అయ్యో..! చంద్రబాబు ఫోటో లేదే ?

By KTV Telugu On 28 December, 2022
image

కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో ఉరకలు వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ పట్ల జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. పనిలో పనిగా యువ నాయకత్వానికి పగ్గాలు అప్పజెప్పే కార్యక్రమానికి కూడా 2023లో శ్రీకారం చుట్టాలని తెలుగుదేశం తీర్మానించుకుంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోకేష్ బయలుదేరే లోపు కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. వంద నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం ఆయన నడుస్తారు. జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలువుతుందని నేతలు వెల్లడించారు. యువగళం వేదికను తెలుగు యువతకు పరిచయం చేసి నడిపించే బాధ్యతను లోకేష్ కు పార్టీ అధిష్టానం అప్పగించింది. అంతవరకు బాగానే ఉంది, కాకపోతే టీడీపీ విడుదల చేసిన ప్రోమోలోనే అసలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ప్రోమో ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. లోకేష్ ను యువనాయకుడిగా ప్రతిబింబించేందుకు ప్రోమో బాగానే ఉపయోగపడుతోంది. కాకపోతే పోసర్లో ఒక వ్యక్తి కనిపించడం లేదు. ఆయనే టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోస్టర్ విడుదలై సోషల్ మీడియాకు ఎక్కిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ శ్రేణుల్లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకలా జరిగిందన్న చర్చ ఊపందుకుంది.

చంద్రబాబు ఫోటో లేకపోవడానికి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబే కావాలని తన ఫోటో పెట్టించలేదని చెబుతున్నారు. ఈ సారి పూర్తిగా లోకేష్ సొంత పరపతితో 4 వేల కిలోమీటర్ల పాదయాత్రను సక్సెస్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారట. పార్టీలోకి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసిందని చెప్పేందుకు తన ఫోటో వద్దని టీడీపీ అధినేత చెప్పారట. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహం ఉంటే చాలని నిర్ణయించారట.

పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా వారికి లోకేష్ మాత్రమే నాయకుడని ఆయనే వారందరికీ దిశా నిర్దేశం చేస్తారని చెప్పేందుకు చంద్రబాబు తన ఫోటో వద్దన్నారని చెప్పుకుంటున్నారు. 400 రోజులు జనంలో లోకేష్ నామస్మరణ మాత్రమే వినిపించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది. పాదయాత్రలో అందురూ లోకేష్ వెంట నడిస్తూ ఇటీవలి కాలంలో పార్టీ ప్రధాన కార్యదర్శి చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన వివరించాల్సి ఉంటుంది. అప్పుడు లోకేష్ కు కూడా ఇమేజ్ బిల్డప్ సాధ్యపడుతుందని విశ్లేషిస్తున్నారు.

పార్టీ వ్యూహకర్తలు ఇచ్చిన సలహా మేరకే చంద్రబాబు తన ఫోటోను వద్దన్నారని ప్రాథమికంగా వినిపిస్తున్న సమాచారం. తాను ఎలాగూ ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని భవిష్యత్తులో మరికొన్ని కార్యక్రమాలు చేపడతానని చంద్రబాబు పార్టీ నేతల వద్ద వివరించారు. పాదయాత్రను హోల్ అండ్ సోల్ గా లోకేష్ కార్యక్రమంగా ఉంచాలన్నది తండ్రి సంకల్పం. మరి చంద్రబాబు ఆలోచనా విధానాన్ని అమలు జరపడంలో తనయుడు లోకేష్ ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి.