తెలుగుదేశం పార్టీ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే ఎన్నికలకు టీడీపీ పూర్తిగా యువ నాయకత్వంతో వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 50శాతం సీట్లు యువనాయకులకు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాబోయే రోజుల్లో లోకేష్ పాదయాత్రను యువతే ముందుండి నడిపించనుంది. దాంట్లో భాగంగానే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్రకు యువగళం టైటిల్ ఖరారు చేశారు. గతంలో చంద్రబాబు వస్తున్నా మీ కోసం అంటూ పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్లీ అదే పేరు ఉంటుందని అంతా భావించారు. కానీ యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో యువగళం టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. యువ నేతగా రాష్ట్రంలో తనపై ముద్ర పడాలని కోరుకుంటున్నారు లోకేష్.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను మేల్కొలిపే ఉద్దేశంతో యువగళం నినాదం అందుకొని జనంలోకి వెళుతున్నారు లోకేష్. తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న యువతకు చేరువ కావాలని భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 2019లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత తిరిగి పునర్ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. లోకేష్ పాదయాత్రతో టీడీపీ కేడర్‌లో ఉత్సాహం వస్తుందని నేతలు భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న తన పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు లోకేష్ సూచించారు. వచ్చే జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. నడకదారిలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఊపందుకున్నాయి. ఆయన రాష్ట్రమంతా బిజీబిజీగా తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాలు నిర్వహిస్తూనే స్థానికంగా రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేం అవుతున్నారు. అటు పార్టీ శ్రేణులు జనంలో ఉండేలా చూసుకుంటున్నారు. మొత్తంగా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహగానాలతో అటు తండ్రి అటు తనయుడు ఇప్పటి నుంచే ఎన్నికల కదనరంగంలోకి దూకుతున్నారు. తమ్ముళ్లను సంసిద్ధం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. యువగళం యాత్రకు యువత ఎంతమేరకు కలిసి వస్తుంది. ఏమేరకు ఓట్లు రాలుస్తుందనేది రానున్న ఎన్నికల్లో తేలుతుంది.