కరివేపాకు మళ్లీ అవసరం అయ్యింది..జూనియర్ పై లోకేష్ వ్యాఖ్యలు

By KTV Telugu On 27 February, 2023
image

చంద్రబాబు నాయుడి తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. యాత్రలో జనంతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రజల ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పారు. ప్రత్యేకించి యువత అడిగే ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికరమైన జవాబులు చెబుతూ ఆకట్టుకున్నారు. ఇందులో ఓ యువకుడు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ లు రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీరు స్వాగతిస్తారా అని లోకేష్ ను అడిగారు. దానికి లోకేష్ తడుముకోకుండా రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకునే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తామంటే తాను స్వాగతిస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ ను తాను మొదటి సారి 2014లో కలిశానని చెప్పిన లోకేష్ రాజకీయాల్లో మార్పు రావాలని పవన్ అప్పుడే భావించేవారని ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలన్న తపన పవన్ లో చూశానని లోకేష్ వివరించారు.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాక్షస పాలన పోవాలంటే రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే రాష్ట్రంలో మార్పు అవసరమని లోకేష్ అన్నారు. దాని కోసం భావసారూప్యత కలిగిన వ్యక్తులు ప్రముఖులు కూడా రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉందన్నారు లోకేష్. ఇక జూనియర్ ఎన్టీయార్ కూడా రాజకీయాల్లోకి వచ్చి మార్పు కోసం ప్రయత్నించాలని లోకేష్ పిలుపు నిచ్చారు. లోకేష్ వ్యాఖ్యల వెనక ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీకీ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉన్న జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలని ఇపుడు లోకేష్ పిలవడం వెనక రాజకీయ వ్యూహం ఉండచ్చని వారు అంచనా వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు నందమూరి హరికృష్ణ తనయుడు అయిన జూనియర్ ఎన్టీయార్ అచ్చం సీనియర్ ఎన్టీయార్ పోలికలతో ఉంటారు. సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసి మాస్ హీరోగా అదరగొడుతున్నారు. అద్భుతమైన వాక్చాతుర్యం సమయ స్ఫూర్తి జూనియర్ ఎన్టీయార్ ప్రత్యేకతలు. 2004 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టిడిపి 2009 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం రక రకాల పొత్తులు పెట్టుకుంది. టి.ఆర్.ఎస్. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జట్టుకట్టి కూటమి పెట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీయార్ ను ఫుల్లుగా వాడేసుకున్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో జూనియర్ తనదైన ముద్ర వేశారు. ఎన్టీయార్ ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పట్టారు. ఆ ఎన్నికల్లోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉండింది. అయితే అపుడు దివంగత వై.ఎస్.ఆర్. మానియా ముందు ప్రజారాజ్యం కానీ మహాకూటమి కానీ నిలవలేకపోయాయి. కాంగ్రెస్ గెలిచి వై.ఎస్. రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు.

2009 ఎన్నికల్లో టిడిపికోసం అహోరాత్రులూ ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీయార్ ప్రచారం చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు కూడా. ఆసుపత్రి బెడ్ పై ఉండి కూడా టిడిపి గెలుపుకోసం ఎన్టీయార్ ప్రచారం చేయడం అందరినీ కదిలించింది. అయితే జూనియర్ ఎంతగా కష్టపడినా చంద్రబాబు నాయుడి పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానూ వై.ఎస్.ఆర్. పట్ల సానుకూలత వల్లనూ కాంగ్రెస్ గెలిచి టిడిపి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది.
ఆ ఎన్నికల తర్వాత కొంత గ్యాప్ లో టిడిపి మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ మహానాడులోనే తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను పార్టీ నేతలకు పరిచయం చేయాలని డిసైడ్ అయిన చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీయార్ ను మాట వరకు కూడా మహానాడుకు పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు లేదు కాబట్టి ఎన్టీయార్ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే అదే మహానాడులో జూనియర్ ఎన్టీయార్ కూడా పాల్గొంటే ఆయనకున్న గ్లామర్ తో పార్టీ నేతలను ఆకట్టుకునే అవకాశాలున్నాయని చంద్రబాబు భయపడ్డారు. అపుడు లోకేష్ ను ఎవరూ పట్టించుకోరని ఆయన ఆందోలన చెందారు. అందుకే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం జూనియర్ ఎన్టీయార్ ను కూరలో కరివేపాకులా ఏరి పారేశారు.

అయితే జూనియర్ ఎన్టీయార్ దాన్ని మౌనంగానే భరించి ఊరుకున్నారు తప్ప ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
ఆ తర్వాత కాల క్రమంలో తన తండ్రి హరికృష్ణను కూడా చంద్రబాబు నాయుడు వాడుకుని ఆ తర్వాత పదవులకు దూరం పెట్టి అవమానించారని జూనియర్ ఎన్టీయార్ తెలుసుకున్నారు. తన తండ్రికి ముఖ్య అనుచరులు అయిన కొడాలి నాని, వంశీలను సైతం చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడాన్నీ జూనియర్ గమనించారు. అయినా పెదవి విప్పలేదు. ఎలాగూ తనను టిడిపికి దూరంగా ఉంచారు కాబట్టి రాజకీయాలకు కూడా ఓ దండం పెట్టేసి జూనియర్ ఎన్టీయార్ సినిమాలపైనే దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ ను ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు భావించినా జూనియర్ ఆసక్తి చూపలేదు. దాంతో జూనియర్ ఎన్టీయార్ సినిమాలు చూడద్దంటూ తమ సామాజికవర్గ మాధ్యమాల్లో ఫత్వా జారీ చేయించారు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలోనే విడుదలైన జూనియర్ సినిమా దమ్మును చంద్రబాబు నాయుడు టిడిపి నేతలు బాయ్ కాట్ చేశారు. తమ సామాజికవర్గం నేతల గుప్పెట్లో ఉన్న థియేటర్లలో ఆ సినిమా ఆడకుండానూ ఆదేశాలు జారీ చేశారు.

ఆ తర్వాత 2018లో తెలంగాణా ఎన్నికల సమయంలో హరికృష్ణ తనయ నందమూరి సుహాసినికి కూకట్ పల్లి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు హరికృష్ణ తనయులు అక్కడ ప్రచారం చేస్తారని ఆశించారు. అయితే తమ సొంత సోదరే బరిలో ఉన్నా ఆమె తన తండ్రిని అవమానించిన టిడిపి తరపున ఉన్నారు కాబట్టి హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీయార్ లు ఎన్నికల ప్రచారం చేయలేదు. ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతయ్యింది. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించుకోలేక చేతులెత్తేశారు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సవాల్ విసిరింది.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లోనూ ఓడిపోతే ఇక పార్టీ కార్యాలయానికి తాళాలు వేయక తప్పదని భయపడుతోన్న చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎన్టీయార్ కుటుంబం నుండి ఎంతమంది వీలైతే అంతమంది చేత ప్రచారం చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు జూనియర్ ఎన్టీయార్ నుండి చాలా ఆశించిన టిడిపి. ఎన్టీయార్ వంశీ వ్యాఖ్యల విషయంలో ముక్తసరిగా ఖండన ఇచ్చి ఊరుకోవడంతో టిడిపి నేతలు నిప్పులు చెరిగారు. తాము పదే పదే జూనియర్ ఎన్టీయార్ ను ఆయన తండ్రిని అవమానించి ఉండడంతో తాము పిలిచిన వెంటనే జూనియర్ ఎన్టీయార్ పార్టీతరపున ప్రచారానికి రారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పటినుంచి జూనియర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయాలని నిశ్చయించారు. ఆ వ్యూహంలో భాగంగానే లోకేష్ జూనియర్ ఎన్టీయార్ ప్రస్తావన తెచ్చి ఉంటారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించినపుడు జనంలోంచి కొందరు జూనియర్ ఎన్టీయార్ రావాలి అంటూ నినాదాలు చేశారు. తర్వాతి ముఖ్యమంత్రి ఎన్టీయారే అని ప్లకార్డులు పట్టుకున్నారు. లోకేష్ పాదయాత్ర లోనూ జూనియర్ ఎన్టీయార్ కు తరచుగా జనం జిందాబాదులు కొడుతున్నారు. ఈ ప్రజానాడిని గమనించిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో జూనియర్ ను ఏదో ఒక విధంగా ఒప్పించి మెప్పించి ప్రచారానికి రప్పించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అవసరమైతే బాలకృష్ణ చేత చెప్పించాలని కూడా వ్యూహరచన చేసుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీయార్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. అయితే తమ తాత ఎన్టీయార్ పెట్టిన టిడిపిలోకి జూనియర్ ఎన్టీయార్ ను ఆహ్వానించడానికి లోకేష్ ఎవరని హరికృష్ణకు సన్నిహితుడైన కొడాలి నాని నిలదీస్తున్నారు.