కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో అసలు రోడ్ మ్యాప్

By KTV Telugu On 10 April, 2023
image

పార్టీకి ఛరిస్మా సృష్టించడమే ధ్యేయంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పనిచస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న నాయకులతో విజయావకాశాలను మెరుగు పరుచుకోవడం కష్టమని గ్రహించిన మోదీ అమిత్ షా నడ్డా బృందం కొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. ఏపీలో ముందున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పుడున్న నాయకుడు సోము వీర్రాజు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేకపోయారని గ్రహించిన అధినాయకత్వం కొత్తనీరును పారించేందుకు పాచికలు వేసింది. ఆ దిశగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాషాయ కండువా కప్పిందని అనుకోవాలి. కిరణ్ మాస్ లీడరా అని ఎవరైనా అడిగితే అవును కాదు అని కరెక్టుగా చెప్పలేం. ఆయన మాట తీరు మాత్రం ఆకట్టుకునేదిగా ఉంటుంది. పంచ్ డైలాగులు జనంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ లో తిరిగి చేరిన తర్వాత కిరణ్ అక్కడ ఇమడలేకపోయారు. హస్తం పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇకపై అధికారానికి వస్తామన్న నమ్మకం లేకే కిరణ్ బీజేపీ వైపు చూశారనుకోవాలి. కాషాయ పార్టీకి కూడా కొత్త మొహాలు అవసరం. అదీ జనానికి పరిచయం ఉన్న మొహాలైతే బావుంటుందని కమలనాథులు డిసైడైపోయారు.

బీజేపీకి కాస్తో కూస్తో కోస్తాలోనే బలముంది. రాయలసీమలో ఆ పార్టీకి మద్దతు నిల్ టీజీ వెంకటేష్ సీఎం రమేష్ లాంటి వలస నాయకులు పార్టీలో పాతుకుపోయినా కేడర్ బలాన్ని పెంచలేకపోయారు. ఎందుకంటే పరాన్న జీవులైన ఆయా నేతలకు ఎలాంటి ఛరిస్మా లేదు. అందుకే కిరణ్ ను బీజేపీ భుజం తట్టి రారమ్మని పిలచిందనుకోవాలి. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్ నాథ్ రెడ్డి కాలం నుంచి పీలేరు వాయల్పాడు కలికిరి ప్రాంతాల్లో ఆ కుటుంబానికి మంచి పట్టుంది. అమర్ నాథ్ రెడ్డి ఏపీ మంత్రిగా పనిచేయడం కిరణ్ ముఖ్యమంత్రి కావడంతో వాళ్లు స్టేట్ లీడర్స్ గా ఎదిగారు.

బీజేపీ ఇప్పుడు బలమైన రెడ్డి సామాజికవర్గంపై ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆయన సామాజికవర్గమే అసంతృప్తిగా ఉంది. ఎవరినీ లెక్కచేయరని ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరన్న పేరు పడిపోయింది. పైగా జగన్ చేసిన తప్పులకు తాము తిట్లు తినాల్సి వస్తోందని రెడ్లు ఆవేదన చెందుతున్నారు. అలాంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలంటే పది మందికి తెలిసిన అసలు సిసలు రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ డిసైడై కిరణ్ కు గాలం వేసింది. ఏపీలో బీజేపీకి అస్తిత్వ సమస్య ఉంది. పట్టుమని ఒక శాతం ఓటు కూడా లేని పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని టీడీపీ జనసేన ప్రశ్నిస్తున్నాయి. పైగా జనంపై సమ్మోహనాస్త్రం వేయగల నాయకుడు కూడా లేడని విమర్శలు వస్తున్నాయి. వాటన్నింటి నుంచి బయటపడి తమది వాపు కాదు బలమని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్రంలో బాధ్యతలు అప్పగిస్తారని కాదు కాదు మల్కాజ్ గిరి లోక్ సభకు పోటీ చేయిస్తారని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఏదోటి నిజం కావడం ఖాయం. అయితే అంతకు మించి అసెంబ్లీ ఎన్నికల పొత్తుల గేమ్ ప్లాన్ లో కిరణ్ కీలక భూమిక వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన రెండు రోజుల్లోనే కిరణ్ చేరడంతో ఆ సంగతి జనసేనకు ముందే చెప్పి ఉంటారన్న చర్చ జరుగుతోంది. కిరణ్ బీజేపీలో చేరే కార్యక్రమానికి సోము వీర్రాజు హాజరు కాకపోయినా తర్వాత ఢిల్లీ పిలిచి బ్రీఫింగ్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఏపీ పార్టీలో కదలిక తీసుకురావాలని బీజేపీ డిసైడైంది. ఒంటరిగా పోటీ చేసే సాహసం ఈ సారి బీజేపీ చేయకపోవచ్చు. పొత్తులు ఖాయమని తీర్మానించుకున్న తరుణంలోనే కిరణ్ కుమార్ సేవలు పనికొస్తాయని భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అది ప్రాథమికంగా జనసేన రూటులోనే ఉండాలని అధిష్టానం భావిస్తోంది. జనసేనకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా పొత్తులపై ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసే బాధ్యతను కిరణ్ కుమార్ పై పెట్టే అవకాశం ఉందని బీజేపీ అగ్రనేతల నుంచి రాష్ట్ర నాయకులకు సమాచారం అందింది. వెంటనే పొత్తులపై ప్రకటన రాకున్నా ఆ రూట్ మ్యాప్ తీరును జనసేన నాయకుడికి వివరించే బాధ్యతను కిరణ్ పై పెడతారు. ఎందుకంటే కిరణ్ కు చంద్రబాబుకు పడదు. వాళ్లిద్దరూ డైరెక్టుగా మాట్లాడుకోరు.