ఏపి వైసీపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వాటిలో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు సైతం వైసీపీ గాలిలో పరాజయం పాలయ్యారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. ఎంతగా అంటే.. అభ్యర్థుల్ని మార్చేయాల్సిన పరిస్థితి. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ ను నర్సరావుపేట పంపారు. కానీ టీడీపీ తరపున మాత్రం మాజీ మంత్రి నారాయణే పోటీ చేయబోతున్నారు. ఇప్పుడా నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది ?
ఏపీ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేటు. ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది. ఇప్పుడు కూడా టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖపోరుకు రంగం సిద్ధమైంది. 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే ఆయనను ఇప్పుడు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించడంతో సింహపురి రాజకీయం మారిపోయింది. పొలిటికల్ చెక్ మేట్ పెట్టడానికి వైసీపీ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపితే.. గత ఎన్నికల్లో పోరాడి ఓడిన అభ్యర్థినే టీడీపీ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది.
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ 47 శాతం ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిపై గెలిచారు. టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు 46 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి కేతం రెడ్డి వినోద్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్ట్ చాలా పని చేసింది. అదే సమయంలో నారాయణ కూడా గట్టిపోటీనే ఇచ్చారు. కాపు సామాజికవర్గం సహా టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా నారాయణవైపే ఉంది. . ఎన్నికల తర్వాత టీడీపీ మరింత బలహీనపడింది. కేసుల కారణంగా నారాయణ నాలుగేళ్ల పాటు బయట కనిపించలేదు. ఫలితంగా నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది.
కానీ ఎప్పుడైతే వైసీపీలో ముసలం ప్రారంభమయిదో అప్పట్నుంచి నెల్లూరులోనూ సీన్ మారిపోయింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై బలమైన ప్రభావం చూపగల ఆనం, కోటంరెడ్డి టీడీపీలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వైసీబీ అభ్యర్థిగా మహ్మద్ ఖలీల్ అహ్మద్ ను ఖరారు చేశారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. అయితే ఆయనకు రాజకీయంగా పలుకుబడి లేదని.. అనిల్ యాదవ్ పరపతిపైనే నిలబడ్డారన్న వాదన వినిపిస్తోంది. నారాయణ హయాంలో బాగా అభివృద్ధి పనులు జరగగా… గత ఐదేళ్లగా పనులు ఆగిపోయాయి. నెల్లూరు సిటీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం.. సీసీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారడం వంటివి పరిష్కరించకపోవడం సస్యగా మారింది. టీడీపీ అభ్యర్థిగా నారాయణకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు రూ.5 వేల కోట్లతో నెల్లూరు అభివృద్ధి పనులు చేపట్టారు.
నెల్లూరు సిటీలో ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు టీడీపీవైపే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభ్యర్థిని మార్చితే అవకాశం ఉంటుందేమోనని వైసీపీ అధినేత ప్రయోగం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి నారాయణకు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కనిపిస్తోంది. అదే సమయంలో ఓడినప్పటికీ గతంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పని చేసిన టైంలో 5 వేల కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేయడం ప్లస్ పాయింట్ గా మారుతోంది. వైసీపీ ప్రభుత్వంపై యాంటీ ఇంకుంబెన్సీ కూడా టీడీపీ ఎడ్జ్ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…