రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. వైసీపీలో నంబర్ టూ పొజిషన్‌లో ఉన్న విజయసారెడ్డి పేరు వింటే టీడీపీ నేతలు భగ్గున మండిపోతుంటారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌పైనా సాయిరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. అలాంటి ఉప్పు నిప్పులా ఉండే చంద్రబాబు, సాయిరెడ్డిలు ఒక్క చోట చేరితే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సినీనటుడు తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సందర్భంలో బాబు, సాయిరెడ్డిలు పక్కపక్కనే కూర్చొని అరంగట సేపు మాట్లాడుకున్నారు. బాబు మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా సాయిరెడ్డి పక్కనే ఉన్నారు. అంతే అది మీడియాలో ఓ బర్నింగ్ న్యూస్ అయ్యింది. ఇద్దరి పోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని మీడియా ఛానల్స్ ఓ రేంజ్‌లో వండి వారుస్తున్నాయి. సందర్భంగా వేరైనా రాజకీయ రంగు పులుముకుంటోంది. కొందరు వైసీపీ నేతలు కూడా బాబుతో సాయిరెడ్డి మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. అలా వ్యవహరించడం వల్ల పార్టీకి వ్యతిరేకంగా సంకేతాలు వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
తారకరత్న తిరిగి రాడనే వార్తను కేవలం నందమూరి అభిమానులే కాదు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకు కారణం తారకరత్న వివాదరహితుడు కావడమే. ఇటీవల టీడీపీ తరపున యాక్టివ్ అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేశారే తప్ప తారకరత్న ఏనాడు వ్యక్తిగత విమర్శలకు దిగలేదు. ఆ హుందాతనమే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వారు కూడా ఆయన చనిపోయారని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి చివరిచూపు చూశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న నివాసంలోనే ఉండి అన్నీ తానై వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం విజయసాయితో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఇంత చొరవ చూపించడం వెనుక కారణం అందరికీ తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి విజయసాయిరెడ్డికి స్వయానా మరదలి కూతురు. ఈ బంధుత్వం కారణంగానే విజయసాయిరెడ్డి కష్ట కాలంలో తారకరత్న కుటుంబానికి అండగా నిలిచారు.
విజయసాయిరెడ్డి తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి నందమూరి కుటుంబంతో టచ్‌లో ఉంటున్నారు. గతంలో బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందేటప్పుడు కూడా స్వయంగా వెళ్లి ఆరోగ్య వివరాలను వాకబు చేశారు. ఆస్పత్రిలో బాలకృష్ణ తారక్‌ను దగ్గరుండి చూసుకున్న విషయంపైనా సాయిరెడ్డి బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తారకరత్న నివాసంలోనూ దగ్గరుండి సాయిరెడ్డి సమన్వయం చేస్తున్నారు. ఈ సందర్భంగానే బద్దశత్రువులుగా భావించే బాబు, సాయిరెడ్డిలు ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. రాజకీయం వేరు, బంధుత్వం వేరనేది తెలిపే సంఘటన అది. దాన్ని కూడా కొందరు వివాదం చేస్తున్నారు. బాబు, సాయిరెడ్డి భేటీపై కొందరు రకరకాల విమర్శలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, చంద్రబాబు కలిసున్న ఫోటోనుద్దేశించి నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్‌పై దుమారం రేగుతోంది. ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంటికొచ్చిన శత్రువు నైనా మంచినీళ్ళు ఇచ్చి పలకరించే సంప్రదాయం మనది. సమయం, సందర్భాన్ని కూడా మర్చిపోయి పిచ్చి ట్వీట్లు చేయకు అంటూ బండ్లపై భగ్గుమంటున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓ రేంజ్‌లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాంటి రఘురామ తాను రోజూ నిర్వహించే రచ్చబండలో తాజాగా సాయిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. వైసీపీని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డిని కీర్తించారు. విజయసాయిరెడ్డి గతంలో చేసిన ట్వీట్లకూ ఇప్పుడు చేస్తున్నట్వీట్లకూ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. తారకరత్న ఇంట్లో చంద్రబాబు పక్కన కూర్చుని హుందాగా వ్యవహరించారని అభినందనీయమని కొనియాడారు. ఓ నాయకుడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చారంటూ సాయిరెడ్డి చంద్రబాబు పక్కన కూర్చుకోవడాన్ని ప్రస్తావించి వ్యాఖ్యానించారు. అది వైసీపీ నేతలకు నచ్చడం లేదంటూ సెటైర్లు వేశారు. దీన్ని రాజకీయంగా చూడొద్దని ఆయన కోరారు. సాయిరెడ్డి వరస్ట్ పదజాలం వాడే వ్యక్తి కాదని ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ను గతంలో ఎవరో నిర్వహించి ఉంటారని రఘురామ వెనకేసుకొచ్చారు. బాబుతో సాయిరెడ్డి ఉన్న ఫోటోను కొందరు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంటే, మరికొందరు వ్యతిరేకంగా ఆడిపోసుకుంటున్నారు. ఇలా టీడీపీ, వైసీపీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు.
.