ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సంవత్సరంన్నర సమయం ఉంది. కానీ అక్కడి పరిస్థితులు చూస్తుంటే రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయేమో అనిపిస్తుంది. ఇవి తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఇప్పటికే తన మనసులో మాట బయటపెట్టారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆయన ఊరూరూ తిరుగుతున్నారు. అవసరమైతే మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోడానికి కూడా రెడీగా ఉన్నారు. మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకూడదనే ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. జూ.ఎన్టీఆర్ ను తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటాను అని వెల్లడించారు ఆయన సోదరుడు నందమూరి తారకరత్న.
ఈ తారకరత్న ఎవరు అనుకుంటున్నారా…? చెట్టు పేరు చెప్పుకుని అయిదారు సినిమాల్లో హీరోగా చేశారు. అరంగేట్రం రోజునే తొమ్మిది సినిమాల్లో హీరోగా క్లాప్ కొట్టి రికార్డులు సృష్టించారు. తరువాత ఆ తొమ్మిది సినిమాలేమైనాయో ఎవరికీ తెలియదు. తనకంటూ చెప్పుకోడానికి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అలాంటి తారకరత్న తాను జూ.ఎన్టీఆర్‌ను ప్రచారానికి తీసుకొస్తానని చెబుతున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా పోటీచేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తగా పని చేశా ఇకముందు నాయకుడిని కూడా అవుతానేమో అని వ్యాఖ్యానించారు. మామయ్య చంద్రబాబుకు అండగా ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారంలో ఉంటానని కూడా సెలవిచ్చారు. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వీలును బట్టి ప్రచారానికి వస్తారని ప్రకటించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప‌్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. భవిష్యత్‌లో తన కుమారుడు లోకేశ్‌కు అడ్డురాకుండా జూ.ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశాడు చంద్రబాబు. అప్పటినుంచి అతను రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో తన సోదరిని చంద్రబాబు కూకట్ పల్లి బరిలో దించినప్పుడు కూడా ఎన్టీఆర్ కానీ, కల్యాణ్ రామ్ కానీ ప్రచారం చేయలేదు. తమ అభిమాన హీరోను టీడీపీ శ్రేణులు చాలాసార్లు ఘోరంగా అవమానించారని అలాంటి పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు జూ.ఎన్టీఆర్ అభిమానులు. చంద్రబాబు చేతిలో ఒకసారి మోసపోయిన జూనియర్ మరోసారి అలాంటి తప్పు చేయరని వారు స్పష్టం చేస్తున్నారు. అసలు జూ.ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారని తారకరత్న ఏ నమ్మకంతో చెప్పారో ఎవరికీ అర్థం కావడం లేదు.