టీడీపీలో ఏం జరుగుతోంది.. అల్లుడా మామా హూ ఈజ్ నెంబర్ టూ

By KTV Telugu On 30 March, 2023
image

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు విపరీతమైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఆయన మరోసారి అపర చాణక్యుడు బిరుదును పొందారు. విపక్షంలో ఉంటూ అధికార పార్టీని మట్టి కరిపించి తిరుగులేని నాయకుడిగా పేరు పొందారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఏ దిశగా చూసినా చంద్రబాబు నాయుడు పార్టీలో నెంబర్ వన్. ఇంతకాలం నెంబరు టూ కూడా లేని టీడీపీలో ఇప్పుడు కొత్త చర్చకు తెరలేచింది. చంద్రబాబు తర్వాత పవర్ ఫుల్ లీడర్ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి చినబాబుగా పిలిచే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నెంబరు టూ అనడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నందమూరి బాలకృష్ణ చూపిస్తున్న చొరవ ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత చూస్తే మాత్రం పార్టీలో పవర్ సెంటర్ల్ ఎవరన్న అనుమానమూ రావచ్చు.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర 400 రోజులు సాగుతుంది. ఇప్పటికే 50 రోజుల మైలు రాయిని పూర్తి చేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాత్ర పూర్తయి ఇప్పుడు అనంతపురంలో ఉంది. తొలుత నారా లోకేష్ అభ్యర్థుల ప్రకటన చేస్తూ వచ్చారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడ పార్టీ అభ్యర్థిని ప్రకటించేవారు. అలా దాదాపు పది మందిని ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత అభ్యర్థుల ప్రకటన ఆపేశారు. లోకేష్ తీరుపై పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు నొచ్చుకున్నందునే ఆ పని చేయోద్దని చంద్రబాబు వారించినట్లు చెబుతున్నారు. ఎన్నికలు రాకుండా అభ్యర్థులను ప్రకటిస్తే ఆశావహులు ఇప్పుడే నిరాశ చెంది జారిపోయే అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చినట్లున్నారు. ఏదేమైనా లోకేష్ చర్యలతో కొంత డేమేజ్ జరిగిందనుకున్నా పార్టీలో ఎక్కువ మంది నేతలు ఆయన వెంట ఉన్నారు. లోకేష్ పాదయాత్రలో స్థానిక నేతలే కాకుండా కొందరు బయట నుంచి కూడా వెళ్లి సంఘీభావం ప్రకటిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు నేతలు లోకేష్ దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు అందుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పంచుమర్తి అనురాధ కూడా లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. దానితో ఎవరైనా సరే లోకేష్ తో లోకేష్ చెప్పినట్లుగా ఉండాల్సిందేనన్న చర్చ జరుగుతోంది.

స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు హిందూపూర్ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు యమయాక్టివ్ అయ్యారు. ఆయన ఇప్పుడు టీడీపీ స్టార్ క్యాంపైనర్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం ఒక వంతయితే రాజకీయంగా దూకుడుని పెంచడం మరో వంతు. బాలయ్య ఎక్కడికి వెళ్లినా జనం ఈలలు, నినాదాలతో ఉత్సాహ పరిస్తున్నారు. ఆరు పదులు వయసు దాటినప్పటికీ యువ హీరోల కంటే ఎక్కువ పావులారిటీ కొనసాగించుకుంటున్న బాలయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆహ్వానాలు అందుకుంటున్నారు. క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వెళితే జై బాలయ్య నినాదాలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షోలో యమ పాపులారిటీ పొందిన బాలయ్య ఇప్పుడు క్రికెట్ కామెంట్రేటర్ గా కూడా మరో అవతారం ఎత్తబోతున్నారు. బాలయ్య స్పీచ్ ఇస్తుంటే ఒకప్పుడు అర్థం కాక పార్టీ అధిష్టానం కూడా ఇబ్బందిగా ఫీలయ్యేది. ఇప్పుడు మాత్రం బాలయ్య మాట్లాడితే బావుంటుందని చంద్రబాబే ఎంకరేజ్ చేస్తున్నారట. ఎందుకంటే బాలయ్య స్పీచ్ కోసం జనం ఎగబడుతున్నారు.

బాలయ్య ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఏ పనైనా చేయగలరు ఎంతటి వ్యతిరేకులనైనా మెప్పించగలరు. హైదరాబాద్ లో జరిగిన టీడీపీ 42వ పార్టీ ఆవిర్భావ సభలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్యే నిలిచారు. బాలయ్య మైక్ అందుకుని స్పీచ్ మొదలెట్టగానే ఈలలు గోలలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దద్దరిల్లాయి. బాలయ్య సాహిత్యాభిమాని తెలుగు నటుల్లో సాహిత్యం మీద పట్టున్న ఏకైక హీరో ఆయనే కావచ్చు. ఎక్కడికి వెళ్లినా నాలుగు పద్యాలు రెండు కొటేషన్లు చెప్పి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సభల్లో కూడా బాలయ్య అదే పని చేయగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. యూత్ ను ఆకట్టుకునే కొత్త అస్త్రాలు బాలయ్య దగ్గర ఉన్నాయనిపిస్తోంది. అన్ స్టాపబుల్ షో బాలయ్యలోని అసలు టాలెంట్ ను బయటకు తెచ్చిందని అంటున్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అంతర్లీనంగా మరో అంశాన్ని కూడా ఆవిష్కరించింది. ఆ సభలో చంద్రబాబు తర్వాత బాలయ్యకే అగ్రతాంబూలమిచ్చినట్లయింది. రెండు రాష్ట్ర శాఖల అధ్యక్షులు అచెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడిన తర్వాత నేరుగా చంద్రబాబు మాట్లాడటం ఆనవాయితీగా ఉండాలి. అప్పుడే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెంబర్ వన్ అని ఆయన తర్వాత రాష్ట్ర అధ్యక్షులదే కరెక్టు వారసత్వమని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడే ముందు బాలయ్యకు మాట్లాడే అవకాశం వచ్చింది. అంటే పాపులారిటీని బట్టి చూసినా హైరార్కీని బట్టి చూసినా చంద్రబాబు తర్వాత బాలయ్య అన్న ఫీలింగ్ ను కలిగించినట్లయ్యింది.

లోకేష్ వర్సెస్ బాలయ్య ఇది నిజంగా ఆసక్తికర చర్చే అవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పప్పు అన్న పేరు నుంచి లోకేష్ ఇంకా బయటకు రాలేదు. లోకేష్ పార్టీలో పూర్తి ఆమోదం ఉందని కూడా చెప్పలేమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోకేష్ విషయంలో పార్టీ లేదు బొక్కా లేదు అని కొందరు కామెంట్ చేసిన సందర్భమూ ఉంది. ఇప్పుడు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో లోకేష్ చాలా మందిని దూరం పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. తన టీమ్ అన్నట్లుగా కొందరిని ప్రోత్సహించి మరికొందరిని దగ్గరకు రానివ్వలేదు. బాలయ్య అలా కాదు. కోపమొస్తే కొట్టబోతారన్న ఆరోపణ తప్పించి అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తారు అందరితో బావుంటారు అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తారన్న మంచి పేరు ఉంది.

చంద్రబాబుకు పుత్రోత్సాహం తప్పదు. కొడుకును పైకి తీసుకురావాలన్న కోరిక ఆయనలో ఉంది ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు చంద్రబాబు కుటుంబానికి టీడీపీకి కూడా ముఖ్యమే ఎన్నికల వేళ ఎవరి దూకుడు పనిచేస్తుందో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. బాలయ్య వదలగల డైలాగులు జనం సమ్మోహనాస్త్రాలు లోకేష్ తో సాధ్యమా అని బేరీజు వేసుకోవాలి. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎవరికి కీలకమైన బాధ్యతలు అప్పగించాలో ముందే నిర్ణయించుకోవాలి. అక్కడే నెంబర్ టూ కాన్సెప్ట్ తెరమీదకు వస్తుంది.