లోకేష్ యాత్రకు జనంలేక వెలవెల.. నేతలపై చంద్రబాబు రుసరుస

By KTV Telugu On 10 February, 2023
image

టిడిపి యువరాజు నారా లోకేష్ నిర్వహిస్తోన్న యువగళం పాదయాత్ర విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలపై కోపంగా ఉన్నారని సమాచారం. యాత్ర జోష్ గా ముందుకు సాగేలా ఆయా ప్రాంతాల సీనియర్ నేతలు కష్టపడకపోవడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారట. ఫోన్లోనే చెడామడా తిట్టారని అంటున్నారు.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వరుసగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దారుణంగా ఓటమి చెందింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ఠ భూస్థాపితం అయిపోయింది. ప్రత్యేకించి అమరావతే రాజధానిగా ఉండాలని టిడిపి ఉద్యమిస్తోంటే ఆ ప్రాంతంలోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కే జనం పట్టం కట్టడం టిడిపి అధినేతకు మింగుడు పడలేదు. జనం మరీ ఇంత దారుణంగా హ్యాండిస్తారని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు.

ఈ ఘోర పరాజయాలతోనే క్షోభపడుతోంటే చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పార్టీ చాప చుట్టేయడం చంద్రబాబకు కోలుకోలేని షాకే. కుప్పంలో పరాజయాల పరంపర తర్వాతనే చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షాళనపై పడ్డారు. పార్టీని ఇప్పట్నుంచీ ప్రక్షాళన చేసుకోకపోతే 2024 ఎన్నికల్లోనూ ఘోరమైన ఫలితాలు తప్పవని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే సైకిల్ కి రిపేర్ వర్క్ మొదలు పెట్టారు. మరో వైపు పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి తన కుమారుడు నారా లోకేష్ చేత సుదీర్ఘ పాదయాత్రకు స్కెచ్ గీశారు. కుప్పం నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 400 రోజుల పాటు సాగే యాత్రలో లోకేష్ 4000 కిలోమీటర్లు నడిచేలా యాత్రకు షెడ్యూల్ చేశారు.
2014 ఎన్నికలకు ముందు తాను పాదయాత్ర చేసి టిడిపిని అధికారంలోకి తెస్తే 2018లో పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఇక ఇపుడు లోకేష్ పాదయాత్ర చేసి 2024 ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తెస్తారని చంద్రబాబు నాయుడితో పాటు టిడిపి నేతలంతా ధీమాగా ఉన్నారు.

జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్రను ఆడంబరంగా ప్రారంభించారు. పార్టీ సీనియర్ నేతలంతా తరలి వచ్చారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం వ్యక్తం చేశారు. యాత్ర మొదలు పెట్టి రెండు వారాలు అయిపోయింది. రోజుకు పది కిలోమీటర్ల చొప్పున యాత్రసాగుతోంది. ఈ క్రమంలో జనంతో లోకేష్ మమేకం అవుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందరూ సుఖంగా ఉండాలంటే జగన్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నారు. లోకేష్ భౌతికంగా కష్టపడుతున్నారు కానీ ప్రసంగాల్లో తరచుగా తడబడ్డం సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. అయితే ఇలాంటి ట్రోలింగ్ లు రాజకీయాల్లో మామూలే కాబట్టి వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదని లోకేష్ భావిస్తున్నారు. అందుకే మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. అయితే యాత్రలో పార్టీ సీనియర్ నేతలు అంతగా సహకారం అందిచడం లేదని లోకేష్ భావిస్తున్నారు. యాత్ర 13వ రోజున లోకేష్ యాత్ర మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు.

అయితే యాత్రను జోష్ గా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన జనం లేరు. ఎంత సేపటికీ జనం తరలి రాకపోవడంతో లోకేష్ కు విసుగొచ్చి క్యారవాన్ లోనే ఉండిపోయారు. సాయంత్రం వరకు అలా ఉండి చివరకు తండ్రికి ఫోను చేసి పార్టీ సీనియర్ల వ్యవహారాన్ని జనం లేకపోవడాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యారని సమాచారం. వెంటనే టెలికాన్ఫరెన్స్ పెట్టి చిత్తూరు జిల్లా నేతలందరినీ లైన్లోకి తీసుకుని చెడా మడా తిట్టేశారట. ఏం తమాషాగా ఉందా యాత్రను సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా మిమ్మల్ని నమ్ముకుంటే ఇలానే చేస్తారా తేడా వస్తే అందరి తోకలూ కత్తిరిస్తా అంటూ బాబు సీరియస్ అయ్యే సరికి అందరూ ఆయన్ను శాంతింప చేసి ఇకనుండి చూసుకోండి యాత్ర అదిరిపోతుంది అని చెప్పారట. ఇది జరిగిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు యాత్ర లో లోకేష్ తర్వాతి రోజుల్లో నడవబోయే నెల్లూరు గంగాధర ప్రాంత నేతలకు ఫోన్ చేసి యాత్ర లో జనం గట్టిగా ఉండేలా చూసుకోవాలి యాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కావడానికి వీల్లేదు అని జాగ్రత్తలు చెప్పారు.

దానికి ఆ టిడిపి నేత జనాన్ని తరలించడానికి తాను చేసిన ఏర్పాట్లు దానికి ఎంత ఖర్చు చేస్తున్నదీ కూడా అచ్చెంనాయుడికి వివరించారు. అయితే కొసమెరుపు ఏంటంటే ఇపుడా టెలిఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎవరు లీక్ చేశారు తెలీదు కానీ రాష్ట్రమంతా ఆ ఆడియా వినేసింది. గతంలో ఇదే అచ్చెంనాయుడు తిరుపతిలో ఓ టిడిపి కార్యకర్తతో మాట్లాడుతూ పార్టీ లేదు బొక్కా లేదు అని చేసిన వ్యాఖ్యల వీడియో టేప్ ఎలా వైరల్ అయ్యిందో ఇప్పుడూ ఆడియా అలానే వైరల్ అవుతోంది. దీనిపై టిడిపి నాయకత్వం గుర్రుగానే ఉంది. పార్టీలోనే కొందరు కోవర్టులు ఉన్నారని వారుభావిస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారికి పక్క చూపులు చూసేవారికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీరియస్ గా స్పష్టం చేశారట. లోకేష్ యాత్ర ఇంకా ఏడాదికి పైగా సాగాల్సి ఉంది . ఆలోగా ఇంకెన్ని పదనిసలు వినాలో ఇంకెన్ని కిత కితలు పడాలో చూడాలంటున్నారు రాజకీయ పండితులు.