నారాల సయోధ్య?

By KTV Telugu On 28 December, 2023
image

KTV TELUGU :-

టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పెద్దల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు   తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున తాను కానీ తన కుమారుడు కానీ  బరిలోకి దిగి పోటీ చేయబోతున్నారా? టిడిపికి గతంలో దూరమైన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానం వినిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. ఎన్టీయార్  కు వెన్నుపోటు తర్వాత  టిడిపికి దూరమైన  తన తోడల్లుడు దగ్గుబాటిని టిడిపిలో చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతానికి చంద్రబాబు స్కెచ్ గీసి ఉండచ్చని వారంటున్నారు.

దగ్గు బాటి వెంకటేశ్వరరావు అంటే పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు. కాకపోతే  ఈ తరం  యువతకు మాత్రం ఆయన చాలా మందికి తెలీదు. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా  రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. అందుకే ఆమె అందరికీ తెలుసు. 2009 ఎన్నికల్లో   పర్చూరు నియోజక వర్గం నుంచి ఓటమి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం 16వందల పై చిలుకు ఓట్లు తేడాతోనే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఇంచుమించు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లోకి ఎక్కారు.

గత ఎన్నికల్లో తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోవడమే ఒక విధంగా మంచిది అయ్యిందన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఒక వేళ తాను గెలిచి ఉంటే   నియోజక వర్గంలో అధ్వాన్నమైన రోడ్ల గురించి ప్రజలు తనను నిలదీసే పరిస్థితి ఉండేదని..ఇప్పట్లా తాను స్వేచ్ఛగా నియోజక వర్గంలో తిరగ్గలిగే వాడిని కాదన్నారు. 2019 ఎన్నికల్లో  ఓడిన తర్వాత తన కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని..కానీ అందుకోసం కొన్ని షరతులు విధించారని ఆయన గుర్తు చేసుకున్నారు.  అవి నచ్చకే తాము రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ బయలుదేరిపోయామన్నారు. అయితే అయిదేళ్ల క్రితం జరిగిన ఘటనను దగ్గుబాటి ఇపుడు ఎన్నికల ముందు  ప్రస్తావించడమే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

దగ్గుబాటి కుటుంబం కొంతకాలం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి  అనుకూలంగా వ్యవహరిస్తోంది. దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి    ఇటీవల చంద్రబాబు నాయుణ్ని స్కిల్ స్కాం లో అరెస్ట్ చేసినపుడు అందరికంటే ముందు  మద్దతు పలికారు. ఆయన అరెస్ట్ ను ఖండించారు. ఆ తర్వాతకూడా నారా లోకేష్ కు కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర అపాయింట్ మెంట్ ఇప్పించడమే కాకుండా ఆ భేటీకి తానే లోకేష్ ను దగ్గరుండి తీసుకెళ్లారు.  ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి టిడిపి నాయకురాల్లా  వ్యవహరిస్తున్నారని  ఏపీలో పాలక వైసీపీ నేతలు  విమర్శించారు కూడా. ఆ తర్వాత ఇపుడు వెంకటేశ్వరరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ చేయడం ద్వారా టిడిపికి మరింత దగ్గరవుతున్నట్లు సంకేతం ఇచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. అపుడు ఆయన ఆసుపత్రిలో ఉండగా చంద్రబాబు వచ్చి పరామర్శించారు. 1995లో ఎన్టీయార్ ను గద్దె దింపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినపుడు చంద్రబాబు పక్షాన ఉన్న దగ్గుబాటి దంపతులు ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో విబేధించి పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి ఎన్టీయార్ శిబిరంలో చేరారు. అప్పట్నుంచీ చంద్రబాబు-దగ్గుబాటి కుటుంబాల మధ్య   సన్నిహత సంబంధాలు కూడా లేవు. ఈ క్రమంలోనే దగ్గుబాటి తాను రాసిన ఆత్మకథలో చంద్రబాబు నాయుడిపై  తీవ్రమైన విమర్శలూ చేశారు. అయితే చంద్రబాబు ఏడాది క్రితం కలిసినపుడు రెండు కుటుంబాల మధ్య ఏదో ఒక సయోధ్య కుదిరి ఉండచ్చంటున్నారు.

ఆ మధ్య  టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పై ప్రత్యేక నాణేన్ని విడుదల చేసిన సందర్భంలో రెండు కుటుంబాలు సన్నిహితంగా వ్యవహరించాయి. బహుశా^టిడిపి గ్రాప్ తగ్గిపోయిన నేపథ్యంలో టిడిపి పాత ముఖాలను మళ్లీ తెరపైకి తెస్తే మంచిదని చంద్రబాబు భావించి ఉండచ్చంటున్నారు. అందులో భాగంగానే  తోడల్లుడు వెంకటేశ్వరరావును తిరిగి టిడిపిలో చేర్చుకోవాలని బాబు ప్రయత్నిస్తూ ఉండచ్చని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుని కూడా బరిలో దించే అవకాశాలున్నాయంటున్నారు. ఒకరిని లోక్ సభ నియోజక వర్గం నుంచి ఒకరిని  పర్చూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి  పోటీ చేయించే అవకాశాలున్నాయంటున్నారు. దీనికోసమే దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి దగ్గుబాటి కుటుంబం నారా వారి కుటుంబంతో  చేతులు కలిపి ఉండచ్చంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి