జనసేన పార్టీ నడుపుతున్న పవన్‌కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వారికే తెలియడంలేదు. స్థిరత్వం లేక పూటకో మాట రోజుకో మాట మాట్లాడుతూ క్యాడర్ ను కన్ఫ్యూజన్ చేస్తున్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఒక నాగబాబు అయితే ఒకసారి కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానంటారు. మరోసారి ఎంపీగా పోటీ చేస్తానంటారు. ఇంతకీ నాగబాబు ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారో అని జనసేన క్యాడర్ కంగారు పడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు పూర్తయినా ఇప్పటికీ పార్టీ నిర్మాణం లేదు. ఈ ఎన్నికలకు ముందే నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించుకున్నా పూర్తి స్థాయి నిర్మాణం జరగలేదు. ఇక పవన్ సోదరుడు నాగబాబు కూడా తన ధోరణితో జనసేన కేడర్‌లో గందరగోళం, అయోమయం సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి దారుణంగా పరాజయం పాలయ్యారు. ఎన్నికల తరువాత కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇకపై తాను సాధారణ కార్యకర్తగానే పార్టీలో కొనసాగుతానని తొలుత ప్రకటించారు. జనసేన నేతగా నాగబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన నాగబాబుకు మళ్లీ ఎంపీ పదవిపై మనసు లాగినట్లుంది. దీంతో ఈసారి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు తన ప్రయత్నాలను ప్రారంభించారంటూ జనసేన పార్టీలో చర్చ నడుస్తోంది.
ఈసారి నరసాపురం నుంచి కాకుండా అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని నాగబాబు చెబుతున్నా ప్రత్యేకంగా అనకాపల్లి నియోజకవర్గంలో సమీక్ష నిర్వహించడంపై పార్టీ నేతల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తన మనసులో మాటను నాగబాబు పైకి చెప్పకపోయినా..జరుగుతున్న పరిణామాలు చూసి జనసేన క్యాడర్ అయోమయానికి గురవుతుంది. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటులో టీడీపీ నుంచి తాను పోటీలో ఉన్నానంటూ బైరా దిలీప్ చక్రవర్తి ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాలవారీగా తిరుగుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. మాడుగులలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో అయ్యన్నపాత్రుడు తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇంకో వైపు తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న కూడా అనకాపల్లి ఎంపీ సీటు కోరుతున్నారు. తనకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో అనకాపల్లి ఎంపీ సీటునైనా ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా తాను ఎంపీ రేసులో ఉన్నట్లు సంకేతాలను పంపుతున్నారు.
రాష్ట్రంలోనే ఈ సారి అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గానికి అత్యంత గిరాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలోనే ముగ్గురికి పైగా నేతలు అనకాపల్లి సీటు కావాలని చంద్రబాబు దగ్గర అర్జీలు పెట్టుకున్నారు. జనసేన తరపున కొణతాలతో పాటు నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. ఒక వేళ నాగబాబుకే అనకాపల్లి టికెట్ ఇస్తే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణ జనసేనలో కొనసాగుతారా లేదా అన్నది చూడాలి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో మాత్రం అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో శషభిషలు లేవంటున్నారు.
అనకాపల్లి ఎంపీ సీటు హామీ తోనే కొణతాల జనసేనలో చేరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. టిడిపి, జనసేన పోత్తులో భాగంగా అనకాపల్లి సీటు ఏ పార్టీకి సీటు వస్తుందో తెలియని పరిస్థితి రెండు పార్టీల క్యాడర్ లో నెలకొంది. ఇప్పటికే ఈ ఎంపీ సీటు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ పడుతుంటే..ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాగబాబు రూపంలో తలనొప్పి మొదలయ్యిందని రెండు పార్టీల నాయకులు తల పట్టుకుంటున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…