జగన్‌ను కంగారుపెడుతున్న కాపులు

By KTV Telugu On 30 December, 2022
image

ఏపీ రాజకీయాల్లో మళ్లీ కాపు కోటాపై రగడ మొదలైంది. కాపు రిజర్వేషన్లపై మరోసారి పార్టీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గతంలో కాపులకు కోటా ఇచ్చామని చెబుతున్న టీడీపీ దాన్ని అమలు చేయలేకపోయింది. సీఎం జగన్‌ ఎన్నికలకు ముందే కేంద్రం పరిధిలో అంశమని తేల్చేశారు. లేటెస్టుగా రాష్ట్రమే నిర్ణయం తీసుకోవచ్చని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం ఏపీలో రచ్చ రాజేస్తోంది. కాపు రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర నిర్ణయానికే కేంద్రం వదిలేయడంతో కాపు ఉద్యమనాయకులు, విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలంటూ కాపు ఉద్యమ నేతలు రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య ప్రభుత్వానికి ఈ విషయంలో డెడ్ లైన్ కూడా పెట్టారు. కాపులకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల లేఖ రాశాడు. లేకుంటే జనవరి 2 నుంచి నిరాహార దీక్షకు దిగుతాననిహెచ్చరించారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. 2019 ఎన్నికల్లో కాపు జాతి వైసీపీ గెలుపుకు కృషి చేశారని తమ జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి వారి ఆదరాభిమానాన్ని చాటుకోవాలని ముద్రగడ సూచించారు.

కాపులకు 5 శాతం కోటా ఇవ్వడానికి టీడీపీ ప్రయత్నించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్‌ కాపులకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. కాపులను ఏ,బీ,సీ గ్రూపులుగా గుర్తించి వారికి ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పార్లమెంటు నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో కాపులకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేయాలన్న చిత్తశుద్ధి జగన్‌లో కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు తాంబూలాలు ఇచ్చి తన్నుకు చావండి అన్నట్లు కేంద్రం విధానం ఉందంటూ వైసీపీ దెప్పిపొడుస్తోంది. దమ్ముంటే చంద్రబాబు చేసిన తీర్మానాన్ని కేంద్రం పార్లమెంట్‌లో ఆమోదించాలని అధికార వైసీపీ డిమాండ్ చేస్తోంది. ముస్లిం రిజర్వేషన్లు అంటే ఏపీ అంటున్నారని అదే కాపు రిజర్వేషన్లు అనేసరికి కేంద్రం పేరు చెబుతున్నారంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

ఏపీలో కాపులు ఓటు బ్యాంక్ బ‌లంగా వుంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వారి మద్దతు కీలకం కానుంది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని 2014లో టీడీపీ ఎన్నిక‌ల హామీ ఇచ్చి, వారి ఓట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఆ తర్వాత కాపులకు ఇచ్చిన హామీని అటకెక్కించడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల అంశంపై పోరాటాన్ని కొనసాగించారు. ఆ సందర్భంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబ స‌భ్యుల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించింది. వంద‌లాది మంది కాపుల‌పై కేసులు పెట్టింది. అయితే కేంద్రం అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్ తీసుకురావడంతో అందులో కాపుల‌కు ఐదు శాతం కేటాయిస్తూ చంద్ర‌బాబు త‌న పాల‌న చివ‌రి రోజుల్లో నిర్ణ‌యం తీసుకున్నారు. నాడు కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇది తమ చేతిలో లేని అంశమని ఎన్నికల ముందు చెప్పుకొచ్చింది. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని లైట్‌ తీసుకున్నా బీజేపీ మాత్రం గళం విప్పుతూనే ఉంది. ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్య‌స‌భ‌లో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో కాపు రిజర్వేషన్లపై అడిగిన ప్ర‌శ్న‌కు ఓబీసీ రిజర్వేషన్ల అంశం స్టేట్‌లిస్ట్‌లో ఉన్నందున ఈ వ్యవహారంలో తమ పాత్ర లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది.

రాష్ట్ర ఓబీసీ జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని కేంద్రం స్పష్టత ఇవ్వడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. దీన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌కు అనుకూలంగా మల్చుకునేందుకు వ్యుహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో బాబు కాపులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీవైపు మళ్లింది. జగన్ పార్టీ 151 సీట్లు సాధించడంలో కాపుల సహకారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం మళ్లీ కాపు రిజర్వేషన్ల రగడ రాజుకోవడంతో ఈ రాజకీయ రచ్చను వైసీపీ ఏవిధంగా ఎదుర్కొంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కాపు ఉద్యమ నాయకుల వరుస లేఖలు, మరోవైపు రాజకీయ పార్టీల ఒత్తిడితో ప్రభుత్వం సతమతమవుతోంది. ఇంకోవైపు కాపు రాజ్యాధికారం కావాలని ఆ జాతి కోరుకుంటోంది. అందుకోసం ఆ సామాజికవర్గమంతా ఈసారి పవన్‌కళ్యాణ్‌కు అండగా నిలవాలనే ఆలోచనతో ఉంది, మొత్తంగా, ఎన్నికలకు ముందు ఈ పరిణామాలన్నీ ఎటు దారితీస్తాయి. జగన్ కాపు రిజర్వేషన్ల అంశంపై ఏవిధంగా ముందుకెళ్తారనేది చూడాలి.