తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు అయిన నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. గత సెప్టెంబరు నెలలో తన తండ్రి చంద్రబాబు నాయుణ్ని స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో లోకేష్ తన యాత్రను నిలిపివేశారు. తన తండ్రి జైలు నుండి విడుదల అయిన తర్వాతనే యాత్రను తిరిగి ప్రారంభిస్తానని అప్పుడే ప్రకటించారు. ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు నాయుడు విడుదల అయ్యి నాలుగు వారాలు దాటిన తరుణంలో ఇపుడు లోకేష్ తన యాత్రను మొదలు పెట్టారు.
ఏపీలోని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను కేసులతో వేధిస్తోందని.. ప్రజావ్యతిరేక విధానాలతో పేట్రేగిపోతోందని ఆరోపిస్తూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియ జెప్పడం కోసం లోకేష్ ఈ ఏడాది జనవరిలో యువగళం పేరిట తన తండ్రి సొంత నియోజక వర్గం అయిన కుప్పం లో యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర కొనసాగించే క్రమంలో వివిధ నియోజక వర్గాల నేతలతో సమాలోచనలు చేస్తూ పార్టీని 2024 ఎన్నికలకు సమాయత్తం చేయడానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని ఏపీ సిఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలపై విజిల్ బ్లోయర్ అందించిన సమాచారంతో కేసు నమోదైంది. యువతకు వివిధ నైపుణ్యాలు నేర్పే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జర్మనీకి చెందిన సిమన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని చంద్రబాబు హయాంలో జీవో విడుదల చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం పదిశాతం నిధులు కేటాయిస్తే సిమన్స్ కంపెనీ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందని జీవోలో పేర్కొన్నారు. అయితే సిమన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా విడుదల చేయకుండానే ఏపీ ప్రభుత్వం 371 కోట్ల రూపాయలను విడుదల చేసేసింది. ఇక్కడే ఓ మతలబు ఉంది. ఆ 371కోట్లరూపాయలను సిమన్స్ కంపెనీకి విడుదల చేయలేదు డిజైన్ టెక్ అనే మరో కంపెనీకి విడుదల చేసారు.
డిజైన్ టెక్ నుండి కోట్లాది రూపాయలు షెల్ కంపెనీల ద్వారా తరలించేశారని పూణేలోని జి.ఎస్.టి. అధికారులు గుర్తించారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వంలోని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తు ఏమైందో ఎవరికీ తెలీదు. కానీ జి.ఎస్.టి. ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి షెల్ కంపెనీలపై దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేయడంతో భారీ కుంభకోణం చోటు చేసుకుందని బయట పడింది. షెల్ కంపెనీలకు చెందిన ఎనిమిది మందిని ఈడీ అరెస్ట్ చేసింది కూడా. వారిచ్చిన సమాచారం మేరకు మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో షెల్ కంపెనీల నుండి తరలిన సొమ్ము హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడి పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లకు అందిందని తేలింది.
ఈ సొమ్ము అంతిమంగా టిడిపి బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే జరిగిందని..ఆయన హయంలోని ఐఏఎస్ అధికారుల నోట్ ఫైల్స్ ద్వారా సిఐడీ నిర్ధారించుకుంది. ఆ తర్వాతనే చంద్రబాబు పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాబును అరెస్ట్ చేసే సమయంలో యువగళం యాత్రలో బిజీగా ఉన్న లోకేష్ తండ్రిని జైలుకు పంపడంతో యాత్రను ఆపక తప్పింది కాదు. తన తండ్రికి బెయిల్ తెచ్చుకోడానికి న్యాయవాదులను మానిటర్ చేసుకోడానికి ఆయన ఢిల్లీలో మకాం వేయాల్సి వచ్చింది. అందుకే యువగళానికి తాత్కాలికంగా సెలవు ప్రకటించారు లోకేష్.
రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని 53రోజుల పాటు అన్యాయంగా బెయిల్ రాకుండా అడ్డుకున్నారని లోకేష్ మండి పడుతున్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించిన తొలి రోజునే ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపైనా మంత్రులపైనా మండి పడ్డారు. అక్రమాలకు పాల్పడిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాలకులను ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో పరిచయం చేసే బాధ్యత తానే తీసుకుంటానని లోకేష్ అన్నారు. యువగళం రెండో విడత యాత్రలో టిడిపి శ్రేణులతో పాటు జనసేన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.గతంలో ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలని అనుకున్నారు..కానీ మారిన సమీకరణల నేపథ్యంలో విశాఖ వరకే యాత్ర చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది ఆయన యోచనగా చెబుతున్నారు…
https://youtu.be/p6fitaohsno?si=UiGXdNUU3RRHNw4y
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…