హిందూపురంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నందమూరి తారకరత్న పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాబాయ్ బాలయ్య నియోజకవర్గంలో అబ్బాయి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో తారకరత్నను టీడీపీ బరిలోకి దింపనుందనే టాక్ పొలిటికల్ సర్కిల్ నుంచి వినిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన తారకరత్నఅందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. తారకరత్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరింది. కానీ బాలయ్య నియోజకవర్గంలో ఆయన చక్కర్లు కొడుతుండడంతో హిందూపురంలో పోటీ ఖాయమనే ప్రచారం జోరందుకుంది.
హిందూపూరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి స్థానిక ప్రజలు టీడీపీకే పట్టం కడుతున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీ అభ్యర్థులు మాత్రమే గెలుస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాదు. టీడీపీ నుంచి ఎవరు పోటీచేసినా అక్కడ ఈజీగా గెలుస్తారు. ప్రత్యర్థులు నామ మాత్రపు పోటీకే పరిమితమవుతారు. నందమూరి బాలకృష్ణ హిందూపూరం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో హిందూపూరంలో తారకరత్న పర్యటించడం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడిని కలవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న తారకరత్న హిందూపూరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు ఇంటికి వెళ్లి శాలువా కప్పి సత్కరించారు. తాజా రాజకీయాలు స్థానిక స్థితిగతుల గురించి చర్చించారు. వైసీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి కూడా చర్చకు వచ్చాయి.
సీసీ వెంకటరాముడు 1999 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ 2004లో ఆయనకు టికెట్ దక్కలేదు. వెంకటరాముడు స్థానంలో పామిశెట్టి రంగనాయకులును బరిలోకి దించింది టీడీపీ. అప్పటి ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పామిశెట్టి కుటుంబం వైసీపీ గూటికి చేరింది. 2004లో టికెట్ ఆశించి భంగపడిన వెంకటరాముడు పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. అయినప్పటికీ- నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టు ఉంది. ఈనేపథ్యంలో సీసీతో తారకరత్న భేటీ కావడం టీడీపీ నియోజకవర్గ నాయకులు, బాలకృష్ణ అభిమాన సంఘాల ప్రతినిధులను కూడా కలుసుకోవడం లాంటి పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తారకరత్న హిందూపురం నుంచి పోటీ చేయొచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. తారకరత్న హిందూపురంలో ఉండగానే బాలయ్య కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే మొత్తంగా ఏదో జరగనుందని తెలుస్తోంది.