ముగురమ్మల కీలక పోరు – AP POLITIUCS

By KTV Telugu On 19 March, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు మహా రంజుగా సాగనున్నాయి.  వైసీపీని గద్దె దించాలని టిడిపి-జనసేన-బిజెపిలు  జట్టు కట్టాయి. మరో వైపు వరుసగా రెండో సారి గెలిచి తీరాలన్న  పట్టుదలతో  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి   దూకుడు మీద ఉన్నారు. సిద్దం సభల విజయాలతో జోష్ మీద ఉన్న పార్టీ శ్రేణులు తాజాగా పార్టీ అభ్యర్ధుల మొత్తం  జాబితా ఒకేసారి విడుదల చేయడంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నాయి. టిడిపిని ఈ ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడించేస్తే ఇక టిడిపి  మనుగడే ఉండదని వైసీపీ భావిస్తోంది. ఈ పోరులో భాగంగానే కొన్ని  కీలక నియోజక వర్గాలపై ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేశారు జగన్ మోహన్ రెడ్డి.

ఈ ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. అందుకే పదే పదే ఈ ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తానని ఆయన ప్రకటించడం..తాజాగా అభ్యర్ధుల జాబితా విడుదల చేసిన సందర్బంలో  రెండు నెలల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాజిక న్యాయాన్ని మరింత గొప్పగా మరింత ముందుకు తీసుకుపోతాం అంటూ చాలా ఆత్మవిశ్వాసంతో  అన్నారు జగన్ మోహన్ రెడ్డి. తాము అధికారంలోకి రావడం గ్యారంటీ అనుకుంటోన్న జగన్ మోహన్ రెడ్డి  ప్రత్యర్ధి కూటమిలో కొందరిని ఓడించడానికి ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసినట్లు చెబుతున్నారు. హిందూపురంలో నందమూరి బాలయ్య, మంగళగిరిలో నారా లోకేష్, కుప్పంలో చంద్రబాబు నాయుడితో పాటు పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడానికి  కసరత్తులు చేస్తున్నారు.

చిత్రం ఏంటంటే  మంగళగిరి, పిఠాపురం, హిందూపురం నియోజక వర్గాల్లో  లోకేష్, పవన్ కల్యాన్, బాలకృష్ణలపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  మహిళా అభ్యర్ధులనే బరిలో దించుతోంది.  మంగళగిరిలో లోకేష్  గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ సారి ఎలాగైనా గెలవాలని ఆయన అనుకుంటున్నారు.  చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే మంగళగిరిలో  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గానికే చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది. ఇటీవల టిడిపి-జనసేనలు ఇక్కడే జయహో బీసీ సభను నిర్వహించారు.  మురుగుడు లావణ్య కుటుంబానికి మంగళగిరి నియోజక వర్గంలో మంచి పేరు ఉండడంతో పాటు వైసీపీ సంక్షేమ పథకాలు ఆమెను గెలిపిస్తాయని పాలక పక్షం భావిస్తోంది.

నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తోన్న హిందూపురం నియోజక వర్గంలో గత ఎన్నికల్లో  మైనారిటీ వర్గానికి చెందిన ఇక్బాల్ ను బరిలో దించింది వైసీపీ . ఆ ఎన్నికల్లో  బాలయ్య గెలిచారు. అయితే అయిదేళ్లలో ఆయన నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన  ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉండడంతో బాలయ్య విజయం ఖాయమని టిడిపి భావిస్తోంది. ఈ సారి బాలయ్యపై దీపిక అనే మహిళా అభ్యర్ధిని బరిలో దించారు జగన్ మోహన్ రెడ్డి.  అయిదేళ్లలో నియోజక వర్గంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని పాలక పక్షం లెక్కలు వేసుకుంటోంది. బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వడమే కాదు దీపిక సంచలన విజయం సాధించడం తథ్యం అని వైసీపీ నాయకత్వం అంటోంది.

ఇక జనసేన అధినేత  పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో పోటీ చేసిన  పవన్ కల్యాణ్ ఈ సారి ఆ రెండు నియోజక వర్గాలను వదిలిపెట్టేశారు. పిఠాపురం నియోజక వర్గంలో పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 90 వేల మందిదాకా ఉండడంతో అది తమకి అడ్వాంటేజ్ అవుతుందని జనసేన భావిస్తోంది. అందుకే పవన్ ఈ నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీ సీనియర్ నాయకురాలు వంగా గీతను బరిలో దించుతోంది. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వంగా గీత అంతకు ముందు ఇదే పిఠాపురం నుండి గెలిచారు.  ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడంతో పిఠాపురంలో వంగా గీతకు అవకాశాలు మెరుగవుతాయని అది పవన్ కు మరో సారి  భంగపాటు తప్పకపోవచ్చునని అంటున్నారు.

ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజక వర్గంపై నాలుగేళ్లుగా వైసీపీ  స్పెషల్ ఆపరేషన్  నిర్వహిస్తోంది. చంద్రబాబు హయాంలో జరగని ఎన్నో అభివృద్ధి పథకాలను కుప్పం నియోజక వర్గంలో  చేసింది. కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవిన్యూ డివిజన్ గా ప్రమోట్ చేశారు. యువకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను  ఇక్కడి నుండి బరిలో దించుతోంది వైసీపీ. కుప్పం లో వరుసగా ఏడుసార్లు గెలిచిన చంద్రబాబు ఎనిమిదో సారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే 2019 తర్వాత అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజక వర్గంలో టిడిపి చిత్తుగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని భరత్ గెలిచి మంత్రి అవుతారని వైసీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం మీద టిడిపి-జనసేనల్లో కీలక నేతలను ఓడించడానికి స్పెషల్ అసైన్ మెంట్స్  అప్పగిస్తున్నారు జగన్ …

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి