ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి-బిజెపి-జనసేన కూటమికి ఓటు వేయడం అంటే ముస్లింలు తమ కంటిని తమ వేలుతో పొడుచుకోవడమే అవుతుందంటున్నారు మేథావులు. కూటమికి ఓటేస్తే..ముస్లింలకు దివంగత వై.ఎస్.ఆర్. కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు అమాంతం రద్దు అయిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. ముస్లింల రిజర్వేషన్లను తాము ఎత్తివేయడం గ్యారంటీ అని ఇప్పటికే ఏపీ..తెలంగాణా బిజెపి అగ్రనేతలు స్పష్టం చేశారు. అయితే బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మాత్రం ముస్లిం రిజర్వేషన్లపై నోరు మెదపడం లేదు.
బిజెపితో పొత్తు చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతోంది. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రస్తుతం అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను కచ్చితంగా రద్దు చేస్తామని బిజెపి ప్రకటించింది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని కమలనాథులు అంటున్నారు. తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాము గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణాతో పాటే ఏపీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రకటన ప్రకంపనలు సృష్టించింది.
కిషన్ రెడ్డి తో పాటే ఏపీ బిజెపికి అధ్యక్షురాలైన దగ్గుబాటి పురందేశ్వరికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య బిజెపి విధానం. అది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది. ఆ క్రమంలో అది ఏపీకి కూడా వర్తిస్తుంది. ఈ ప్రకటన ఇప్పుడు చేయడం పట్ల పురందేశ్వరితో పాటు మిత్ర పక్షాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా షాక్ తిన్నారు. ఇప్పటికే బిజెపితో పొత్తు పెట్టుకున్నందుకు టిడిపి, జనసేనలపై మైనారిటీలు గుర్రుగా ఉన్నారు. అయితే వారిని మచ్చిక చేసుకోడానికి రంజాన్ సమయంలో చంద్రబాబు ముస్లింలతో భేటీ అయ్యారు.
తాము అధికారంలోకి వస్తే ఎప్పట్లానే ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా లేని విధంగా పథకాలు తెస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నా..మైనారిటీల విషయంలో తాము సానుకూలంగానే ఉంటామన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఈసమయంలోనే కిషన్ రెడ్డి ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడంతో చంద్రబాబు తో పాటు పవన్ కల్యాణ్ కి కూడ పచ్చి వెలక్కాయ గొంతుపడ్డట్లయ్యింది. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బిజెపితో ఎలా అంటకాగుతారని ముస్లింలు నిలదీసే ప్రమాదం ఉందని బాబు కంగారు పడుతున్నారు.
ప్రస్తుతం ఏపీ తెలంగాణాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అవి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు మత ప్రాతిపదికపై తెచ్చారన్న కొద్ది మంది విమర్శలను ఆయన శాసనసభ సాక్షిగా తిప్పికొట్టారు. మతం చూసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించలేదని సామాజికంగా ఆర్ధికంగా వారి వెనుక బాటును దృష్టిలో పెట్టుకునే రిజర్వేషన్లు కల్పించామని ఆయన అప్పట్లో వివరణ కూడా ఇచ్చారు.
ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం మైనారిటీలు తమ జీవితాల్లో ఈ పాటి వెలుగులు అయినా ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే అని చెబుతారు.
ముస్లిం రిజర్వేషన్ల విధానంతో వై.ఎస్.ఆర్. ముస్లింల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన మరణానంతరం ఆయన తనయుడు స్థాపించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కూడా మైనారిటీలు అండగా నిలుస్తున్నారు. మైనారిటీలను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుండి తమ వైపు ఆకర్షించుకోవాలని చంద్రబాబు ఆలోచనలు చేస్తోన్న తరుణంలో బిజెపితో పొత్తు పెట్టుకోక తప్పలేదు. అది చాలదన్నట్లు ఇపుడు బిజెపి నేతల వ్యాఖ్యలు ముస్లింలను టిడిపికి మరింత దూరం చేస్తాయని టిడిపి వ్యూహకర్తలు భయపడుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…