జబర్దస్త్‌ నవ్వుకునేవారుగా.. ఇదేం కొట్లాట నాగరోజా!

By KTV Telugu On 7 January, 2023
image

జబర్దస్త్‌ ప్రోగ్రాంలో మొన్నటిదాకా కడుపుబ్బ నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేశారు. రోజా అయితే జోక్‌ పేలినప్పుడల్లా నాగబాబు భుజం చరిచి ఎంకరేజ్‌ చేసేది. ఎంత నాయకురాలైనా తను కూడా సిన్మా బ్యాక్‌గ్రౌండ్‌నుంచి వచ్చిన నటి. కానీ మెగా కుటుంబంమీద బయట కూడా రోజా పంచ్‌లు వేయడం ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. పవన్‌కళ్యాణ్‌ లైట్‌ తీసుకుంటారు. చిరంజీవి అస్సలు పట్టించుకోరు. కానీ మధ్యలో మిడిల్‌ బ్రదర్‌ ఉన్నాడుగా. తనెందుకు ఊరుకుంటాడు!
చిరంజీవి సోదరులపై మరోసారి నోరుపారేసుకున్నారు ఏపీ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా. ముగ్గురు అన్నదమ్ములు ప్రజలకు చేసిందేమీ లేదని కాబట్టి వాళ్ళను ప్రజలు గెలిపించరంటూ రోజా వ్యాఖ్యానించారు. దీంతో మెగాబ్రదర్‌ నాగబాబు రంగంలోకి దిగి రోజాని టార్గెట్‌ చేసుకున్నారు. ఆమె శాఖాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపించటమే కాదు వ్యక్తిగత దాడికి దిగారు.

ఇన్ని రోజులు అన్నయ్య, తమ్ముడి గురించి నోటికొచ్చినట్లు వాగావంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నువ్వెంత వాగినా నేను రియాక్ట్ కాకపోవడానికి కారణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ నోటికి మున్సిపాలిటీ చెత్త తొట్టికి పెద్ద తేడా ఏమీ లేదంటూ రోజాని ఓ రేంజ్‌లో తిట్టేశారు నాగబాబు. ఇండియాలో పర్యాటక స్థానాల ర్యాంకింగ్‌లో ఏపీ 18వ స్థానంలో ఉంది. ముందు నీ శాఖమీద దృష్టిపెట్టు అంటూ రోజాకు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు మరిచిపోయి నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాగితే పదవి ఊడుతుందన్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టూరిజం మీద ఆధారపడి వేలాదిమంది బతుకుతున్నారని వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు దుర్భరమవుతున్నాయని నాగబాబు దుమ్మెత్తిపోశారు. ఇతరుల మీద విమర్శలు మాని పర్యాటకశాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసుకోమంటూ రోజాకు హితవు చెప్పారు. నాగబాబే కాదు జబర్దస్త్‌ షోలో మేడమ్‌ మేడమ్‌ అంటూ మర్యాదిచ్చిన గెటప్‌ శ్రీను కూడా రోజా వ్యాఖ్యలను తప్పుపట్టాడు. అసలు పని వదిలేసి ఆ ఫ్యామిలీని తిట్టడం అవసరమా రోజమ్మా?