త్వరలోనే పవన్ బిజెపితో తెగ తెంపులు చేసుకుంటారని టిడిపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. పవన్ తమతోనే పొత్తు కొనసాగిస్తారని ఏపీ బిజెపి నేతలు చెప్పుకొస్తున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి ఏం చేశారో చెప్పాలంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. పవన్ మాత్రం తనకే సాధ్యమైనట్లు భవిష్య ప్రణాళికల గురించి సరియైన సమయం వచ్చినపుడే చెబుతానని కూల్ గా అన్నారు. అసలు పవన్ తన ఢిల్లీ టూర్ తో కొత్త గందరగోళం సృష్టించారా లేక ఏమైనా సాధించారా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు ఇద్దరూ దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులు ఉండి వచ్చారు. బిజెపి నేతల ఆహ్వానం మేరకే తాము ఢిల్లీ వచ్చామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు కూడా. ఢిల్లీలో కీలక బిజెపి అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రత్యేకించి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ పాలన నుండి విముక్తి చేయడమే తమ అజెండా అని మొదట్నుంచీ చెబుతూ వస్తోన్న పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని బిజెపి నేతలకు వివరించారు. వైసీపీని గద్దెనెక్కనీయకుండా అడ్డుకోడానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని చెప్పుకొచ్చారు. అటు బిజెపి నేతలుకూడా పవన్ చెప్పేది శ్రద్ధగా ఆలకించడమే కాక సానుకూలంగా వ్యవహరించినట్లు హస్తిన బిజెపి వర్గాల సమాచారం.
అయితే బిజెపి నేతలతో భేటీల అనంతరం మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ఏ విధమైన వ్యూహాలతో ముందుకు వెళ్తారు అని మీడియా ప్రశ్నించగా త్వరలోనే ఆ విషయాలు వెల్లడిస్తామన్నారు. ఏపీలో బిజెపి కూడా స్థానికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆ విషయం కూడా తమ చర్చలో ప్రస్తావనకు వచ్చిందని పవన్ వివరించారు. పవన్ ఢిల్లీ టూర్ పై ఏపీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ని బిజెపి నేతలే పిలిచారా లేక పవన్ కళ్యాణే పనిగట్టుకుని ఢిల్లీ వెళ్లారా అన్న ప్రశ్నలను కొందరు సంధిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెబితేనే పవన్ ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలను కలిశారని బిజెపితో విడాకులు తీసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లనే పవన్ ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. టిడిపితో పొత్తుకు ససేమిరా అంటోన్న బిజెపి ఏపీలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలనూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి టిడిపి నేతలు దీన్ని బాగా ప్రచారంలో పెడుతున్నారు. బిజెపితో తెగ తెంపులు చేసుకుని టిడిపితో పొత్తు పెట్టుకోడానికే పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారని కూడా టిడిపి ప్రచారం చేస్తోంది.
ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్లు చేసుకుపోతున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రచారాలు చేసుకుపోతున్నారు. అసలక్కడ బిజెపి నేతలతో పవన్ ఏం చర్చించారన్నది బిజెపి నేతలకు పవన్ కూ మాత్రమే తెలుస్తాయి. కానీ మిగతా వారంతా తామే అక్కడ దగ్గరకుండి బిజెపి-జనసేనల చర్చలను బల్లకింద దాగి విన్నట్లు చూసినట్లు ప్రచారాలు చేసుకుపోతున్నట్లు కనిపిస్తోందని బిజెపి నేతలు అంటున్నారు. మన దేశంలో ఇటువంటి దిగజారుడు ఊహాగానపు రాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయని ఇంకెక్కడా ఇలాంటివి చూడమని వారంటున్నారు. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలన్నింటినీ బిజెపి నేతలు సీరియస్ గా తీసుకున్నారట. ఏపీలో వపన్ కళ్యాణ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదని బిజెపి నేతలకు తెలుసు. అందుకే పవన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడానికి బిజెపి అగ్రనాయకత్వం సిద్ధంగా లేదంటున్నారు. పవన్ కు వీలు కుదిరితే కర్నాటకలోనూ బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా బిజెపి అగ్రనేతలు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఏపీ తెలంగాణా బిజెపి నేతలతో వచ్చిన చిన్నచిన్న పొరపొచ్ఛాలను సీరియస్ గా తీసుకోవద్దని బిజెపి-జనసేనల అనుబంధం చాలా కాలం కొనసాగుతుందని బిజెపి అధ్యక్షుడు నడ్డా కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం.