కాపు రిజర్వేషన్ల ఉద్యమనాయకుడు మాజీ మంత్రి సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరనున్నారు? వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా కాలం ప్రచారం జరిగినా..ఆయన తాను అందులో చేరడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీల్లో ఏదో ఒక దాంట్లో మా నాన్నగారు చేరతారని ముద్రగడ తనయుడు మీడియాకు చెప్పారు. ముద్రగడ పద్మనాభం మాత్రం నోరు తెరచి తాను ఫలానా పార్టీలో చేరతానని కానీ..ఫలానా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని కానీ ఇంత వరకు చెప్పకుండా చాలా కూల్ గా అన్ని సమీకరణలను పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ఆయన అనుచరులు సైతం ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారా? అని ఆసక్తిగా చూస్తున్నారు. కాకలు తీరిన రాజకీయ నాయకుడు కావడంతో ముద్రగడ పద్మనాభం పెదాలపై చిరునవ్వు చెదరకుంగా వ్యవహారాలు నెట్టుకొస్తున్నారు
జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత టిడిపిలో చేరి ఎన్టీయార్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగానూ వ్యవహరించారు. కాపుల రిజర్వేషన్లకోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ముద్రగడ పద్మనాభమే. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా కీలక పదవులు అనుభవించిన ముద్రగడ గత ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు రిజర్వేషన్లకోసం ఉద్యమించి సంచలనం సృష్టించారు. ఆ సమయంలోనే ముద్రగడ పద్మనాభం దంపతులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తునిలో కాపు ఉద్యమంలో రైలు దగ్ధం ఘటనలో చాలా మంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి.
2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాపు యువతపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. ఈ మధ్యనే అందరికీ రిలీఫ్ ఇస్తూ న్యాయస్థానం కూడా తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండచ్చని ప్రచారం జరిగింది. టిడిపితో జత కట్టిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగానూ ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు పవన్. అపుడు పవన్ ను నిలదీస్తూ ముద్రగడ బహిరంగ లేఖ రాశారు కూడా. ఆ పరిణామం తర్వాత ముద్రగడ వైసీపీకి మరింత చేరువ అవుతారని అందరూ అనుకున్నారు. ముద్రగడను కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది కూడా.
అయితే హఠాత్తుగా ముద్రగడ పద్మనాభం నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టారు. తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదన్నారు. ఆయన ముందుగా వైసీపీలో చేరాలనే అనుకున్నారని.. కాకపోతే తనతో పాటు తాను చెప్పిన కొందరికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని ఆయన షరతు విధించారని అంటున్నారు. దానికి జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతోనే వైసీపీలో చేరకూడదని ఆయన నిర్ణయించుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో ముద్రగడ ఇంటికి జనసేన నేతలు పదే పదే వెళ్లి ఆయన్ను జనసేనలో చేరాల్సిందిగా స్వాగతించారు. అప్పుడు కూడా ఆయన జనసేనలో చేరతానా లేదా అన్నది చెప్పలేదు.
తాజగా జనసేన కీలక నేతలు కొందరు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లారు. జనసేనలో ఎప్పుడు చేరతారో అడగడానికే వెళ్లారు. వచ్చిన నేతలందరినీ చాలా ఆప్యాయంగా ఆహ్వానించిన ముద్రగడ పద్మనాభం చాలా దూరం నుంచి వచ్చారు ముందుగా టిఫిన్లుచేద్దురుగారిని రండని పిలిచారు. వేడి వేడి ఉప్మా పెట్టించారు. అది తింటూనే కొందరు నేతలు మా పార్టీలో ఎప్పుడు చేరతారు సార్? అని అడిగారట. దానికి ఆయన వెన్నెల్లా నవ్వేసి కంగారు పడకండి ఉప్మా తర్వాత దోసలు వస్తాయి అవి కూడా తినాలి అని అతిథి మర్యాద చేశారు. కడుపు నిండా టిఫినీలు తినేసిన జనసైనికులు ముద్రగడ ఏం చెబుతారా అని ఆసక్తిగా చెవులు రిక్కించి కూర్చున్నారు.
అందర్నీ గమనిస్తోన్న ముద్రగడ పద్మనాభం అసలు విషయంలోకి వచ్చారు. అది సరే కానీ.. టిడిపితో పొత్తులో మన పవన్ కళ్యాణ్ బాబుకు ఏం ఇస్తారు? ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారా? కనీసం రెండేళ్లు చంద్రబాబు రెండేళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలా ఏమన్నా మాట అనుకున్నారా? ప్రభుత్వంలో జనసేన నేతలకు ప్రాధాన్యత ఇస్తామన్నారా? ముఖ్యమంత్రి పదవి కాకపోతే డిప్యూటీ సిఎం పదవి అయినా వస్తుందా? అని ప్రశ్నలపై ప్రశ్నలు సంధించడంతో జనసైనికులకు ఒక్కసారిగా పొలమారిందట. వాళ్లు బిక్కమొగాలేసే సరికి… ఇప్పటికీ మన కాపులకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియకపోతే ఎలాగయ్యా? అని జాలిగా అన్నారట. టిడిపితో కలిసి వెళ్లేటపుడు ఏదైనా సరే ఒప్పందం చేసుకోవలసిందే. ఆ తర్వాతే చేరాలి. టిడిపి నుండి ఏదైనా భరోసా ఉంటే చెప్పండి నేను ఇపుడే చేరిపోతాను అన్నారట ముద్రగడ. పదవుల గురించి మాట్లాడే స్థాయి తమది కాదని జనసైనికులు లేచి నిలబడి అది పవన్ కళ్యాణే చెప్పాలి సార్ అన్నారట. మళ్లీ కలుద్దాంలే అని ముద్రగడ ముగించారట…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…