న కూడా కవిత విచారణకు రాకపోతే అరెస్ట్‌దాకా వెళ్లొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరొకరు ఇలా చేయకుండా మాగుంట విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఈడీ ఉందంటున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటిదాకా 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇక కేసులో విచారించాల్సింది వీరిద్దరినే. కోర్టుకు అదే విషయం చెప్పిన ఈడీ కవిత మాగుంటల విచారణ తదుపరి చర్యలతో ఎంక్వయిరీకి ఎండ్‌కార్డు వేయాలనుకుంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్టయిన ఎంపీ కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు మార్చి 28దాకా పొడిగించింది. కేసుని జాగ్రత్తగా డీల్‌ చేస్తున్న ఈడీ నిందితులెవరూ తప్పించుకునే అవకాశం లేకుండా ఉచ్చుబిగిస్తోంది.