పవన్‌కళ్యాణ్‌ నారా లోకేష్ ఇద్దరూ ఇద్దరే.. పైచేయి ఎవరిదో

By KTV Telugu On 27 January, 2023
image

తెలుగు రాజకీయాల్లో యాత్రా స్పెషల్స్ హడావుడి పెరిగింది. తెలంగాణలో షర్మిల యాత్ర చేస్తున్నారు. ఏపీలో యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. జనసేనాని పవన్‌కళ్యాణ్‌ త్వరలో యాత్ర ప్రారంభించబోతున్నారు. యాత్రకు షెడ్యుల్ రాకపోయినా ఆయన ఇటీవలే తన వాహనం వారాహికి కొండగట్టులో పూజలు నిర్వహించారు. ఏపీలో పొత్తులపై కూడా తనదైన శైలిలో స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఇద్దరు నేతలు యాత్రలకు దిగారు. పవన్, లోకేష్ ఇద్దరూ వేర్వేరు ఆలోచనా ధోరణులు ఉన్న పార్టీల నాయకులు. తెలుగు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీలో లోకేష్ కీలక సభ్యుడు. లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా ఏపీలో మంత్రిగా సేవలందించారు. పవన్‌కళ్యాణ్‌ గతంలో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధక్ష్యుడిగా పనిచేశారు. ఆయన జనసేన పార్టీని ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలవుతోంది.

నారా లోకేష్ పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ యువ తరానికి ప్రాతినిధ్యం వహించే నాయకులేనని చెప్పాలి. ఇద్దరికీ తమకంటూ ఒక ఛరిస్మా ఉంది. యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వారు వస్తున్నారంటే యువతరం ఎగబడటం పరుగులు తీయడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ మనుమడిగా చంద్రబాబు తనయుడిగా లోకేష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండటంతో లోకేష్ ను జనం సులభంగా గుర్తు పడతారు. మరో పక్క పవన్ కు సినిమా స్టార్ డమ్ పెద్ద అసెట్. సూపర్ హిట్ సినిమాల హీరోగా విలక్షణ నటుడిగా పవర్ స్టార్ గా ఆయన ఫేమ్ మారు మూల ప్రాంతాలకు కూడా చెరిపోయింది. రాజకీయాల్లో దూకుడున్న నాయకుడిగా కూడా పవన్ కు పేరుంది. దేనికి వెనుకాడకుండా ఎవరికీ భయపడకుండా పవన్‌కళ్యాణ్‌ దూసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని చెప్పాలి.

లోకేష్, పవన్ ఇద్దరూ రాజకీయ కూడలిలో ఉన్నారు. ఇంతవరకు వాళ్లకు సక్సెస్ కనిపించలేదు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో లోకేష్ పరాజయం పాలయ్యారు. పవన్‌కళ్యాణ్‌ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు. అయినా పార్టీ బలంతో విశాల ప్రజాదరణతో ఇద్దరూ నెట్టుకొస్తున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఇద్దరికీ విషమ పరీక్షే అవుతాయి. డూ ఆర్ డై బ్యాటిల్ లో ఇద్దరూ నెగ్గుకు రావాలి. తాము ప్రస్తుతం నిలబడిన కూడలి నుంచి ముందుకు నడుస్తూ అధికారం వైపుకు సాగిపోవాలి.

తండ్రి చాటు బిడ్డగా కాకుండా లోకేష్ సొంత బలం మీద ఎదగాలనుకుంటున్నారు. కేడర్ ను తన వైపు తిప్పుకుని మరింత బలోపేతం కావాలనుకుంటున్నారు. పప్పు ఇమేజ్ నుంచి బయట పడాలనుకుంటున్నారు. తండ్రి చంద్రబాబు కూడా అందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. అందుకే పాదయాత్రలో ఎక్కడా చంద్రబాబు కనిపించకుండా మొత్తం తానై నడిచి ముందుకు వెళ్లే షెడ్యూల్ సిద్ధమైంది. నా యాత్ర నా స్టైల్ అనే స్థాయిలో లోకేష్ జనంలో తిరుగుతారు. పవన్ కూడా దాదాపుగా అంతే. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత రాజకీయంగా పవన్ వేరు దారి చూసుకున్నారు. అన్నయ్య చిరంజీవితో సంబంధం లేకుండా జనసేనను ప్రారంభించారు. కలిసొస్తానన్న నాగబాబును చేర్చుకున్నారు. నిజానికి ఇప్పుడు పవన్ వన్ మ్యాన్ ఆర్మీ. ఆయనకంటూ కొన్ని భావాలున్నాయి. విప్లవం నుంచి సంక్షేమం వరకు స్వతంత్ర భావాలున్న పవన్ జనంపై సమ్మోహనాస్త్రాలు సంధించే ప్రసంగాలు చేయగలరు.

పవన్, లోకేష్ ఇద్దరికీ కుల బలం ఉంది. లోకేష్ కమ్మ సామాజిక వర్గం నేత, పవన్ కు కాపుల అండ పుష్కలంగా ఉందని చెప్పాలి. అయితే ఇద్దరినీ కులానికి అతీతులైన ప్రజా నాయకులుగానే చూడాలి. వారి వారి సామాజిక వర్గం ఓటర్లే కాకుండా అన్ని వర్గాల వారు ఇద్దరినీ అభిమానిస్తారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగంలో ఏపీ సాధించిన అభివృద్ధిని జనం గుర్తు చేసుకుంటారు. పైగా టీడీపీ బీసీల సంక్షేమానికి కృషి చేసే పార్టీ అని నిరూపితమై దశాబ్దాలైంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అని టీడీపీ నేతలు చెబుతారు. పవన్‌కళ్యాణ్‌ అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తారు. ఏదైనా ఘటన నమోదైనప్పుడు బాధితులకు అండగా నిలుస్తారు. వారికి సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తారు.

పవన్ లోకేష్ ఇద్దరికీ ఒక అజెండా ఉంది. ఇంతవరకు తాము చేసిందేమిటిన్న క్లారిటీ ఉంది. భవిష్యత్తులో చేయబోయేదేమిటన్న ఆలోచనతో పాటు ప్రజల వెనుకబాటుతనానికి కారణాలు వాటిని పరిష్కరించే అవకాశాలపైనా ఇద్దరికీ అవగాహన ఉంది. లోకేష్ పాదయాత్ర పవన్ వారాహి యాత్ర రెంటిలోనూ అవే అంశాలు ప్రస్ఫుటంగా ఆవిష్కృతం కావాలి. జనంలోకి ఎందుకొచ్చినట్లు జనానికి ఏం చేయబోతున్నట్లు, అధికారం అందిస్తే విశాల జనహితానికి ఎలా ఉపయోగపడబోతున్నట్లు ఇలాంటి ప్రశ్నలే వారి ముందుకు రాబోతున్నాయని తెలిసిన నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పేందుకు ఇద్దరు నేతలు సిద్ధం కావాలి

లోకేష్ పవన్ ఇద్దరూ అధికార పక్షంలో లేరు. జనానికి దగ్గరగా ఉండే విపక్షంలో ఉన్నారు. వారిపై అధికార పక్షం వత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని నిలబడే శక్తి సామర్ధ్యాలు కూడా వారికి ఉన్నాయి. వారికి అండగా ఉండే నాయకులు కార్యకర్తలూ ఉన్నారు. ఎటొచ్చి ఇద్దరూ సరైన దిశలో పయనించడం లేదని కీలక సమయాల్లో దారి తప్పుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. తొలుత ఇద్దరు నేతలు వాటి నుంచి బయట పడాలి. అందలం ఎక్కిస్తే అందరి కోసం పనచేస్తారన్న ఫీలింగ్ కల్పించాలి. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటూ యాత్రలు ముందుకు సాగాలి సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి ఎలాంటి పరిష్కారం చూపాలో వారికి చెప్పేందుకు కేడర్ బలం వారి సొంతమని మరిచిపోకూడదు. ఏకపక్ష నిర్ణయాలు ప్రకటించే కంటే ముందే కొంత సమీక్ష జరుపుకుని నిర్ణయాలను బేరీజు వేసుకుని అప్పుడు ప్రకటనలు చేస్తేనే సహేతుకంగా ఉంటాయని మరిచిపోకూడదు.

లోకేష్ పవన్ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తర్కించుకునే కంటే ఇద్దరి బలబలాలు ఏమిటన్న సమీక్ష అవసరం. ఇద్దరూ రోడ్డు మీదకు వస్తే చూసేందుకు అభిమాన జనం బాగానే వస్తారు. ఖచితంగా చెప్పాలంటే లోకేష్ కంటే పవన్ స్పీచులకే ఎక్కువ మంది కేరింతలు కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కు సినిమా గ్లామర్ ఉంది. ఆయన డైలాగ్ లో పంచ్ లైన్ ఉంటుంది. లోకేష్ కూడా పవన్ స్టైల్ లో ప్రసంగాలు చేస్తూ జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలి. డైలాగ్స్ లో పంచ్ లైన్ పెంచాలి. ఇప్పుడు అంత కంటే పెద్ద సమస్య మరోటి ఉంది. కొన్ని సందర్భాల్లో ఇద్దరు నేతలు అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇకపై అలాంటి పొరబాట్లు చేస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తించాలి. ఎక్కడా పొరబాట్లు దొర్లకుండా ఇద్దరు నేతలు తమ ప్రసంగాలను సిద్ధం చేసుకోవాలి. ఇలా మాట్లాడుతున్నాడేమిటీ అని విమర్శించకుండా భలే చెప్పాడన్న ప్రశంసలు పొందే ప్రసంగాలు చేయగలగాలి.

పార్టీల కింది స్థాయి నేతల్లోనూ కార్యకర్తల్లోనూ కీచులాటలు ఎక్కువవుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టికెట్ల పంచాయతీతో ఒకరినొకరు ముంచేసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీల్లో వెన్నుపోటుదారులు అవకాశం కోసం కాచుకు కూర్చున్నారు. టికెట్ రాని వాళ్లు పక్క చూపులు చూస్తారు. ఇలాంటి సమస్యలు యాత్రల సందర్భంగా బయట పడే అవకాశం ఉంది. వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ నేతలు ముందుకు సాగాలి. మీడియా సాక్షిగానూ పది మందిలోనూ విభేదాలు బయట పడకుండా చూసుకోవాలి. సంప్రదింపులు ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అవకాశాన్ని బట్టి అందరికీ తగిన ప్రాధాన్యం లభిస్తుందని చెప్పగలగాలి. నిజానికి లోకేష్ పవన్ ఇద్దరిదీ పెనుసవాలే. టీడీపీలో సామంతరాజులు ఎక్కువయ్యారు. వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. జనసేనలో స్వతంత్రంగా వ్యవహరించాలనుకునే నాయకులు ఎక్కువ వారి అవసరానికి మించి ప్రవర్తిస్తుంటారు. ఓవరాక్షన్ చేస్తుంటారు. అలాంటి శక్తులను కట్టడి చేయగలిగినప్పుడే యాత్రల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ సంగతి గ్రహిస్తే ఇద్దరికీ మంచిదే లేకపోతే వారిష్టం.