ఆంధ్రప్రదేశ్ లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించారు కమలనాథులు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న తరుణంలో ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించాలని భావిస్తున్నారు. గతంలో కీలక పదవుల్లో ఉన్న నేతలను ఏ పార్టీలో ఉన్నా సరే బిజెపిలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అతి త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు కాంగ్రెస్ టిడిపిలకు చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయిన నేపథ్యంలో ఇంకా అదే పార్టీలో ఉంటే రాజకీయంగా తాను కూడా సమాధి కావలసి వస్తుందని ఆందోళన చెందుతోన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బిజెపిలో చేరితే పార్టీలో అత్యున్నత పదవిని ఇవ్వడానికి పార్టీ నాయకత్వం కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా రాయలసీమలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అదే విధంగా రెడ్డి సామాజికవర్గం కూడా తమకు చేరువ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. బిజెపిలో చేరడానికి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని అంటున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చిన పదవికి తక్కువ కాని పదవిని ఇవ్వాలని కూడా కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతకు ముందు అసెంబ్లీ స్పీకర్ గానూ వ్యవహరించారు. చిత్తూరు జిల్లా వాయిల్పాడు నియోజకవర్గం నుండి 1989,1999, 2004 ఎన్నికల్లో గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి 2009లో పీలేరు నియోజకవర్గం నుండి గెలిచి వై.ఎస్.ఆర్. కేబినెట్ లో చీఫ్ విప్ గా వ్యవహరించారు. వై.ఎస్.ఆర్.కు విధేయంగా ఉండే వారని పేరు.
కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడే. ఆయన దివంగత ప్రధాని పి.వి. నరసింహారావు కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. తండ్రి మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో వై.ఎస్.ఆర్. అకాల మరణం అనంతరం ముందుగా రోశయ్యను సిఎంని చేసిన కాంగ్రెస్ హై కమాండ్ కొంత కాలానికే కిరణ్ కుమార్ రెడ్డిని సిఎంని చేసింది. నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే గిరీకీ రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపారు కూడా. అయితే ఆఎన్నికల్లో ఘోర పరాజయాలతో చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు తిరస్కరించడంతో తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన బిజెపిలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితేఎందుకో కానీ అలా జరగలేదు.
చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చేరిక ద్వారా ముందుగా ఆ జిల్లాలో పాగా వేసినట్లు అవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు మాజీ కాంగ్రెస్ నేతలు కూడా బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కేబినెట్ లోని సహచర మంత్రుల్లో ఏ పార్టీలోకీ జంప్ చేయకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయి ఇపుడు ఏ పదవులూ లేక తెరమరుగు అవుతోన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను కూడా బిజెపిలో చేర్చుకోవాలన్నది కమలనాథుల మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ కాంగ్రెస్ నేతలతో పాటు టిడిపిలోనే చాలా మందితో మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం టిడిపిలో ఉన్న కొందరు సీనియర్ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాకపోవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.
అటువంటి నేతలను కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేర్పిస్తారని అంటున్నారు. ఇక ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డితో కాంగ్రెస్ లో ఉన్న వారిలో శైలజానాథ్, రఘువీరారెడ్డి, చింతామోహన్ వంటి సీనియర్ నేతలపైనా బిజెపి ఓ కన్నేసింది. తిరుపతి ఎంపీగా చాలా సార్లు వ్యవహరించిన చింతా మోహన్ గత తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు. ఆయనకు గేలం వేయడం ద్వారా రాయలసీమలో దళిత ఓటు బ్యాంకును పదిలం చేసుకోవచ్చునని బిజెపి వ్యహరచన చేస్తోంది. నిజానికి ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ నేతల్లో చాలా మంది ఏదో ఒక పార్టీలో చేరిపోయారు. అందులో తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువగా బి.ఆర్.ఎస్. లో చేరగా కొందరు బిజెపిలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో రాయపాటి సాంబశివరావు కొండ్రు మురళి వంటి వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. కావూరి సాంబశివరావు 2014లోనే బిజెపిలో చేరిపోయారు. మొత్తానికి కీలక సామాజిక వర్గాలకు చెందిన పాపులర్ నాయకులను చేర్చుకోవడంతో పాటు కీలక పదవులు నిర్వర్తించిన వారిని తీసుకుంటే పార్టీకి కొత్త ఊపు వస్తుందని కమలనాథులు అనుకుంటున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది సీనియర్లు కూడా టిడిపిలో కొనసాగలేక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరలేక ఎటు చేరాలో తెలీక అయోమయంలో ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి ఓ జాబితా తయారు చేసి వారిని బిజెపిలో చేర్పించడం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలుగా చెబుతున్నారు. అందుకు ప్రతిగా కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవితో పాటు రాజ్యసభ స్థానాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ మధ్యనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన నెల్లూరు వైసీపీ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆయన టిడిపిలో చేరతారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరితే ఆయనతో పాటు ఆనం కూడా బిజెపి వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ ఊపు ఇలాగే కొనసాగితే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని కూడా స్వాగతించే అవకాశాలున్నాయి. కాకపోతే మొదట్నుంచీ బిజెపి భావజాలాన్ని వ్యతిరేకించే రఘువీరా రెడ్డి బిజెపిలో చేరతారా లేదా అన్నది ప్రశ్న. మొత్తానికి చాపకింద నీరులా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి బిజెపి నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.