కాపుల్ని కాపులతోనే కొట్టాలా. పవన్ ను దెబ్బేసేందుకు ఆయన సామాజిక వర్గంలోనే బలమైన నాయకుడిని రంగంలోకి దించాలా. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోందా.. కాపుల్లో విశ్వాసం కలిగించేందుకు ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి లాగుతున్నారా… ఒకటి రెండు రోజుల్లో ఆ పని అయిపోతుందా..
కాపు ఉద్యమ నేతగా, కాపుల్లో బలమైన నాయకుడిగా ముద్రగడకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాల రాజకీయ జీవితం ఇచ్చిన అనుభవంతో ఆయన ప్రజా నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. కాపుల రిజర్వేషన్ కోసం పోరాడే క్రమంలో కాస్త ఎదురీత తప్పకపోయినా ఇప్పుడాయన మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే ఆయన్ను ప్రోత్సహించాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకుని స్థాయికి తగ్గిన పదవి ఇచ్చి గౌరవించాలనుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తును త్వరలో ప్రకటిస్తానని ముద్రగజ ప్రకటించి ఐదారు నెలలైనప్పటికీ కొంత స్తబ్దత తప్పలేదు. ఈ సారి మాత్రం వైసీపీలోకి ఎంట్రీ పక్కా అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన అధికార పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తల్చేస్తున్నారు..
నిజానికి కాపుల్లో ముద్రగడ వీకైపోతుంటే అదే ప్లేస్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బలపడుతూ వచ్చారు. పవర్ స్టార్ ఇప్పుడు వైసీపీకి వైరి వర్గంలో ఉన్నారు. అధికార పార్టీని విమర్శించేందుకు ఆయన ఒంటికాలిపై లేస్తుంటారు. పవన్ ను దెబ్బకొట్టాలంటే ముద్రగడను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న సీఎం జగన్.. ఏది కావాలంటే అది ఇస్తానని కాపు ఉద్యమనేతకు హామీ పలికినట్లు తెలుస్తోంది.
ఏపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు బలంగా ఉన్న నేపథ్యంలో కాపులు మాత్రం రాజకీయాల్లో అంతగా రాణించలేకపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముద్రగడ సైతం చాలా కాలంగా ప్రభావం చూపలేకపోతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఓ సారి ఎంపీగా చేసినప్పటికీ తన చిరకాల డిమాండ్ అయిన కాపు రిజర్వేషన్ సాధించలేకపోతున్నారు. రాజకీయంగా ఉనికిని కోల్పోతానని కూడా ముద్రగడ భయపడుతున్న నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.పైగా పవన్ కల్యాణ్ కు, ముద్రగడకు పడటం లేదని తెలిసిన తర్వాత జగన్ ఆయన్ను బాగా ప్రోత్సహించాలని డిసైడయ్యారు. ఐదు నెలల క్రితం కూడా అనేక అంశాలపై పవన్ ను సవాలు చేస్తూ ముద్రగడ ఒక పెద్ద లేఖ రాశారు. ఆ లేఖ ప్రకంపనలు సృష్టించిన తర్వాత సైలెంట్ అయిపోయిన పద్మనాభం ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పవన్ ను పిఠాపురంలో పోటీ చేయాలని సవాలు విసురుతున్న ముద్రగడ అదే జరిగితే తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేసి ఆయన్ను ఓడిస్తానని చెబుతున్నారు. లేని పక్షంలో పోటీకి దూరంగా ఉండే ముద్రగడ తన తనయుడు గిరిబాబుకు ప్రత్తిపాడు టికెట్ ఇప్పించుకుంటారని తెలుస్తోంది. త్వరలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు ముద్రగడకు ఒకటి కేటాయిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైసీపీలో ఒక కాపు రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు.
పూర్తిగా వైసీపీ వైపుకు వెళ్లిపోయిన ముద్రగడ పద్మనాభం పట్ల కాపుల్లో ఒక వర్గం తీవ్ర ఆగ్రహం చెందుతున్న మాట వాస్తవం. అయితే వాళ్లంతా పవన్ కల్యాణ్ బ్యాచ్ అని ముద్రగడ అనుచరులు కొట్టిపారేస్తున్నారు. తామే కాపులను నిజమైన ప్రతినిధులమని చెప్పుకుంటూ పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అని విమర్శించేందుకు కూడా వెనుకాడటం లేదు. ఏదేమైనా ఎవరి సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…