ఏపీ ఎన్నికల్లో నారా, నందమూరి కుటుంబాలకు చెందిన మొత్తం ఐదుగురు పోటీ చేశారు. వీరిలో ఇద్దరు ఎంపీలుగా, ముగ్గురు ఎమ్మెల్యేలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు చంద్రబాబు బంధువులు విస్తరించారు. పైగా వీళ్లంతా టీడీపీలోనే పోటీ చేయడంలేదు. బీజేపీ నుంచి కూడా పోటీ పడుతున్నారు. ఇంతకీ వాళ్ళెవరో…ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చూద్దాం.
నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్..లోకేష్ తోడల్లుడు గీతం భరత్…లోకేష్, భరత్‌ల మామ, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ…బాలకృష్ణ సోదరి, నారా చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరి…ఇలా మొత్తం ఐదుగురు రక్త సంబంధీకులు తాజా ఎన్నికల బరిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారి పల్లి ఉన్న చంద్రగిరిలో 1983లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 1989 నుంచి వరుసగా కుప్పంలో పోటీ చేసి గెలుస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన మెజారీటీ తగ్గుతూ వచ్చింది. ఈసారి బాబును ఓడించడమే లక్ష్యంగా బీసీ వర్గానికి చెందిన భరత్ ను బరిలో దింపారు జగన్ మోహన్ రెడ్డి.
మూడున్నర దశాబ్దాలుగా గెలిపిస్తున్న కుప్పంలో ఇల్లు కూడా కట్టుకోలేదు చంద్రబాబు. కనీసం అక్కడ ఓటరుగా కూడా నమోదు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు హైదరాబాద్‌లోనే ఓటేసిన చంద్రబాబు..రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట మీద టీడీపీ వ్యాపారవేత్త నిర్మించిన గెస్ట్ హౌజ్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు కూడా ఉండవల్లిలోనే ఓటేశారు. ఇక చంద్రబాబు ముద్దుల తనయుడు లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా పోటీ చేశారు. గెలుస్తామన్న ధీమాతోనూ ఉన్నారు లోకేష్.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ముచ్చటగా మూడు శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు. ఇక లోకేష్ తోడల్లుడు, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు గీతం యూనివర్శిటీ అధినేత మతుకుమిల్లి శ్రీభరత్ రెండోసారి విశాఖ ఎంపీ స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెండేళ్ళ నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి తన తమ్ముడి అల్లుడి కోసం సొంత పార్టీ నేత జీవీఎల్ కు మొండిచెయ్యి చూపించారన్న ఆరోపణలు వచ్చాయి.
నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి గత రెండు ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు మూడుసార్లు, బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ ఒకసారి హిందూపురం నుంచి గెలిచారు. ఆ ధైర్యంతో బాలకృష్ణ కూడా 2014లో అక్కడ బరిలో దిగారు. రెండు సార్లు గెలిచినా..హిందూపురం ప్రజలకు, నియోజకవర్గానికి బాలకృష్ణ అందుబాటులో ఉండరన్న విమర్శ అయితే ఉంది.. ఆరు నెలలకోసారి నియోజకవర్గానికి వస్తున్నారు. ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే. దీంతో తమకు స్థానికంగా నివసించే ఎమ్మెల్యే కావాలని హిందూపురం ప్రజలు కోరుతున్నారట.
ఏపీలోని భారతీయ జనతాపార్టీని బాబు జనతాపార్టీగా మార్చిన దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలోని చంద్రబాబు మనుషుల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. బీజేపీలోని ఒరిజినల్ నాయకులు ఎవరికీ ఎన్నికల్లో సీట్లు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తాను గతంలో 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు వైఎస్‌ఆర్ గాలిలో అలవోకగా గెలిచిన పురంధేశ్వరి ఇప్పుడు రాజమండ్రి నుంచి బరిలో దిగారు. గతంలో ఒకసారి విశాఖ నుంచి బీజేపీ గెలిచినా..ఆ సీటును టీడీపీలోని తన తమ్ముడి అల్లుడి కోసం త్యాగం చేశారు. ఇక రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నించినా ఆయన్ను పక్కకు తప్పించి తాను పోటీ చేస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…