జగన్ అంటే భయం పోయిందా ?

By KTV Telugu On 29 July, 2023
image

KTV Telugu ;-

ప్రాంతీయ పార్టీల తీరు మారుతోందా ? అధినేతలను కూడా మామూలు నేతలుగానే చూస్తున్నారా ? ఎవడైతే మాకేంటి అనే ఆలోచన వచ్చిందా ? మాది కానప్పుడు వేరే వాళ్లకు ఎందుకు దక్కాలన్న దృఢనిశ్చయం ప్రతీ నేతలో కలుగుతోందా.. ? వైసీపీలో ఇప్పుడు ఫ్రీ ఫర్ ఆల్ పరిస్థితి వచ్చినట్లేనా…

వీర విధేయులే రెబెల్ స్టార్స్ గా మారిపోతున్నారు.నాకే కావాలి.. వేరే వాళ్లకు ఇస్తే సహించేది లేదన్నట్లుగా తయారయ్యారు. ఇంతకాలం నెత్తిన పెట్టుకుని మోస్తే.. ఇప్పుడు రూటు మార్చుతారా అని నిలదీస్తున్నారు. సీఎం జగన్ స్వయంగా పిలిపించి మాట్లాడినా .. ఏదీ జాన్తా నై.. మేము అన్నకున్నట్లు చేయవోయ్ అని కూడా సలహాలిచ్చేస్తున్నారు.అధినేతను చూస్తే ఒణికిపోయే జనం.. ప్రస్తుతం ఇక చాల్లే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. పరిస్థితులు మారుతున్నాయా… విధి విలాపమా అని చెప్పలేనంత మీమాంస నెలకొందని ఒప్పుకోకతప్పదు..

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నిన్న మొన్నటిదాకా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వేదం. ఆయనే సుప్రీమ్ లీడర్. జగన్ పిలుస్తున్నారంటే వణుక్కుంటూ పోయేవాళ్లు. ఆయన ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లుగా భావిస్తూ చక చకా పనులు చేసుకుంటూ పోయేవాళ్లు. ఆయన కోరితే ఎంత పెద్ద పదవి అయినా వదులుకునేందుకు సిద్ధమయ్యేవాళ్లు . ఇప్పుడు మాత్రం అంతా రివర్స్ హ్యామరింగ్ జరుగుతోంది. తాము కోరుకున్నది జరగకపోతే జగన్ ను ఎదురించి నిలబడేందుకు సైతం నేతలు వెనుకాడటం లేదు. నెల్లూరు పెద్దా రెడ్లు సీఎంను ధిక్కరించి వెళ్లిపోయిన తర్వాత వైసీపీలో ఎవరూ జగన్ కు భయపడటం లేదన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు భయపడాల్సిన అవసరం లేదన్న ప్రచారమూ చేసేస్తున్నారు.

వైసీపీలో క్రమశిక్షణ రాను రాను తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన పిలిచి టికెట్ ఇస్తే సరి.. లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని మొహం మీదనే చెప్పేసి వస్తున్నారు.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అదే చెబుతున్నారు. ఒక్క సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాదు… ఇటీవలి కాలంలో వైసీపీ నేతంతా అదే భావనలో ఉన్నారు. ఇతర పార్టీల్లో తమకు చోటు ఉంటుందని అంచనాకు వచ్చిన చోట్ల వైసీపీ నేతలను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా నెల్లూరు లో నేతలంతా అదే పని చేయడం దీనికి నిదర్శనం. పైగా కోటంరెడ్డికి టీడీపీలో నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ పదవి కూడా దక్కింది. చివరికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కూడా దండం పెట్టి జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు రామచంద్రాపురం నుంచి పిల్లి బోస్ కూడా అదే చేస్తున్నారు. ఉంటే మంత్రి చెల్లుబోయన ఉండాలి లేకపోతే నేనుండాలి అనేట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు.

ఒకప్పుడు జగన్ తో రాసుకుని, పూసుకుని తిరిగిన వాళ్లే ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయనతో నడిచి, జగన్ కోసం ప్రాణాలు అర్పిస్తామని ప్రతజ్ఞ చేసిన వాళ్లే ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. మంగళగిరి ఆర్కే,తిరుపతి భూమన, చంద్రగిరి చెవిరెడ్డి లాంటి వాళ్లు బయటపడకపోయినా వారిలో కూడా జగన్ పట్ల సానుకూలత లేదని వార్తలు వస్తున్నాయి. పాత వారికి కొత్త వారికి మధ్య సంఘర్షణే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. జగన్ ఒంటెత్తు పోకడ, ఆయన చుట్టూ ఉన్న వారి పద్ధతులతో మొదటి నుంచి ఉన్న నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో ఉండే కంటే బయటకు వెళ్లిపోవడమే మంచిదన్న ఆలోచన వారిలో కలుగుతోందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మరి జగన్ వైఖరి మారకుంటే ఎన్నికల నాటికి వైసీపీ తీవ్ర సంక్షోభంలో మునిగిపోవడం ఖాయమనిపిస్తోంది

 

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..