దేకేవాడే లేడు.. పాయె లోకేష్‌ పరువుపాయె

By KTV Telugu On 6 March, 2023
image

ఒకప్పుడు వైఎస్ పాదయాత్ర. తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర. దేశవ్యాప్తంగా ఈమధ్య రాహుల్‌గాంధీ పాదయాత్ర. ప్రతీ యాత్రా ఓ చరిత్రను లిఖించింది. అందరిలో చర్చనీయాంశమయ్యాయి ఆ యాత్రలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అంతెందుకు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర కూడా ఎంతోకొంత సందడిగానే సాగింది. కానీ ఎంతో హైప్‌ చేసిన టీడీపీ అధినేత వారసుడి పాదయాత్ర మాత్రం నీరసంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రాజకీయపార్టీ పాదయాత్ర గురించి ఎక్కడా చర్చ కూడా జరగడం లేదు. యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌. టీడీపీ హయాంలో దొడ్డిదారిన చట్టసభలోకి వచ్చి మంత్రి అయ్యారన్న అపప్రద ఆయనకుంది. మంగళగిరిలో ఓటమితో అధినేత వారసుడికి చరిష్మా లేదన్న విషయం తెలిసిపోయింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయ్‌.  ఈలోపు నాయకుడిగా నిరూపించుకోలేకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.

అందుకే పాదయాత్రతో అందరి దృష్టీ తనవైపు తిప్పుకోవాలన్నది లోకేష్‌ ఆలోచన. కానీ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు తర్వాత నాలుగైదురోజులు దానిమీద చర్చ జరిగిందంతే. ఇప్పుడు ఎవరూ లోకేష్‌ పాదయాత్రను పట్టించుకోవడంలేదు. ఆయన వెళ్లిన చోట పబ్లిక్‌ రియాక్షన్‌కూడా పెద్దగా లేదు. దీంతో మొదలుపెట్టాక తప్పదన్నట్లు సాగుతోంది లోకేష్‌ యువగళం. పోలీసులొచ్చి మైక్‌ లాక్కోవాలని కోరుకుంటున్నారు నారా లోకేష్‌. వైసీపీ శ్రేణులు అడ్డుకుంటే బాగుంటుందనుకుంటున్నారు. ఏ మూలనుంచో ఓ రాయి అయినా రాదేమని చూస్తున్నారు. ఎందుకంటే యాత్రలో కాస్త టెంపో సృష్టించవచ్చు. రోడ్డుమీద బైఠాయించవచ్చు. నాలుగు సవాళ్లు విసరొచ్చు. సజావుగా సాగనిస్తే పాదయాత్ర అడ్డుపడితే దండయాత్రన్న డైలాగ్‌ వింటానికి బానే ఉందికానీ ఉప్పులేని కూరలా చప్పగానే ఉంది టీడీపీ అధినేత వారసుడి ప్రయాణం. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 34రోజులు పాదయాత్ర చేశారు లోకేష్‌.

అన్నమయ్య జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో మైకు ఇవ్వకపోయినా ప్రచారరథాన్ని సీజ్‌ చేసినా లోకేష్‌కి అది కలిసొచ్చింది. కొన్ని కేసులు కూడా పెట్టటంతో మాట్లాడేందుకు మేత దొరికింది. కానీ ఇప్పుడా ఛాన్స్‌ లేకుండాపోయింది.
తిరుప‌తి, చంద్రగిరి, పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో పాదయాత్రలో రచ్చవుతుందని టీడీపీ ఊహించుకుంది. మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలీసులో కార్యకర్తలో అడ్డుపడతారని నారా లోకేష్‌ కూడా భావించారు. కానీ ఆ మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు వస్తే ఏంటి పోతే ఏంటి అన్నట్లు లైట్‌ తీసుకున్నారు. లోకేష్‌ని అస్సలు లెక్కలోకి తీసుకోవద్దని చెప్పారు. దీంతో కార్యకర్తలు అడ్డుకోలేదు. పోలీసులు అసలు పట్టించుకోలేదు. లోకేష్‌ని అడ్డుకుంటే ఉచిత ప్రచారం ఇచ్చినట్లేనని వైసీపీ భావిస్తోంది. అందుకే ఆయన పర్యటనను పట్టించుకోవడం మానేసింది. సవాల్‌కి ప్రతి సవాల్‌ ఉంటుంది. అవతలినుంచి ఏమీ లేనప్పుడు వన్‌సైడ్‌ ఎంత ఎగిరెగిరి పడినా లాభం ఏముంటుంది పాపం లోకేష్‌కి ఎంత కష్టమొచ్చిందో.