వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ చెప్పినా వినకుండా, చెప్పేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా మహిమీద ఆడిన జగన్ రెడ్డి ఇప్పుడు నేలకు దిగి వాస్తవాలను అర్థం చేసుకుంటున్నారు. ఇంతవరకు పెత్తనం చేసిన వారిని పక్కనపెట్టి..ఇప్పుడు పార్టీలో కొత్త నీరు పారించేందుకు అవకాశం ఇస్తున్నారు.. పార్టీకి సలహాదారుగా ఐఐటీ గ్రాడ్యుయేట్ ఆళ్ల మోహన్ సాయిదత్‌ను నియమించారు. మరో పక్క విజయసాయి రెడ్డి లాంటి వారికి ఉద్వాసన పలికినట్లేనని చెబుతున్నారు.
విజయసాయి పాయే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాయే..అన్నది ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న కొత్త పాట..సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత వైసీపీలో జరుగుతున్న మార్పులకు అనేక సంకేతాల్లో ఇదీ ఒక భాగమేనని చెప్పాలి. నిజానికి వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కొన్ని జిల్లాలలో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక ఎన్నికల తర్వాత కూడా పలువురు ముఖ్యనేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికీ చాలా మంది పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్మిర్మాణం చేసి.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించడం సహా.. పార్టీ నిర్మాణం కోసం సలహాదారుణ్ని నియమించారు.పార్టీ పునర్ నిర్మాణానికి సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్‌ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.దీంతో ఎవరీ మోహన్ సాయిదత్ అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న జనంతో పాటుగా.. వైసీపీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆళ్ల మోహన్ సాయిదత్ విషయానికి వస్తే.. ఈయన చెన్నై ఐఐటీలో చదువుకున్నారు. పొలిటికల్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం సాయిదత్ టీమ్ పనిచేసింది. అలాగే ఢిల్లీలోని బీజేపీ ముఖ్యనేతకు ఫీడ్ బ్యాక్ ఇవ్వటంలోనూ మోహన్ సాయిదత్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో నారా లోకేష్ కోసం కూడా సాయిదత్ టీమ్ పనిచేసినట్లు సమాచారం.
సాయిదత్ ను ఎందుకు నియమించారు. విజయసాయికి ఏమైంది..లాంటి అంశాలపై వైసీపీలో చర్చ జరుగుతున్న మాట వాస్తవం. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పోస్టుకే ఎసరు తెచ్చారని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. కొందరు యువ నేతలతో సజ్జలపై విమర్శలు చేయించి..ఇక బయటకు నడువు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఆ సంగతి అర్థం చేసుకుని సజ్జల దూరం జరిగితే సాయిదత్ టీమ్ కు ఫుల్ పవర్స్ ఇచ్చి.. వైసీపీలో అన్ని పదవులను యువతతో నింపెయ్యాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయి, చెవిరెడ్డిలను దూరం పెట్టే ప్రయత్నం జరగ్గా.. వారే స్వచ్ఛందంగా తొలగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి….
2019 ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్ పనిచేసింది. నాటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైసీపీ.. అధికార పగ్గాలు చేపట్టింది. అయితే 2024 నాటికి ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ కోసం రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐప్యాక్ బృందం వైఎస్ జగన్, వైసీపీ విజయం కోసం పనిచేసింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఫలితాలు రాగానే రుషిరాజ్ టీమ్ పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోయింది.ఆ బృందం వైసీపీని నిండా ముంచిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దానితో ఇప్పుడు కొత్త సలహాదారుగా సాయిదత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లోపే విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరూ దూరం జరుగుతున్నారు. సీనియర్లుగా ఒకప్పుడు వాళ్లు జగన్ కు చాలా క్లోజ్. జగన్ తాడేపల్లి నివాసం దగ్గరే వాళ్లు కూడా భవనాలు కొనుక్కుని మనం మనం బరంపురం అని సంకేతాలిచ్చారు. ఎన్నికల ముందు నుంచే విజయసాయిని కాస్త దూరం పెట్టగా, ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పొమ్మనకుండా పొగపెట్టారని చెబుతున్నారు. దానితో విజయసాయి రెడ్డి .. తాడేపల్లిలోనే తన రెండు విల్లాలను ఒక కమర్షియల్ సంస్థకు లీజుకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చెవిరెడ్డి ఏకంగా తాడేపల్లిలోని తన ఇంటిని అమ్మేశారు. హైదరాబాద్ నివాసాన్ని కూడా విక్రయించేశారట. ఇప్పట్లో వాళ్లిద్దరూ వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ కు కాస్త దూరంగా ఉన్నట్లే అనుకోవాలి…
ఒక రకంగా చెప్పాలంటే జగన్ కాస్త త్వరగానే నిద్రలేచారనుకోవాలి. కొత్త సలహాదారులతో కొత్త నీరు పారిస్తున్నారనుకోవాలి. ఆయన వేసిన తొలి అడుగు ఎలా ఫలిస్తుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…