వారాహి ఆగదు-యువగళం ఆగదు.. పాదయాత్రలో లోకేష్ పంచులు

By KTV Telugu On 28 January, 2023
image

లోకేష్ పాదయాత్రతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొద్దిరోజుల్లోనే పవన్ వారాహి రథం కూడా రోడ్డెక్కబోతోంది. దాంతో రాజకీయ వేడి మరింతగా రగులుకునే అవకాశం కనిపిస్తోంది. యువగళం పాదయాత్రలో లోకేష్ సహా పార్టీ నేతలంతా జగన్‌ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఒకానొక దశలో పట్టలేని ఆగ్రహంతో ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దేవుడు అన్న ఎన్టీఆర్ లాంటి మంచోడిని కాదు నేను. రాముడు లాంటి చంద్రబాబు మనస్తత్వం కాదు, నేను మూర్ఖుడిని అంటున్నారు లోకేష్. అధికారంలోకి వచ్చాక తమను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నాయకుల తోలు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోవాలంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భయం తన బయోడేటాలోనే లేదంటూ బాలయ్య మాదిరి సినిమా డైలాగులు కొడుతున్నారు లోకేష్. వారాహి ఆగదు. యువగళం ఆగదు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామంటూ జగన్‌ సర్కార్‌పై సైకిల్ తొక్కుతున్నారు. లోకేష్ వ్యాఖ్యలు అలా ఉంటే mఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులపై దూషణల పర్వంతో ఖాకీల ఆగ్రహానికి గురయ్యారు. అచ్చెన్నాయుడుపై కుప్పంలో కేసులు కూడా నమోదయ్యాయి.

లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేస్తూ అటు వైసీపీ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అధికారంలో లేకపోతేనే వీళ్లు అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు. అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఇంకేం చేస్తారో భయంగా ఉందంటూ పాదయాత్రలో లోకేష్, అచ్చెన్నాయుడులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. తొక్కుకుంటూ వెళ్తాం ఏం పీకుతారంటూ లోకేష్ బరితెగించి మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. పోలీస్‌ భద్రతతో బతికుతూ వారిని దూషిస్తారా అంటూ అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ తొలు ఒలిచి పొలీసులకు ‘షూ’ తయారు చేయిస్తామంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా జగన్‌ను మిల్లీమీటరు కూడా కదపలరేన్నారు నాని. ఎన్నికల్లో గెలవలేని వ్యక్తితో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారన్న మంత్రి సీదిరి అప్పల్రాజు ఎవరెన్ని చేసినా లోకేష్ సక్సెస్ కాలేరని అన్నారు.

ఇటీవల కాలంలో జగన్ సర్కార్‌పై పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొస్తే వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. అంతేకాదు తనలో తీవ్రవాదిని చూడాల్సి వస్తోందంటూ హాట్ కామెంట్స్ చేశారు. దానిపై వైసీపీ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది. తమకు చెప్పులున్నాయంటూ పేర్ని సెటైర్లు వేయగా తీవ్రవాదిని కాల్చిపడేస్తారంటూ కొడాలి కౌంటర్ ఇచ్చారు. ఇక లోకేష్ కూడా పవన్‌ మాదిరే పాదయాత్రలో జగన్‌, మంత్రులు లక్ష్యంగా విరుచుకుపడుతూ దూకుడుగా వెళ్తున్నారు. అయితే యువగళం యాత్రలో లోకేష్ వారాహి ఆగదు తన యాత్ర ఆగదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసి పోటీ చేయబోతున్నామనే సంకేతాలు పంపారు. కొద్దిరోజుల్లోనే పవన్ వారాహి ప్రచార యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. వారాహిని అడ్డుకుంటామన్న వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఎవడు ఆపుతాడో చూస్తామంటూ పవన్ హెచ్చరించారు. ఇప్పుడు లోకేష్ కూడా తమను ఎవరూ ఆపలేరనే సంకేతాలు వైసీపీకి పంపారు. వైసీపీ కూడా ఇద్దరి యాత్రలను లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.