వైఎస్ వివేకానందరెడ్డి ఎలాగూ తిరిగిరాడు. ఆయన కారణంగా తాము జైలు జీవితం అనుభవించడానికి బంధువులు కాని బంధువులెవరూ సిద్ధంగా లేరు. పోయినోళ్లంతా మంచోళ్లన్నట్లు ఉన్నోళ్లనయినా కాపాడుకుందామన్నది ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆలోచన. అందుకే సోదరి న్యాయంకోసం కోర్టులచుట్టూ తిరుగుతున్నా అన్న మాత్రం అవినాష్‌రెడ్డివైపే ఉన్నారు. బాబాయ్ హత్యకేసులో జరుగుతున్న పరిణామాలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయ్. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ని తోసిపుచ్చటంతో తండ్రిలాగే కొడుకు అరెస్ట్ అనివార్యమయ్యేలా ఉంది. ఏప్రిల్ 25వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు చట్టపరమైన రక్షణ కల్పించింది. కానీ హైకోర్టు నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. కీలక సమయంలో జోక్యం చేసుకుంటే విచారణ సంస్థల దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని సుప్రీం అభిప్రాయపడింది. దాంతో విచారణకు వెళ్లినా అరెస్టుదాకా రాదన్న అవినాష్‌రెడ్డి ధైర్యం సడలిపోయింది. ఆయనకున్న చట్టపరమైన కవచం తొలగిపోయింది. దీంతో వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డిని విచారించి పంపాలా అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించాలా అన్నది సీబీఐ చేతుల్లోనే ఉంది.
అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి మీద ఆరోపణలు చేయొచ్చు. అభాండాలేస్తోందని సోదరి సునీతను తప్పుపట్టొచ్చు. కానీ వివేకా హత్యకేసులో అనుమానితులు నిందితులు దర్యాప్తు సంస్థనే తప్పుపడుతున్నారు. విచారణ జరుగుతున్న తీరుని వేలెత్తిచూపిస్తున్నారు. వైఎస్ వివేకా కూతురు సునీతతో టీడీపీ కుమ్మక్కై సీబీఐని ప్రభావితం చేస్తోందన్నట్లు మాట్లాడుతున్నారు. సీబీఐ ఎలా ఎంక్వయిరీ చేయాలో వేటిమీద దృష్టిపెట్టాలో నిందితులు సూచనలు చేస్తుండటం దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా చూడని విడ్డూరం. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ గుడ్డిగా విచారణ జరిపితే దాని విశ్వసనీయత బోనులో నిలబడుతుంది. కేసు వీగిపోతుంది నిందితులు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని నిందలు మోపుతున్నా సీబీఐ తన పని తాను చేసుకుపోతోంది. ఎంపీ తండ్రి అరెస్ట్ కూడా పక్కా ఆధారాలతో జరిగింది. అందుకే సీబీఐ విచారణను సుప్రీం కూడా తప్పుపట్టటంలేదు. సీబీఐకి ఆ ఉద్దేశమే ఉంటే అవినాష్‌రెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేదని సుప్రీం వ్యాఖ్యానించింది.
అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని వివేకా కూతురు సుప్రీంలో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ మధ్యంతర ఉత్తర్వులని సుప్రీం రద్దుచేసింది. మరోవైపు ఏప్రిల్ నెలాఖరుకల్లా ముగించమని చెప్పిన వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తుకు మరో రెండునెలల సమయం ఇచ్చింది. జూన్ 30కల్లా కేసు విచారణ ముగించాలని ఆదేశించింది. రెండ్రోజులు పులివెందులలోనే ఉన్న సీబీఐ అధికారులు మరోసారి మర్డర్ స్పాట్‌ని పరిశీలించారు. ఎంపీ ఇంటినుంచి సంఘటనా స్థలానికి చేరుకునేందుకు పట్టే సమయాన్ని అంచనావేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో వైఎస్సార్ కడప జిల్లాకు ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను కూడా సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య తర్వాత రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్‌లో ఆయన కూడా ఉన్నారు. దీంతో వివేకా హత్య జరిగిన రోజులన సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలపై ఆ ఐపీఎస్ అధికారిని సీబీఐ ప్రశ్నించటంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది.