మైలవరం ఎవరికి వరం ఎవరికి శాపం? – MYLAVARAM-VASANTHA KRISHNA PRASAD

By KTV Telugu On 13 March, 2024
image

KTV TELUGU :-

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆ అసెంబ్లీ సీటును టీడీపీ ఎప్పుడూ బయటివారికే ఇస్తోంది. ఈసారి స్థానికులకే ఇవ్వాలని అక్కడి తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే..ఈసారి మాజీ ఎమ్మెల్యేకు బదులుగా గోడ దూకి  వచ్చిన ఎమ్మెల్యేకి సైకిల్ సీటు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీంతో స్థానిక పచ్చ పార్టీ నాయకులు లోకల్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారని టాక్. ఇంతకీ ఆ నియోజకవర్గం పేరేంటి? గోడ దూకిన ఆ ఎమ్మెల్యే ఎవరు?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పొత్తుల కోసం ఆరాటపడుతుంటే..తమ సీట్లు పోతున్నాయంటూ తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం మొత్తంగా పచ్చ పార్టీ బాస్‌కు తలనొప్పిగా మారిందట. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్ అయిన తనను ఎటు నుంచి ఎవరు పోటు పొడుస్తారో అని భయపడుతున్నారట చంద్రబాబు. ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నుంచి 2014లో గెలిచి మంత్రిగా చేసిన దేవినేని ఉమాను అక్కడి టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈసారి ఉమాకు టిక్కెట్ ఇవ్వొద్దని రెండేళ్లుగా స్థానిక టీడీపీ నేతలు, క్యాడర్ పట్టుబడుతున్నారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వరాదని స్థానికులు కోరుతున్నారు. వలస నేతకు కాకుండా లోకల్ గా ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని మైలవరం టీడీపీ నేతలు చంద్రబాబుకు గట్టిగా చెప్పారని టాక్ నడుస్తోంది. బొమ్మసాని సుబ్బారావు వంటి నేతలు ఆత్మీయ సమావేశాలు పెట్టి పార్టీ కోసం కష్టపడిన తమ వంటి వారికి టిక్కెట్టిచ్చి న్యాయం చేయాలంటూ క్యాడర్‌తో నేరుగా చంద్రబాబుకు లేఖలు కూడా రాయించారు.ఇదిలా ఉంటే..తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గోడ దూకి సైకిల్‌ ఎక్కడంతో టీడీపీలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంటోంది.

వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరందుకున్నప్పట్నుంచి ఆయన రాకను అటు దేవినేని ఉమా, ఇటు బొమ్మసాని సుబ్బారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేవినేని ఉమా ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి మరీ వసంత వంటి నేతలను తీసుకోవద్దంటూ పార్టీ అధినేతకు స్పష్టంగా చెప్పారు. దీంతో ఇటీవల దేవినేని ఉమాను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని మరీ నచ్చచెప్పారు. చంద్రబాబు మాటను తీసిపారేయలేక మీ ఇష్టమే నా ఇష్టమంటూ తలాడించినప్పటికీ…తనకు టిక్కెట్ రాకపోవడంపై దేవినేని ఉమ లోలోన రగిలిపోతున్నారట.

అధినేత మాటలకు ఉమా మెత్తబడ్డా… బొమ్మసాని మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారట. పార్టీ కోసం ఇన్నేళ్లనుంచి పనిచేస్తున్న తమను కాదని వసంతను టీడీపీలో చేర్చుకుని మైలవరం నుంచి బరిలోకి దించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట బొమ్మసాని. అదే సమయంలో తన బలం చూపించేందుకు తన మద్దతుదారులతో ర్యాలీలు, ప్రజాపాదయాత్ర పేరుతో బలప్రదర్శనలు నిర్వహిస్తున్నారట బొమ్మసాని సుబ్బారావు. బయటి వ్యక్తుల వల్ల పార్టీకి ఉపయోగం లేదని.. నేను లోకల్.. నేనే లోకల్.. నాకు మాత్రమే టిక్కెట్ అడిగే అర్హత ఉందని మైలవరం సీటు కోసం బొమ్మసాని గట్టిగా పట్టుబడుతున్నారట. తన మాట విని ఉమా వంటి వారే కామ్ గా ఉంటే బొమ్మసాని మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చంద్రబాబు ఖంగుతిన్నారట. మైలవరం సైకిల్ సీటు ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారట.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ టిక్కెట్‌ ఇవ్వడంలేదని చెప్పిన ఎమ్మెల్యేలను మహా ప్రసాదంగా చంద్రబాబు భావిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కూడా ఆ కోవకు చెందినవాడే. చంద్రబాబు సైకిల్‌ ఎక్కించుకుని సీటు ఇస్తానంటుంటే..బొమ్మసాని అడ్డుపడుతున్నాడని ఆందోళన చెందుతున్నారట. మరి సైకిల్ సీట్‌ ఫైట్‌లో వసంత, బొమ్మసానిలో ఎవరు గెలుస్తారో చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి